తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం చేశారా? అక్కడ గెలిచే పరిస్థితి లేదని జారుకున్నారా? అనకాపల్లిలో ఏం జరిగింది అసలు? వారం రోజుల పాటు అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గ పరిధిలో మకాం వేసి హడావిడి చేసిన అన్నయ్య హఠాత్తుగా మూటా ముల్లే సద్దుకుని అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేసి ఛలో హైదరాబాద్ అని ఎందుకు అన్నారు? అని రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అనకాపల్లి ఎందుకు వదలాల్సి వచ్చిందో ఆయన చెప్పడం లేదు. పోనీ తమ్ముడైనా చెప్తారనుకుంటే ఆయన కూడా మాట్లాడ్డం లేదు.
తెలుగుదేశం -జనసేన పార్టీల పొత్తు ఖరారు అయ్యాక ఎన్నికలకు దగ్గర పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయాలని ఆకాంక్షించారు. తనకి సురక్షితమైన నియోజక వర్గం కోసం అన్వేషించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం అయితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారట. ఉత్తరాంధ్రలో టిడిపికి నమ్మకమైన క్యాడర్ ఉండడంతో పాటు.. కాపు సామాజిక వర్గం ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండడంతో అక్కడి నుండి పోటీ చేస్తే ఎంపీ అయిపోవచ్చునని నాగబాబు అనుకున్నట్లు చెబుతున్నారు.
అనుకోవడమే ఆలస్యం హుటాహుటిన కొంత సామానుతో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని యలమంచిలిలో ఓ ఇంటిని కిరాయికి తీసుకున్నారు నాగబాబు. అక్కడే ఉంటూ అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేశారు. రక రకాల సర్వేలు చేయించుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించుకుని ఓ నివేదిక తెప్పించుకున్నారు. ఇదే సీటు కోసం కొణతాల రామకృష్ణ ఆశలు పెట్టుకుని జనసేనలో చేరారని ప్రచారం జరగడంతో నాగబాబు కూడా కొంత కంగారు పడ్డారు. అయితే కొణతాలకు అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టి సమస్య పరిష్కరించారు పవన్ కల్యాణ్.
కొణతాల అడ్డు తొలగిపోయింది కాబట్టి ఇక నాగబాబే అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే అంతలోనే రాత్రికి రాత్రే నాగబాబు యలమంచిలిలో ఇంటిని ఖాళీ చేసేశారు. తన సామగ్రిని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన ఎందుకు వెళ్లిపోయారో మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఇదే నియోజక వర్గం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పవన్ మనోగతాన్ని తెలుసుకునే నాగబాబు అనకాపల్లి వదులుకుని ఉండచ్చని అంటున్నారు.
2019 ఎన్నికల్లో నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో అయినా అనకాపల్లి నుండి గెలిచి గత ఎన్నికల్లో ఓటమి భారాన్ని దించేసుకుందామనుకున్నారు. అయితే అనకాపల్లి సీటు అయితే ఆయనకు అందే పరిస్థితి లేదని తేలిపోయింది. మరో నియజక వర్గానికి మారతారా? అన్నది చూడాలి. కొణిదెల కుటుంబానికి అనకాపల్లికి ఓ సంబంధం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు అనకాపల్లి లోక్ సభ స్థానం నుండే చిరంజీవి బావ అల్లు అరవింద్ పోటీ చేశారు. అయితే ఆయన ఓటమి చెందారు. మరి అదే నియోజక వర్గంలో గెలిచి సత్తా చాటాలని పవన్ పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు.
అనకాపల్లి నుండి గెలిచి ఎంపీ అయితే.. రానున్న ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి సంపాదించవచ్చునన్నది పవన్ కల్యాణ్ వ్యూహంగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కూడా పవన్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో గుస గుస లు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు. ఈ సారి ఆ స్థానాలు కాకుండా వేరే నియోజక వర్గాలను ఎంచుకుంటారని తెలుస్తోంది. అనకాపల్లి అయితే తాను కచ్చితంగా గెలుస్తానని పవన్ నమ్ముతున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…