ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనొక సీనియర్ పొలిటీషియన్. కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. కాని కొంతకాలం క్రితం మళ్ళీ యాక్టివ్‌గా మారారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారాయన. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన వేస్తున్న ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ..
కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకుని మళ్ళీ యాక్టివ్‌గా మారిన ఈ రాజకీయ నాయకుడి పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మడకసిర ఎస్‌సీ రిజర్వుడు సీటుగా మారిపోయింది. 2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భూ స్థాపితం కావడంతో విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు రఘువీరారెడ్డి.
కర్నాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడయ్యారు. తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్న రఘువీరారెడ్డి… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటైనా సాధించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.
ఎస్‌సీ రిజర్వుడు మడకశిర నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను బరిలో దించాలని భావిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పక్క రాష్ట్రాల నేతలతో రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రఘువీరారెడ్డికి అక్కడి కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కర్నాటక మంత్రులను ఇంఛార్జులుగా తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. మడకశిర ఆంధ్ర – కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు కన్నడ భాష కూడా మాట్లాడుతారు. దీంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను మడకశిరకు తీసుకొచ్చి అన్నివిధాలుగా ఉపయోగించుకోవాలని రఘువీరారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల సమయంలో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే గెలుపు ఖాయమని రఘువీరా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తన నియోజకవర్గం అయినా కాంగ్రెస్ ఖాతాలో పడేలా చేసుకుని హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయాలన్నది రఘువీరా ప్లాన్. తన సొంత నియోజక వర్గం నుండి పిసిసి అధ్యక్షుడి హోదాలో పోటీ చేసిన రఘువీరారెడ్డినే మడకశిర ప్రజలు ఓడించి ఇంటికి పంపారు. ఇపుడు ఆయన తరపున ఎవరినో బరిలో నిలబెట్టి గెలిపించండి అంటే ప్రజలు ఆదరిస్తారా అన్నది ప్రశ్న. ఎంతో సీనియర్ అయిన రఘువీరా రెడ్డికి ఈ విషయంలో ఇంకెవరో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ పండితులు.
ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలను పార్టీ హైకమాండ్ నియమించినప్పటినుంచి రఘువీరా రెడ్డి.. షర్మిల పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పక్కనే ఉంటున్నారు. దివంగత వై.ఎస్.ఆర్.కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. వై.ఎస్. కేబినెట్ లో మంత్రి పదవి కూడా అనుభవించారు రఘువీరా రెడ్డి. అయితే వై.ఎస్.ఆర్. మరణానంతరం ఏపీలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా వై.ఎస్. తనయుడు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నో ఆరోపణలు చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని మార్ఫింగ్ పార్టీ అని కూడా విమర్శించారు. అయితే ఆ మార్ఫింగ్ పార్టీ చేతిలోనే రఘువీరా రెడ్డి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఇపుడు తన కూతురు వయసున్న షర్మిల వెన్నంటి నడుస్తున్నారు. రఘువీరా రెడ్డి రాజకీయాల్లో అవుట్ డేట్ అయిపోయారని రాజకీయ పండితులు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…