పార్లమెంటు ఎన్నికల తర్వాతి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉండబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడి, అసహనంతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారన్నారు. తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితి తలెత్తవచ్చన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబోటీ మెజార్టీతో 64సీట్లతో ఉందని, తుమ్మితే ఊడిపోయే పరిస్థితిలో ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతా తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండని, ఏదైనా జరుగవచ్చన్నారు. ఈ మాటలు ఆషామాషీగా అన్నవని రాజకీయవర్గాలు అనుకోవడం లేదు. ఎందుకంటే కొంత కాలంగా ఇదే చర్చ తెలంగాణలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పాలనకు అంత పలుకుతాయని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీవి కావు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్,కర్ణాటకల్లో బీజేపీకి కొంత బలం ఉంది. కానీ తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే… దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అయినా ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ కు దూరం చేసినా… పడగొట్టాలంటే… బీఆర్ఎస్ మద్దతు కావాల్సిందే. లక్ష్మణ్ మాటల్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ తో కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోందన్నప్రచారం జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు సహజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందన్నదానిపై బీఆర్ఎస్ నేతలు ఎన్ని సార్లు చర్చ పెట్టారో ఎన్ని సార్లు ప్రకటనలు చేశారో చెప్పడం కష్టం . దాదాపుగా ప్రతీ రోజు ఇదే మాట వినిపిస్తోంది. అలా అని కాంగ్రెస్ మైనార్టీ సర్కార్ను నడపడం లేదు. సాధారణ మెజార్టీ కన్నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలేనన్న ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని సార్లు బీజేపీ నేతలు కూడా ఈ ప ్రకటనలు చేశారు.
మూడోసారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ తెలంగాణలో బీఆరెస్ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. తన చిరకాల ప్రత్యర్థి ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమని, మూడునాళ్ల ముచ్చట అని, లోకసభ ఎన్నికల తరువాత ఏ క్షణమైనా కూలిపోతుందని, కాంగ్రెస్ లో 20 మంది వరకు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఉన్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే వారికి అవసరమైన నిధులు మకూర్చారని, కేసీఆర్ కనుసైగ చేస్తే చాలు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని, వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉండవనే వాదనలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతోంది. ఏ అధికారం లేకుండా కేసీఆర్ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆకర్షించలేరు… అంతే కాదు.. తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేరు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ అవసరం.
లక్ష్మణ్ చతెప్పినట్లుగా హిమచల్ లేదా కర్ణాటక పరిస్థితి తెలంగాణలో లేదు. అక్కడ బీజేపీ .. అధికార పార్టీల్లోచీలిక తెస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.కానీ తెలంగాణలో సాధ్యంకాదు. బీఆర్ఎస్ను కలుపుకోవాల్సిందే. బీఆర్ఎస్ రెడీగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే అత్యధిక సీట్లు సాధించిన తర్వాత కాంగ్రెస్ డీలా పడుతుంది. కేంద్రంలో ఎలాగూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహం… తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ సీట్లు గెల్చుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించడం చాలా సులువు అని బీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో కడియం శ్రీహరి చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ఐదారుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే చాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఇదేమంత కష్టం కాదని కేసీఆర్కుతెలుసు.
కాంగ్రెస్ లో ఉన్న కొందరిని ఈడీ, సీబీఐలను బూచిగా చూపించి తమవైపు తిప్పుకుని కలగూర గంప సర్కార్ ను ఏర్పాటు చేసే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బీఆరెస్, కాంగ్రెస్ నుంచి జంప్ అయిన సభ్యులతో బీజేపీ సంకీర్ణ సర్కార్ కొలువుదీరుతుందనేది ఇక్కడ అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తాము ఏం చేస్తామో ముందస్తు ప్రణాళికలను వేసుకుని రివర్స్ లో అదే అమలు చేస్తూంటాయి రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా అదే వ్యూహంలో ఉందంటున్నారు. బీజేపీకి ఇతర ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ లేదా సంకీర్ణ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అధికారం ఉండటం ఇష్టం ఉండదు. చాన్స్ దొరికిన వెంటనే వేటు వేస్తుంది. ఆ ప్రభత్వాలను కాపాడుకోవడం అంత తేలిక కాదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…