వై దిస్ తాడేపల్లిగూడెం కొలవరీ-Jenasena -TDP

By KTV Telugu On 1 March, 2024
image

KTV TELUGU :-

వై దిస్ కొలవరీ.. అనేది తమిళ నటుడు ధనుష్ సినిమాలో ఓ పాట. దాన్ని ధనుషే స్వయంగా  పాడారు. పాట హిట్టు, సినిమా ఫ్లాప్  అన్నది వేరే విషయం.  కొలవరీ అంటే చంపేయ్యాలన్నంత కసి అని అర్థం. తాడపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయకేతనం జెండా సభలో కూడా అదే జరిగింది. ఉమ్మడి ప్రత్యర్థి అయిన సీఎం జగన్ ను చంపెయ్యాలన్నంత కసి కనిపించినా..ఆ సభ ద్వారా నేతలు కొత్తగా ఒరిగించిందేమిటో మాత్రం అర్థం కాలేదు..

గూడెం సభలో చంద్రబాబు, పవన్ కలిసి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడారు. ఉమ్మడి శత్రువు జగన్ ను చంపెయ్యాలన్నంతగా వారి  తీరు కనిపించింది. టీడీపీ, జనసేన పార్టీల పొత్తును చూడలేని శక్తులు ఈ ఐక్యతను భగ్నం చేయడానికి అనేక కుట్రలు చేస్తాయని వాటిలో పడవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు పార్టీల్లో బాగా పనిచేసిన వారు అనేక మంది ఉన్నారని. అందరికీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. బాగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యతను మేం ఇద్దరం తీసుకుంటామని, రెండు పార్టీల్లో ఎవరూ అహానికి పోవద్దు. ఇద్దరిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. రెండు పార్టీలు కలిసి అడుగు వేయాలని చంద్రబాబు సందేశమిచ్చారు. పొత్తు ధర్మాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సమష్టిగా పనిచేయాలని కోరారు. పవన్ ఇంకాస్త ముందుకు వెళ్లి ఆవేశంగా మాట్లాడారు. తన నాలుగో పెళ్లాం జగన్ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. జగన్  భార్య భారతి ప్రస్తావన తెచ్చి.. వైసీపీ వారు చేసిన  తప్పే చేశారనిపించింది. ఇద్దరు నేతలు దాదాపుగా సైకో అన్నట్లుగా సంబోధించారు.

పాతదే అయినా వై నాట్ పులివెందుల అన్న చంద్రబాబు నినాదం ఆకట్టుకునేదిగానే ఉంది. అయితే ఆ రెండు ఆంశాలపై మాత్రం ఇద్దరు నేతల వైపు నుంచి  ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఎందుకు జరిగిందన్న చర్చ కూడా తెరలేచింది….

ఐక్యతను  చాటేందుకు ఉపయోగపడుతుందన్న ఆకాంక్ష తప్ప తాడేపల్లిగూడెం సభ ఎందుకు ఏర్పాటు చేశారన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదీ జనసేన నిర్వహించిన సభ కావడంతో  సేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో  తక్షణమే ప్రకటిస్తారని అభిమానులు ఎదురుచూశారు. ఆయన ఫ్రెంచ్ తత్వవేత్త సూక్తులు చెప్పారే కాని అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా లేక వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతారా అన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడి మేనిఫెస్టో వ్యవహారం కూడా కోల్డ్ స్టోరేజీలో పడిపోయింది.  ఉమ్మడి మేనిఫెస్టోను  విడుదల చేసేందుకే విజయకేతనం సభను నిర్వహిస్తున్నారని తొలుత  ప్రచారం జరిగింది. సభకు ముందు ప్రెస్ మీట్స్ లో పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు అలాంటి సంకేతాలే ఇచ్చారు. పైగా టీడీపీ అనుకుంటున్న సూపర్ సిక్స్ గ్యారెంటీలకు తోడు పవన్ ప్రతిపాదించే  మరో నాలుగు చేర్చి సూపర్ టెన్ అంటూ మేనిఫోస్టోలో ప్రస్తావిస్తారని పార్టీల శ్రేణులు భావించాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కార్యకర్తలు కోరుకున్నదీ నెరవేరలేదు.  పైగా ఒక వర్గం జనసేన నేతలకు సభా వేదికగా పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరికలు చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు. టీడీపీ ఇచ్చిన 24 స్థానాలను తీసేసుకోవడం కరెక్టుకాదని, కొందరు వాదించడం మొదలు పెట్టారు. దానితో తన  నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్లు తన వాళ్లు కాదని పవన్ గట్టిగా హెచ్చరించారు. తన నిర్ణయాన్ని ప్రశ్నించకుండా.. జనసైనికుల్లా, వీర మహిళల్లా తన వెంట నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

మొదటి నుంచి  పవన్ కల్యాణ్ స్పీచులంటే కొన్ని అనుమానాలుంటాయి. పవర్ ఫుల్ గా ప్రారంభమై, పేలవంగా ముగుస్తామన్న చర్చ కూడా చాలా కాలంగా జరుగుతోంది. తాడేపల్లిగూడెంలో అదే జరిగింది. పవన్ ఏదో మాట్లాడాలనుకుని,ఏదో మాట్లాడేసినట్లుగా చెప్పుకోవడం జనసైనికుల వంతయ్యింది. చంద్రబాబు ప్రసంగంలో కొంత నిబద్ధత కనిపించినా చేసిన ఒకటి రెండు తప్పులతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు అవకాశం వచ్చింది. మరి తాడేపల్లిగూడెం మీటింగ్ పరిణామాల  ప్రభావం ఎలా ఉంటాయో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి