రేవంత్‌కు లిట్మస్ టెస్ట్ మల్కాజిగిరి – REVANTH REDDY-MP SEATS

By KTV Telugu On 29 February, 2024
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీని గెలిపించానని  రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు. ఆయన అనుచరులు కూడా అదే చెబుతారు. కానీ ఆయన ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. అదీ కూడా భారీ తేడాతో.  అక్కడెందుకు రేవంత్ గెలిపించలేకపోయారు ?., ఇప్పుడు సీఎంగా ఉండి గెలిపించగలరా ?.  ఒక్క మల్కాజిగిరి కాదు గ్రేటర్ పరిధిలో  పార్లమెంట్ ఎన్నిక్లలో కాంగ్రెస్ కు ఫలితాలు చూపించకపోతే రేవంత్ నాయకత్వం బలహీనపడుతుంది. అందుకే రేవంత్రెడ్డి ఇప్పుడు ఆపరేషన్ గ్రేటర్ ప్రారంభించారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలను దక్కించుకునే పొలిటికల్ పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ   ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.  ఈ క్రమంలోనే గత వారం రోజులుగా ఇతర పార్టీల నుంచి నేతలను చాప కింద నీరులా సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. గ్రేటర్‌లోని బీఆర్ఎస్ కీలక లీడర్లను ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే.. అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే ఉన్నాయి.  తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్కటీ గెలవకపోవడం కొసమెరుపు. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ గ్రేటర్‌పై పట్టు సాధించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్‌సభ స్థానంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి.

నాలుగు లోక్‌సభ స్థానాలపై రాజకీయ వ్యుహాకర్త సునీల్ కనుగోలు టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నివేదికపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షితో రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడునాలుగు దఫాలుగా చర్చలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల వ్యుహాంలో భాగంగానే జీహెచ్ఎంసీ మాజీ మేయర్లు, బీఆర్ఎస్ నేతలు తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్, తీగల అనితారెడ్డిలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మరో బీఆర్ఎస్ మహిళా నేత సైతం త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

2019లో జరిగిన   లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కేవలం 18.3 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక జరిగిన  గ్రేటర్ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితం రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ న్యాయకత్వం కొత్త అభ్యర్థిని బరిలోనిలిపే అవకాశం ఉంది. ఎంపీ సీటుకు సంబంధించి స్పష్టమైన హామీ తర్వాతే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరినట్టు సమాచారం. సికింద్రాబాద్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ను ఖరారు చేసినా ఆశ్చర్యం లేదు.  జనాభాలో ముస్లిములు 59 శాతం ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రజాధారణ మెండుగా ఉన్న మైనారిటీ నేత కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించడం తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారింది. మల్కాజ్‌గిరి, చేవెళ్లతో పాటు ప్రతి లోక్‌సభ స్థానానికి ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుంతుంది.  తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ద్వారా పార్టీ అధిష్టానం వద్ద మరొకసారి మెప్పు పొందేదుకు రేవంత్ రెడ్డి తన పూర్తి శక్తిని వడ్డుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణలో మరింతగా బలపడుతుంది.  అందుకే సర్వశక్తులు ఒడ్డటం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి