ఆయన్ను ఓడించాలని ప్రత్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని ముందుకొస్తున్నారు. ఆయన మాత్రం సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు ఇవీ ఆఖరి ఎన్నికలంటూ పాచిక వేస్తున్నారు. ఆ మాజీ మంత్రి ఓడిపోతారా..గెలుస్తారా….
కొడాలి నాని.. సీఎం జగన్ కు వీరవిధేయుడు. జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే బూతుపురాణం అందుకునేందుకు వెనుకాడరు. చంద్రబాబుపై ఒంటి కాలి మీద లేవడం నానికి అలవాటే . చంద్రబాబును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే కొడాలి నాని…. మాజీ సీఎంను వాడి వీడు అని కూడా సంబోధిస్తుంటారు. అలాంటి నానికి ఇప్పుడు తొలి సారి ఓటమి భయం పట్టుకుంది. ప్రజల మనిషిగా, నాయకత్వ పటిమతో, కులం బలంతో నెగ్గుకుంటూ వచ్చిన నాని ఈసారి మాత్రం ఎందుకో కొంత భయపడుతున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈ సారి విపక్షాలన్నీ ఏకమై తనను ఓడిస్తాయన్న అనుమానం ఆయనలో పెరిగిపోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నాని నియోజకవర్గం గుడివాడపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. ఈసారి నాని అసెంబ్లీకి రావడానికే వీల్లేదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. పైగా నాని సంగతి చూడాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తరచూ చెబుతున్నారు..
సెటిమెంటునే పట్టించుకోని నాని ఈ సారి సానుభూతి కోసం తంటాలు పడుతున్నారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలని చెప్పుకుంటున్నారు. తనను ఓడించేందుకు టీడీపీ 200 కోట్లు సిద్ధం చేసిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తనకు తిరుగులేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు….
తమ కూటమి గెలుపు సంగతి పక్కన పెడితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడమే లక్ష్యంగా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు.చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ కంటే.. కొడాలి నానే కొరకరాని కొయ్యగా మారాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారు కొడాలి నాని. ఆయన మరోసారి గెలిస్తే.. తనకు ఇంకా తలనొప్పి అని.. ఎలాగైనా ఈసారి ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు టాక్. అందుకే గుడివాడలో పలుమార్లు అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. ధన బలం ఉన్న నేత కోసం వేటాడి.. చివరకు వెనిగండ్ల రాము అనే ఎన్నారైను అభ్యర్థిగా ప్రకటించారు. ఖర్చుకు వెనుకాడడనే రామును గుడివాడ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించారు. ఐనా గుడివాడలో నానిని ఓడించడం అంత ఈజీ కాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాల్లో కలిసి, వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారిలో ఒకడిగా ఉంటూ ఎదిగిన కొడాలి నాని పట్ల గుడివాడ జనంలో మంచి అభిప్రాయం ఉంది. అందుకే పార్టీతో సంబంధం లేకుండా గుడివాడ ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. 2004 నుంచి ఇప్పటికే వరుసగా ఓటమి ఎరుగని నేతగా కొడాలి నాని నిలిచారు. ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన కొడాలి నాని 2024లో ఐదో సారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయనకు కొంత మేర ఇబ్బందికరంగా మారింది. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూలత తనను కూడా దహించి వేస్తుందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. ప్రతీకూలతను సృష్టించడంతో టీడీపీ, జనసేన కూటమి కొంత మేర సక్సెస్ అయ్యిందని నాని అనుమానిస్తున్నారు. పైగా బీజేపీ వచ్చి చేరితే అది బలమైన పొత్తు అవుతుందని కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆఖరి ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి….
చంద్రబాబు ఆయనపై పగబట్టి చాలా రోజులైంది. పైగా నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమాన పరిచిన తీరు కూడా ఇంకా వారి కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో అందరం కలిసి కొడాలిని ఇంటికి పంపిద్దామని చంద్రబాబు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఇప్పుడు పూర్తిగా నానికి వ్యతిరేకమైందని వార్తలు వస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి రాము సతీమణి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వాళ్లను కూడా నానికి ఓటు వేయకుండా చూసే అవకాశం ఉంది. మరి ఈ ఉపద్రవం నుంచి నాని ఎలా బయటపడతారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…