ఫైర్ బ్రాండ్ విజయశాంతిలో ఫైర్ లోపించిందా. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమెలో వేగం తగ్గిందా. చివరాఖరుకు ఒక ప్రకటన చేస్తే అందులోనూ లిజిక్కు లోపించిందా..ఇప్పుడామె ఏం చేయబోతున్నారు. ఆమె చెయాల్సిందేమిటి…
లేడీ అమితాబ్ అన్ని పార్టీలు తిరిగారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు.అప్పటికప్పుడు చేరిన వారికి కూడా టికెట్ ఇచ్చినా…. విజయశాంతిని మాత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. రావమ్మా విజయశాంతి కూర్చో అని మీటింగుల్లో కుర్చీలు వేశారే కానీ…ఎన్నికల్లో నామినేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఈ సారి అయినా ఆమెకు టికెట్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు. పార్టీ వైపు నుంచి మాత్రం ఎలాంటి హామీ రాలేదు.గాలికిపోయే పేలపిండి వైపు చూస్తూ కృష్ణార్పణం అనుకున్నట్లుగా.. గెలిచే కాంగ్రెస్ లో చేరి తన వల్లే గెలిచారనుకునే తత్వమున్న విజయశాంతికి ఇప్పుడు పార్టీలో మారుతున్న పరిణామాలు ఏ మాత్రం బోధపడటం లేదు. ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ గానీ ఆమెను వరించిన పాపాన పోలేదు..
విజయశాంతి ముందున్న ఆప్షన్స్ ఏమిటి. ఇప్పుడామె ఆశిస్తున్నదేమిటి. ఆమెకున్న అవకాశాలు ఏమిటి.ముందు వెనుకా ఆలోచించకుండా విమర్శలు చేసే విజయశాంతి ఈ సారి ఎలాంటి వ్యూహంతో అడుగులు వేసే అవకాశం ఉంది.
ఆమెకు నిత్య అసంతృప్తివాదిగా పేరుంది. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమెలో అసంతృప్తే కనిపిస్తోంది. తనకు అన్యాయం జరిగిపోతుందన్న ఫీలింగును ఎప్పటికప్పుడు బయట పెడుతుంటారామే. ఎన్నికల ఫలితాల తర్వాత బహుశా ఇప్పుడే ఆమె ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. అదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డిని ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందులోనూ తప్పులో కాలేశారు. అవును బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా కాంగ్రెస్ ను గెలిపించారు.. కాక బీఆర్ఎస్ పై అనుకూలతతోనే కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని ఆమె ప్రశ్నించడం విజయశాంతి పరిణితి లోపానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పట్ల అనుకూలత, విశ్వాసంతో ఓటు వేశారని చెప్పాల్సిన విజయశాంతి ఏదేదో మాట్లాడేస్తున్నారని చెప్పుకుంటున్నారు. విజయశాంతికి లోక్ సభ టికెట్ ఇస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్ సభా స్థానాన్ని ఆమె ఆశిస్తున్న తరుణంలో ఆ నియోజకవర్గానికి ఆశావహుల సంఖ్య బాగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగ్గా రెడ్డి నుంచి నలుగురైదుగురు బలమైన నాయకులు మెదక్ సీటును ఆశిస్తున్నాురు. అందుకనే ఇప్పుడు విజయశాంతికి కాంగ్రెస్ పార్టీలో కష్టకాలం నడుస్తోందని చెప్పక తప్పదు.
ప్రజాబలం తక్కువ ఉండి, ప్రచారానికి పనికి వచ్చే వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో లేదు. ఉండి ఉంటే విజయశాంతికి నామినేటెడ్ రాజ్యసభ వచ్చి ఉండేది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవి ఇవ్వాలంటే ఆమెకు అలాంటి సమర్థత ఉందన్న విశ్వాసం పార్టీకి లేదు. దానితో కాంగ్రెస్ లోనూ విజయశాంతి భవిష్యత్తుపై అనుమానాలు తప్పడం లేదు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…