‘డిజిటల్ అరెస్ట్’ -ఈ సైబర్ క్రైమ్ బారిన పడొద్దంటే ఇది తెలుసుకోవాలి ! -CYBER CRIME AWARENESS

By KTV Telugu On 9 March, 2024
image

KTV TELUGU :-

రోజుకో రకం సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట కొత్త రకం ఘరానా మోసాలకు తెర లేపారు.గతంలో ఢిల్లీ, నోయిడా, ముంబయి నగరాల్లో సాగిన ఈ రకం మోసాలు తాజాగా హైదరాబాద్ నగరానికి కూడా పాకాయి. డిజిటల్ అరెస్ట్ కొత్త రకం సైబర్ నేరం కావడంతో బడా వ్యాపారులు భయంతో కంగారుపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యాపారిని ఇదే తరహాలో మోసగించారు. ఈ మోసం గురించి అవగాహన వస్తే.. సులువుగా బయటపడవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బడా వ్యాపారికి ఇటీవల కొరియర్ వచ్చిందంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులమని చెప్పి, మీకు ఫెడ్ ఎక్స్ కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టారు. దీనిపై తాము కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. అంతే దీంతో భయ పడిన వ్యాపారి వారు చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేయాలని కోరారు. డ్రగ్స్ కేసు భయంతో సదరు వ్యాపారి 98 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. డబ్బును బదిలీ చేశాక అనుమానంతో వ్యాపారి హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అప్రమత్తమై బ్యాంకు ఖాతా గురించి ఆరా తీస్తే ఆ ఖాతా జమ్మూకశ్మీరులోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు జుజు అనే వ్యక్తి ఖాతాగా తేలింది. పేర్లు ప్లాన్లు మారుతున్నాయి.. కానీ ఇలాంటి క్రైమ్స్ మాత్రం పెరుగుతున్నాయి. ఇలా హైదరాబాద్ నగరంలోనే కాదు గత ఏడాది దేశంలో 200 మందికి పైగా ఇలా కొత్త రకం మోసాల బారిన పడ్డారని సాక్షాత్తూ నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. డిజిటల్ అరెస్ట్ మోసాలు 2021వ సంవత్సరంలో 345 జరిగాయి. 2022వ సంవత్సరానికి వీటి సంక్య 685 కేసులకు పెరిగిందని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదికే వెల్లడించింది.

సైబర్ నేరగాళ్లు డిజిటల్ హౌస్ అరెస్ట్ పేరిట కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డిజిటల్ హౌస్ అరెస్ట్ బాగోతం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము ఐటీ,ఈడీ,కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ అధికారులమని నమ్మిస్తారు. సిమ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని చెప్పి మోసగాళ్లు బెదిరిస్తారు. మీపై విచారణ పూర్తయ్యే వరకూ ఎక్కడకు కదలడానికి వీలు లేదని చెప్పి కట్టడి చేసి, డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. దీంతోపాటు మీకు సంపాదనకు మించిన ఆస్తులున్నాయని, ఐటీ ఎగవేశారని, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని చెప్పి కొందరు అధికారుల్లా మారువేషాల్లో, నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని రైడ్ చేస్తారు. వ్యాపారులు ఎవరికీ ఫోన్ చేయకుండా వారి ఫోన్ కనెక్షన్ ను కట్ చేసి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని డబ్బులు, బంగారాన్ని స్వాధీనం చేసుకొని విచారణకు కార్యాలయానికి రావాలంటూ చెప్పి పలాయనం చిత్తగిస్తారు. ఇదీ అరెస్ట్ పేరిట వీడియో కాల్ లోనే నిర్బంధించి డబ్బులు దండుకోవడమే ‘డిజిటల్ అరెస్ట్’.

డిజిటల్ అరెస్ట్ స్కాం మోసగాళ్లు సాధారణంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయినపుడు బాధితులు వెంటనే పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి,. సైబర్ స్కామర్ల కొత్త మోడస్ ఆపరేండస్ గురించి పోలీసులు పౌరులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ హౌస్ అరెస్ట్ మోసాలు హైదరాబాద్ కు వ్యాపించడంపై నగర పోలీసులు తాజాగా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ప్రకటించారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.

సైబర్ మోసాల్లో గతంలో హ్యాకింగ్ చేసి.. దోపిడీ చేసేవారు. ఇప్పుడు కొత్త పద్దతుల్లో మానసిక దాడి చేస్తున్నారు. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్ లైన్ యుగంలో.. ఆస్తుల్ని కాపాడుకోవడం.. అంటే… చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా వివిధ పద్దతుల్లో దాడి చేసి.. సొమ్ము అపహరిస్తున్నారు. అందుకే.. ఇలాంటి సైబర్ క్రైమ్స్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు పోలీసులు చేస్తూ వస్తున్నారు. ప్రజలుకూడా ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా లేకపోతే మోసపోయిన తర్వాత డబ్బు రికవరీ చేసుకోవడం అంత తేలిక కాదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి