తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడున్న నాయకుడు. దేనికీ భయపడే రకం కాదు. ఏమైనా సరే తేల్చేయ్యాలనుకునే తత్వం ఆయనది. ఎవరో తిడతారని,భవిష్యత్తుల్లో ఏదో జరిగిపోతుందని వెనుకాడే నాయకుడు కూడా కాదు. ఆయన ప్రతీ నిర్ణయంలోనూ ధైర్యం కనిపిస్తుంటుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన సందర్భంగానూ రేవంత్ ధైర్యమే సాహసం అన్నట్లుగా వ్యవహరించారు…
తెలంగాణలో మూడు పార్టీలు ఎవరికివారు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎంపీ టికెట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. నారాయణపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ఆయన స్వయంగా వెల్లడించారు. ఒక పక్క ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అందులో కొందరిని ఎంపిక చేసి ఢిల్లీ పంపిన నేపథ్యంలోనే రేవంత్ ప్రకటన కాస్త ఆశ్చర్యకర పరిణామమేనని చెప్పాలి. సాధాణంగా పీసీసీ పంపిన జాబితా ప్రకారం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అధిష్టానం రేవంత్‌కు ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫ్రీడం ఇచ్చిందన్న ఫీలింగ్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ ధైర్యంతోనే రేవంత్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎలాగూ రేవంత్ రెడ్డి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కదా….ఒక అభ్యర్థి సంగతి సరే సరి. మిగతా వాళ్లని ఎప్పుడు ప్రకటిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఆశావహులు ఎవరు. ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది…?
వంశీచంద్ రెడ్డి పేరు ఖరారైంది. మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితేమిటి.. దరఖాస్తు చేసుకున్న 309 మందిలో ఎవరికి టికెట్ వస్తుంది. అసలు దరఖాస్తే చేయని వారికి కూడా ఛాన్స్ వస్తుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలుస్తారని అంతా భావించినా అనూహ్యంగా కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు రాజ్యసభ ఎంపీగా చాన్స్ ఇచ్చింది. దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా స్రవంతి, చార్టెట్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి బరిలో నిలిచేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది.ఆమెకు సీటు ఇచ్చే అవకాశం ఉందని. మల్కాజిగిరి నుంచి హరివర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్నా అంతకంటే బలమైన నాయకుడిని ఈ స్థానం నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నల్గొండ నుంచి జానారెడ్డి, దామోదరరెడ్డి, కోమటిరెడ్డి కుటుంబసభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి పీసీపీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అదే స్థానం నుంచి బరిలో దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ, సూర్యపవన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి, భట్టి, తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఎవ్వరు పోటీ చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి మాత్రం లేదని చెప్పాలి…
కాంగ్రెస్ పార్టీకి కనిష్టంగా పది లోక్ సభా స్థానాలు వస్తాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. అదంతా రేవంత్ రెడ్డి నాయకత్వం వల్లే సాధ్యపడిందని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…