రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదా. వేరే పార్టీ వాళ్లని అందలం ఎక్కించి పక్కన కూర్చోవడానికి రాజకీయాల్లోకి వస్తారా. పవన్ కల్యాణ్ సర్దుకుపోవడం వెనుక ఉన్న కథా..కమావిషు ఏమిటి. చంద్రబాబును సీఎం చేయడం కోసమే ఆయన జగన్ పై కత్తి కట్టారా. మారుతున్న పరిస్థితులపై జన సైనికులు జనసేన అభిమానుల మనోగతం ఏమిటి..
ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కల్యాణ్ పెద్ద హీరో. ఒక రకంగా అనఫిషియల్ నెంబర్ వన్. అన్ని వర్గాలను ఎంటర్ టైన్ చేయగల సమర్థ సినీ నాయకుడు. రాజకీయాల్లో కూడా స్పష్టమైన అవగాహనతో అడుగు పెట్టిన వీరుడు. ప్రజా సమస్యలను క్రమ పద్ధతిలో అర్థంచేసుకుని, ఉచ్చనీచాలు పాటిస్తూ రాజకీయం చేస్తున్న ఉదారవాది. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన తర్వాత కాస్త జ్ఞానోదయమైన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సారి చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. అలా ఉండటంలో తప్పులేదు కూడా. కాకపోతే ఎందుకో ట్రాప్ లో పడిపోయారన్న ఫీలింగు వచ్చేసింది. టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకోవడం మినహా వేరు గత్యంతరం లేదన్న బాడీ లాంగ్వేజ్ పవన్ కు మంచిది కాదనిపిస్తోంది. పవన్ అభిమానులు అడిగిందేమిటి.. ఆయన సర్దుకుపోయిందేమిటి అన్నది ఆలోచిస్తే.. అన్నితక్కువ సీట్లకు సరిపెట్టుకోవడం అవసరమా అన్న ఆలోచన రాకతప్పదు. గత ఎన్నికల్లో జనసేనకు ఏడు శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఈ సారి బాగా బలం పెరిగిందని 15 నుంచి 18 శాతం ఓట్లు రావచ్చని పవన్ టీమ్ అంచనా వేసుకుంటోంది. టీడీపీకి 35 శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెబుతున్నారు. మరి 175 స్థానాల్లో పవన్ పార్టీకి 24 సీట్లేనా ఇచ్చేదని జనసేన అభిమాన జనం లోలోన మథనపడుతున్నారు. లెక్కల అర్థమేటిక్స్ విశ్లేషించే కంటే వాస్తవాన్ని అర్థం చేసుకుంటే చాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నౌ ఆర్ నెవ్వర్ గేమ్ నడుస్తోంది. ఈ సారి ఓడిపోయిన వాళ్లు శాశ్వతంగా భూస్థాపితం కావడం ఖాయమనిపిస్తోంది. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సర్దుకుపోవడమన్నది ఎంతవరకు సమంజసం. హరిరామజోగయ్య లాంటి వాళ్లు కోడై కూసినా పవన్ కల్యాణ్ ఎందుకు మెతక వైఖరి పాటించారన్న సగటు జనసైనికులకు అర్థం కాని అంశం. పైగా పక్క పార్టీ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు… వాళ్లను పట్టించుకోవద్దన్నది మరో ప్రచారం…
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 50 నుంచి 70 సీట్లు ఆశిస్తున్నారని వార్తలు వచ్చాయి. జనసేనకు పెద్దదిక్కులా ఉండే హరిరామజోగయ్య లాంటి వాళ్లులెక్కలేసి మరీ పార్టీకి కనిష్టంగా మూడో వంతు స్థానాలు రావాలని డిమాండ్లు పెట్టారు. లేఖాస్త్రాలు కూడా సంధించారు. ఐనా సరే వాళ్ల మాట చెల్లుబాటైన పరిస్థితి కనిపించలేదు. ఎంతతగ్గించుకున్నా 40 స్థానాలు ఇవ్వాల్సిందేనని జనసేనలో అంతర్లీనంగా జరిగిన చర్చ. అదంతా పోయి ఇప్పుడు కేవలం 24 సీట్లకు సర్దుకుపోవడం ఏమిటన్నది జనసైనికులను వేధిస్తున్న తొలి ప్రశ్న. చంద్రబాబు చాణక్యానికి పవన్ దాసోహమన్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని విశ్లేషణలు జనంలో విస్తరించాయి. చంద్రబాబు సమక్షంలో పవన్ ప్రకటించిన ఐదు సీట్లలో నెల్లిమర్ల, కాకినాడ రూరల్ డవుటనే చెబుతున్నారు. ఇక తెనాలిలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయం కూడా అంత సులభం కాదంటున్నారు. ఎందుకంటే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆ సీటును ఆశించారు. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే జనసేనకు తెనాలి కేటాయించేశారు. ఆలపాటి రాజాకు గుంటూరులో ఒక సీటు ఇవ్వకపోతే మాత్రం ఆయన అలిగే అవకాశం ఉంది. రాజా అభిమానులు వెన్నుపోటు పొడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జనసేన అడిగినదానికి, టీడీపీ ఇచ్చిన దానికి అసలు పొంతనే లేదు. మిత్రపక్షాలను గౌరవించడం సంప్రదాయంగా చెబుతారు. మరి పవన్ ను చంద్రబాబు గౌరవించారా..అవమానించి వదిలేశారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇచ్చిన 24 స్థానాలు గెలిచినా ప్రభుత్వాన్ని పవన్ శాసించలేరు. మరి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడో.. ఆ ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…