జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 అసెంబ్లీ సీట్లే తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొంత మంది రచ్చ చేస్తున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం పవన్ కల్యాణే గోల్ కొట్టారని విశ్లేషిస్తున్నారు. పవన్ తీసుకునే సీట్లు ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉన్న సీట్లే. గెలుపు అవకాశాల్లేని సీట్లు ఇచ్చి సర్దుబాటు చేయడం లేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎక్కడా లేని పార్టీ నిర్మాణం వంటివి చూసుకుంటే పవన్ కల్యాణ్.. బలానికి మంచి సీట్లు తీసుకున్నారని.. అసెంబ్లీలో బలమైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
2019 ఎన్నికలకు వెళ్లే సమయంలో చంద్రబాబునాయుడు … కలిసి రా పవన్ కల్యాణ్ అని పిలిచారు. కానీ పవన్ కల్యాణ్ రానే రానన్నారు. తనకు భారీగా బలముందని..తన వెనుక సైన్యం ఉందని కింగ్ ను కాకపోయినా కింగ్ మేకర్ ను అవుతానని అనుకున్నారు. తన వెనుక తనను అభిమానించే వర్గం.. కాపు వర్గం అంతా ఉన్నారని అనుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు రాజకీయం అర్థమైంది. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పు చేయదల్చుకోలదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. పీఆర్పీకి మొత్తం 294 సీట్లలో 18 అసెంబ్లీ స్థానాలు, పోలైన ఓట్లలో 18 శాతం దక్కాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం మాదిరిగా పీఆర్పీని ఏడు నెలల్లో పాలకపక్షంగా మార్చేద్దామనుకున్న చిరంజీవి కోరిక నెరవేరలేదు. తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం మేరకు చిరంజీవి రాజ్యసభకు కాంగ్రెస్ టికెట్ పై ఎన్నికయ్యాక డా.మన్మోహన్ సింగ్ యూపీఏ కేబినెట్లో పర్యాటక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ప్రాంతీయ రాజకీయ పక్షాన్ని నడపడం కాపు హీరోల వల్ల కాదనే అపప్రధను పోగొట్టడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల ముందు జనసేన పార్టీ పేరుతో కాపులు సహా తెలుగువారందరి కోసం ప్రాంతీయ పార్టీ పెట్టారు. లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో ఆయన జనసేన పార్టీ నిర్మాణం జోలికి పోలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేతతో కలిసి అవశేషాంధ్రలో అనేక ఎన్నికల బహిరంగసభల్లో ప్రసంగించారు కల్యాణ్ బాబు. అంతేగాని అసలు రూపం, సారం లేని తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపకుండా తెలివైన పని చేశారు.
జనసేన మద్దతుతో ప్రధాని, సీఎం పదవులు పొందిన మోదీ, చంద్రబాబులతో ఏం జరిగిందో ఏమోగాని 2019 జోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ఎన్నికల్లో దిగితే జనసేనాని పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. అది కూడా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోనే సాధ్యమైంది. దీంతో గత ఐదేళ్లుగా ఆయన పార్టీలో తనకు కోపైలట్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ (ఎన్టీఆర్ కు స్వయం ప్రకటిత కోపైలట్, మొదటి విఫల వెన్నుపోటుదారుగా అపకీర్తి మూటగట్టుకున్న నాదెండ్ల భాస్కరరావు గారబ్బాయి సాయంతో జనసేనను కిందామీదా పడి నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు, ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీతో మొదట పొత్తు పెట్టుకున్నా చివరికి తెలుగుదేశం అధినేతతోనే సీట్ల సర్దుబాటు ప్రకటించడంతో పవన్ కల్యాణ్ రాజకీయ వివేకం అర్ధమౌతోంది. పెద్దన్నయ్య చిరంజీవితో పోల్చితే ఆయన చిన్న తమ్ముడే ఆంధ్రా పాలిటిక్స్ లో కాపుల పేరు సజీవంగా ఉండేలా చేయడంలో కొంత వరకు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కిందటి ఎన్నికల్లో జనసేన కేవలం 5.53 శాతం ఓట్లను మాత్రమే పొందినాగాని 24 అసెంబ్లీ సీట్లలో, మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీచేయడానికి తెలుగుదేశం అధినేతను పవన్ బాబు ఒప్పించడం నిజంగానే కాపుల రాజకీయ చరిత్రలో చాలా గొప్ప గెలుపు.
చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కురువృద్ధులు, కాకలు తీరిపోయిన తెలుగు కాపు పాత్రికేయులు కొణిదెల పవన్ కల్యాణ్ పై విరుచుకుపడడం హేతుబద్ధంగా లేదు. పాతిక లోపు అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం అంటే కాపుల పరువు తీయడంగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి మేధావులు భావిస్తున్నారంటే వారు రాజకీయంగా ఏ లోకంలో జీవిస్తున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం. తెలుగునాట ఎన్నికల రాజకీయాల్లో కాపు సముదాయానికి ఒకరకంగా ఎంతో మేలు జరిగిందని చెప్పవచ్చు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత కాపులకు రాజ్యాధికారం రాకున్నా రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కమ్మ మాజీ సీఎం అయినా కాపుల జనామోదంతోనే మరోసారి గద్దెనెక్కుతారనే జనాభిప్రాయం పవన్ కల్యాణ్ వ్యూహాలు, ఎత్తుగడల ఫలితంగానే ప్రచారంలోకి వచ్చింది. ఏపీ 16వ శాసనసభ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్ అంటే కమ్మ ఫ్యాక్టర్ కాదనీ– కాపు ఫ్యాక్టర్ అని తేల్చి చెప్పినందుకైనా కల్యాణ్ బాబును సకలాంధ్ర కాపు కులాల సముదాయం మెచ్చుకుంటే మంచిది. ‘కే’ ఫ్యాక్టర్ వల్ల ఇప్పుడు జనసేనతోపాటు రెడ్డి, కమ్మల ఆధిపత్యం కాస్త ఎక్కువగానే కనపడే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఈసారి అసెంబ్లీ టికెట్లను కాపులకు వారి జనాభా నిష్పత్తికి మించి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదంతా జనసేనాని వల్లే సాధ్యమైందనుకోవాలి. చూస్తుంటే ఈసారి తెలుగునాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మున్నెన్నడూ లేని విధంగా ‘కే’ ఫ్యాక్టర్ చర్చనీయాంశంగా మారుతోంది.
పవన్ కల్యాణ్ గెలిస్తే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ ఆయన ఖచ్చితంగా అధికార కేంద్రం అవుతారు. గతంలో ఏ కాపు నేత అయినా కమ్మ లేదా రెడ్డిలకు జీ హుజూర్ అనే స్థాయి నుంచి సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా పొజిషన్ లో ఉన్నారా ? లేనే లేదు. కానీ ఈసారి అధికారం ఖాయం… అధికారంలో భాగం ఖాయం… కాపులకు ఎంత మేలు జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. మా బలం అంతా ఇంతా అని గాల్లో మేడలు కట్టుకునే మేధావులు మేలు చేయకపోగా కీడు చేస్తారు. పవన్‌కు ఇది అర్థమయింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…