ధర్మవరం రాజెవరు ? -Mission 2024-Dharmavaram-Constituency-YSRCP-TDP-Paritala Sriram-ketireddy venkatramireddy

By KTV Telugu On 23 February, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం.  వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో  ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న నియోజకవర్గం కావడంతో పోరాటం కూడా   ఆ బ్యాక్ గ్రౌండ్ ఉన్న లీడర్ల మధ్యనే ఉంటుంది.  వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ ఖరారు అవుతుంది కానీ.. టీడీపీ నుంచి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ ఐదేళ్లుగా పని చేసుకుంటున్నారు.  కానీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీ టిక్కెట్ తనదేనంటున్నారు.  విచిత్రం ఏమిటంటే ఆయన ఇప్పటికీ టీడీపీలో లేరు. బీజేపీలో ఉన్నారు. కానీ టీడీపీ జెండాలతోనే రాజకీయం చేస్తున్నారు.

ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ  పార్టీకి కంచుకోటగా మారింది.  ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తోంది.  2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డిపై 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ.. కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం.. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ధర్మవరంలో నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు పరిటాల శ్రీరామ్‌ సై అంటున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు. 51 శాతం ఓట్లు సాధించిన ఆయన.. టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15వేల 166 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. వెంకట్రామి రెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు.. ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్‌.. ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటోంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే కనిపించనుంది. అయితే సూర్యానారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరడం.. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్‌ సిద్ధమవడంతో ధర్మవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది.  సూర్యనారాయణ బీజేపీకి రాజీనామా చేయలేదు కానీ ఆయన టీడీపీ జెండాలతో రాజకీయం చేస్తున్నారు.  తాను టీడీపీ తరపునే పోటీ చేస్తానంటున్నారు. కానీ ఆయనను ఇంకా టీడీపీలోకి చేర్చుకోలేదు. ఈ లోపు బీజేపీతో పొత్తుల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి  కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి  గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.  ఎక్కువ రోజులు ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసుకుంటారు. ఎవరికైనా సాయం  చేస్తానని చెబుతూంటారు. కానీ ధర్మవరంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చేనేతల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది.  గత ఎన్నికల తర్వాత వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో చంద్రబాబు పరిటాల శ్రీరామ్ కు బాధ్యతలిచ్చారు.  ధర్మవరంలో పరిటాల కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఆయన సొంతంగా క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోవడంలో విజయం సాధించారు.  అయితే రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయనున్నారు. దీంతో రెండో సీటు ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.  వరదాపురం సూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.  కానీ ముందు నుంచి విబేధాలు ఉండటంతో పరిటాల వర్గం రానీయడం లేదు. ఈ లోపు బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. ధర్మవరం బీజేపీకి కేటాయించి అభ్యర్థిగా సూర్యనారాయణను నిలబెడతారన్న ప్రచారమూ ప్రారంభమయింది.  ముఖా ముఖి పోరు జరిగితే వైసీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన టీడీపీ తరపున ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు.  పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు వైసీపీకి మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన రెబల్‌గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలు ఉన్నాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో జనసేన నేత చిలకం మధూసూదన్‌ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నా.. ఆయనకు టికెట్ దక్కకపోతే ఎంత వరకు ఆయన సపోర్ట్ చేస్తారన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.  అందరూ ఏకమైతే..  వైసీపీ ఆశలు వదిలేసుకోవచ్చు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి