లక్టోరల్ బాండ్లపై SBI సైలెంట్ – నిజం బయటకొస్తే ఏమవుతుంది ?

By KTV Telugu On 11 March, 2024
image

KTV TELUGU :-

ఎలక్టోరల్‌ బాండ్ల  ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను మార్చి 6 లోగా పొందుపర్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఎస్‌బీఐని  ఆదేశించింది.  కానీ ఎస్‌బీఐ ఇవ్వలేదు.  జూన్‌ 30 వరకు గడువును కోరుతూ ఎస్‌బీఐ.. సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఎస్‌బీఐ.. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పత్రాలను తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఎస్‌బీఐ చేసిన ఈ పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఒక్క క్లిక్ తో వచ్చే సమాచారం ఇవ్వడానికి ఎస్‌బీఐ ఎందుకు వెనుకడుగు వేస్తోంది ? బీజేపీ ప్రమేయం వల్లనే చెప్పడం లేదా ?

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు  ఆ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ  మార్చి 6 లోగా  ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని ఆదేశించింది. కానీ  ఆ ఆదేశాలను ఎస్‌బిఐ అమలు చేయకుండా అందుకు మరో మూడు నెలలకు పైగా  సమయం కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.  ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనందున వాటి ద్వారా రాజకీయ పార్టీలు పొందినది ముమ్మాటికీ అక్రమ సొమ్ము. ఈ సమాచారాన్ని వెనువెంటనే ఇవ్వడం ఎస్‌బిఐ చట్టబద్ద బాధ్యత.  ఇదేమీ చిక్కుముడిపోయిన .. ఆడిటింగ్ చేయించి మరీ ప్రకటించాల్సి  సమాచారం కాదు.  ఒక్క క్లిక్ తో  డీటైల్స్ మొత్తం వస్తాయి.

అయినప్పటికీ జూన్‌ 30కల్లా సమాచారమంతా అందచేస్తామనడం ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా వుండేందుకు వేసిన ప్లానేనని అర్థం చేసుకోవచ్చు.  ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు దేశంలోని వివిధ ఎస్‌బిఐ శాఖలలో ఉన్నాయని, వీటన్నింటినీ డీకోడింగ్‌ చేయడం కష్టమైన పని అని, కొంత సమయం అవసరమవుతుందని ఎస్‌బిఐ కోర్టుకు చెబుతోంది. కానీ  టెక్నాలజీ గురించి తెలిసిన సామాన్యుడికి ఎంత అబద్దం చెబుతున్నారో సులువుగానే అర్థమవుతుంది.  ఎన్నికల బాండ్ల నిర్వహణ కోసం ఎస్‌బిఐకి ఇప్పటికే ఐటీ వ్యవస్థ కూడా ఉంది. తన సకల కార్యకలాపాలనూ డిజిటలైజ్‌ చేసిన ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను మూడు వారాల్లో ఇవ్వలేకపోవడం నమ్మశక్యం కాదు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా, త్వరగా తెలుసుకోవచ్చునంటూ 2019 మార్చి 15న కేంద్ర ప్రభుత్వం  అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది.  ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంలో విఫలమైన భారతీయ స్టేట్‌ బ్యాంకు పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌  వంటి సంస్థలు  కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఎస్‌బిఐ దరఖాస్తుతో పాటే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కూడా ఈ విచారణకు వచ్చే అవకాశముంది. బాండ్ల వివరాలను మార్చి 13వ తేదీ లోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కూడా ఆదేశించింది.  రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు అందజేశారు, ఎంత మొత్తంలో ఇచ్చారు అనే సమాచారాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించింది.

అయితే అసలు డీటైల్స్ ఇవ్వని ఎస్‌బీఐ తన వెబ్ సైట్ నుంచి   ‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’, ‘ఫ్రీక్వెంట్లీ ఆస్‌క్డ్‌ క్వశ్చన్స్‌   అనే పేరుతో ఉన్న లింక్‌లు, వెబ్‌పేజ్‌లను తొలగించింది.  ‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’ అనే పత్రానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ 2018, జనవరి 2న విడుదలైంది. ఇప్పుడు వాటిని తొలగించారు.    షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ లోపే ఎన్నికలు జరిగే అవకాశముంటుంది.  ఆ లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం బహిర్గతమైతే అధిక విరాళాలు అందుకున్న బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అందుకే గడువు కోరుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  ‘బలమైన శక్తుల’ ప్రోద్బలంతోనే ఎస్‌బీఐ గడువును జూన్‌ 30 వరకు కోరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. సుప్రీంకోర్టు తీర్పునూ… పట్టించుకోని పరిస్థితి వస్తోంది.

ఎలక్టోరల్ బాండ్లు చట్ట విరుద్ధమైనవిగా తేల్చిన తర్వాత వాటి విషయంలో  కఠినంగా వ్యవహరించాల్సిందే. కానీ ఎస్‌బీఐ ఎందుకు ఇలా చేస్తుందన్నది ఊహించలేని విషయమేం కాదు. మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి