BRSకు అభ్యర్థులు లేరా ? లేకుండా చేస్తున్నారా ?- BRS – Congress-KCR-Revanth

By KTV Telugu On 11 March, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్‌ తరపున ఎంపీగా పోటీ చేయడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు కాదు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే .  సైలెంట్ గా జరిగిపోతున్న ఈ ఆపరేషన్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పాల్సిన పని లేదు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే ఏం జరుగుతుందో  మల్లారెడ్డి కాలేజీల కూల్చివేతతో రేవంత్ శాంపిల్ చూపించారు.  అందుకే మిగిలిన నేతలు కూడా సైలెంట్ అవుతున్నారు. ఈ పరిస్థితి బీఆర్ఎస్‌కు గడ్డు కాలమే. కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది.

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. రోజురోజుకూ పార్టీని వీడుతున్న వారు మాత్రం పెరిగారు.  కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ భవన్‌లో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపలేక పోతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ దళంలో ఓటమి భయం పుట్టిందా? అంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవుననే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఊహించని ఓటమి నుంచి బీఆర్ఎస్ నేతలు ఇంకా తేరుకోలేదు. అందుకేనేమో కొందరు నేతలు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. మరికొందరు చివరి క్షణంలో తాను పోటీ చేయనని వెల్లడిస్తున్నారు. దానికి తోడుగా పార్టీ వీడుతున్న నేతల సంఖ్య కూడా రోజురోజుకు అధికం అవుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వేధింపుల భయమే.

ఇటీవలి వరకూ నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరిన శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి ఇప్పుడు పోటీకి నో అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనికి కారణం ఆయన కుటుంబానికి చెందిన కొన్ని వ్యాపారాల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి నోటీసులు వెళ్లాయని అంటున్నారు. అలాగే

చేవెళ్ల నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్‌రెడ్డికి మరోసారి టిక్కెట్‌ ఇస్తున్నామంటూ మొదట్లోనే గులాబీ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన కూడా పోటీ చేయనని అంటున్నారు.దీనికి కారణం జూబ్లిహిల్స్ ఏరియాలో ఆయన చేపట్టిన ఓ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వివాదంలో పడేలా నోటీసులు అందడమేనని చెబుతున్నారు.  ఈ కారణంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయలేనంటూ రంజిత్‌, కేసీఆర్‌కు తెలిపినట్టు సమాచారం.   దుండిగల్‌లో భవనాల కూల్చివేత నేపథ్యంలో మల్కాజ్‌గిరి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు డాక్టర్‌ భద్రారెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారు.

ఖమ్మం నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు…  ఇప్పుడు ఖర్చు భరించటం కష్టంమని వాపోతున్నారు.  ఇదే పరిస్థితి సికింద్రాబాద్‌లోనూ కనిపిస్తోంది. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌… ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు.  తనకు అత్యంత దగ్గరగా ఉండే ముఖ్యులను  ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ అడుగుతున్నారు.  నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, వరంగల్‌ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లేదా గ్యాదరి బాలమల్లు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ లేదా కాసాని వీరేశ్‌లను పోటీకి కేసీఆర్‌ ఒప్పించినట్టు తెలుస్తోంది.

కొందరు ఎమ్మెల్యేలైతే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ దొరికితే చాలనకున్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ తరపు లోక్‌సభ బరిలో నిలబడానికి మొరాయిస్తున్నారు. వీరిలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారు. వీరికి ఓటమి భయం పెరిగి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతే తట్టుకోలేమనే వారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉంది.  లోక్‌సభ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ తమ అభ్యర్థులను ఖరారు చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఓ అగ్ని పరీక్షలా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కూడా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. వారిలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరలేదు. కానీ ఆయన భార్య జెడ్జీ ఛైర్మన్ సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డి మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్‌లు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డిని వేరువేరుగా కలిశారు. వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. అందరూ కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది.

పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని గులాబీ బాస్ కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. పార్టీ టికెట్ ఇస్తామన్నా నేతలు ముందుకు రాకపోవడం, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువవడం, తమ ఖర్చులను పార్టీ భరించాలని నేతలు డిమాండ్ చేస్తుండటంతో కేసీఆర్‌కు దిక్కుతోచని స్థితిని ఏర్పడింది.  ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఇప్పుడు కేసీఆర్‌కు కత్తి మీద సామేనని అనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి