పొత్తులు మార్చిన ముఖ్యమంత్రి నితీష్ ! మరి చంద్రబాబు? – CBN-Nitish-Kumar-BJP-TDP

By KTV Telugu On 9 March, 2024
image

KTV TELUGU :-

ఎన్డీయేలో   ఒకప్పటి ఇద్దరు పార్టనర్లు  వేసినన్ని పిల్లిమొగ్గలు దేశ రాజకీయచరిత్రలోనే  ఎవ్వరూ వేయలేదు. ఒకరు బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ కాగా..రెండో వ్యక్తి  ఏపీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. బిజెపిని ఈ ఇద్దరూ చాలా తిట్టి పోశారు. ఆ వెంటనే అదే బిజెపితో అంటకాగారు. తిరిగి  అదే బిజెపికి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు బాగాలేక జై బిజెపి అన్నారు.  ఇలా  యూ టర్నులు తీసుకోవడంలో నితిష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా పోటీలు పడుతున్నారు.

బిహార్ లో నితిష్  కుమార్ బిజెపి తో  కలిసి చాలా సార్లు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత బిజెపితో కటీఫ్ చెప్పి  ఆర్జేడీతో జట్టు కట్టారు. ఆ తర్వాత మళ్లీ ఆర్జేడీకి  గుడ్ బై చెప్పి ఎన్డీయేలో చేరిపోయారు. చిత్రం ఏంటంటే ఎన్ని సార్లు   పొత్తులు మార్చినా నితిష్ కుమార్ ముఖ్యమంత్రి గా కొనసాగుతూనే ఉన్నారు. బిహార్ కు ఇప్పటి వరకు ఆయన 8 సార్లు ముఖ్యమంత్రి కావడం గమనార్హం.  ఇన్ని సార్లు తిట్టిన పార్టీతోనే తిరిగి జట్టు కట్టడం అవకాశ వాద రాజకీయమే   అంటున్నారు రాజకీయ పండితులు. అయితే నితిష్ మాత్రం పదవే పరమావధిగా చక్రం తిప్పుతూ వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నితిష్ కు ఏ మాత్రం తీసిపోరు. కాకపోతే నితిష్ లా ఎనిమిది సార్లుముఖ్యమత్రి కాలేదు చంద్రబాబు. 1999 ఎన్నికల్లో బిజెపితో  పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్డీయేలో భాగస్వామి అయ్యారు. 2002లో గోధ్రా అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని బర్తరఫ్‌ చేయాలని ప్రధాని వాజ్ పేయ్ పై ఒత్తిడి తెచ్చారు చంద్రబాబు. అయితే అది జరగలేదు.2004లో బిజెపితో పొత్తు పెట్టుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇక జీవితంలో బిజెపితో కలిసే ప్రసక్తే లేదన్నారు. తన రాజకీయ జీవితంలో చేసిన పెద్దపొరపాటు బిజెపితో కలవడమే అని కూడా అన్నారు.

2009 ఎన్నికల్లో టి.ఆర్.ఎస్., కమ్యూనిస్టు పార్టీలతో కలిసి  ఎన్నికల బరిలో దిగారు చంద్రబాబు. వరుసగా రెండో సారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికలు వచ్చాయి. విభజిత ఏపీలో  దూసుకుపోతోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను నిలువరించడానికి ఒంటరి పోరాటంతో సాధ్యం కాదని భావించిన చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. తాను అరెస్ట్ చేయిస్తానన్న నరేంద్ర మోదీని బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. రాజకీయాల్లో శాస్వత శత్రువులు ఉండరనుకున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోదీ వెంటపడి మొత్తానికి పొత్తు సాధించారు. మోదీ ప్రభంజనంతో  అధికారంలోకి వచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగానూ ఉన్నారు.

2018లో  ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చొచ్చుకుపోతోంది.  అంత వరకు హోదాతో ఒరిగేదేమీ లేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు   ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని గమనించారు. అంతే  ఎన్డీయే కి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికలకు ఒంటరిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల ప్రచారంలో బిజెపిని, ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో విమర్శించారు. మోదీని ఓడించి గుజరాత్ పంపించేస్తానన్నారు. అయితే ఆయన అంచనా దెబ్బతింది. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాగా ఏపీలో వైసీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రంలోని బిజెపితో తిరిగి స్నేహాన్ని  రెన్యువల్ చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు ముగియగానే తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బిజెపిలోకి పంపారు. సుజనా చౌదరి, సిఎం రమేష్,  టి.జి.వెంకటేష్, గరికపాటి మోహన్ రావు లు బిజెపిలో చేరారు. ఏడాదిన్నరగా తనకు సన్నిహితంగా ఉంటోన్న జనసేన అధినేత పవన్ ద్వారా బిజెపితో పొత్తుకోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. అది వర్కవుట్ కాలేదు. తాజాగా  కేంద్ర బిజెపి పెద్దల నుంచి పిలుపు వచ్చిందంటోన్న టిడిపి వర్గాలు పొత్తులపై మాట్లాడేందుకు చంద్రబాబు హస్తిన వెళ్లారని అంటున్నారు.  బిజెపి పొత్తుకు సై అంటుందా నై అంటుందా అన్నది  వేరే విషయం. తాను తిట్టిపోసిన బిజెపితో మరోసారి జట్టు కట్టడాన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారో అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి చంద్రబాబు చెప్పబోయేది ఒకటే. రాష్ట్ర ప్రజలకోసం..అభివృద్దికోసమే  మరోసారి బిజెపితో చేతులు కలిపాననే ఆయన అంటారని రాజకీయపరిశీలకులు ఊహిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి