బీజేపీతో పొత్తు – ఈ ప్రశ్నలకు TDP దగ్గర బదులుందా ? – TDP – JANASENA-PAWAN KALYAN

By KTV Telugu On 12 March, 2024
image

KTV TELUGU :-

ఏపీకి అన్యాయం  చేసిందని బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చిన చంద్రబాబు మళ్లీ బీజేపీ వల్లే ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పి పొత్తులు పెట్టేసుకున్నారు.  రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పని చేయాలని నిర్ణయించినట్టు  చంద్రబాబు నాయుడు  ప్రకటించారు.   ధర్మ పోరాట దీక్ష పేరిట భారీ బహిరంగసభలు నిర్వహించి రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని విమర్శించిన చంద్రబాబుకు ఇప్పుడు బిజెపిలో ఏం మార్పు కనిపించింది?   పొత్తుపై  ప్రజలు వేసే ప్రశ్నలకు టీడీపీ అధినేత వద్ద సమాధానం ఉందా ?

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా  ప్రజల ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రజల ముందు చాలా అనుమానాలు ఉన్నాయి.  విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన కీలక సమస్య. అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన బిజెపి ఇప్పుడు తన వైఖరి మార్చుకుందా? ఎపికి హోదా మంజూరు చేస్తామని మాట ఇచ్చిందా? ఇవ్వదని తెలిసినా టిడిపి, పాచిపోయిన లడ్డూలని ఒకనాడు విమర్శించిన జనసేన ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ 32 మంది ప్రాణ బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తామని బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా దాదాపు మూడేళ్లకు పైగా ఉక్కు కార్మికులు పోరాడుతుంటే వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల వ్యతిరేకత మూలంగా ప్లాంటు మొత్తాన్ని ఒకేసారి ప్రైవేటుపరం చేయలేని కేంద్రం ముక్కలు ముక్కలుగా అమ్మేయాలని ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను జిందాల్‌కు అప్పగించింది. ఇప్పుడేమైనా బిజెపి తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందా?. కనీసం  ఆ చాన్స్ అయినా ఉందా అంటే.. లేదని చెప్పాలి. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, కరువు పీడిత రాయలసీమకు నికర జలాలివ్వడానికి రాష్ట్రానికి జీవధారగా పోలవరం ప్రాజెక్టును పేర్కొంటారు. అందుకు సంబంధించిన డ్యామ్‌, ఇతర కట్టడాలు, కాల్వల పనులు చేశారేతప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ నిర్వాసితులకు ప్యాకేజి, నిర్మాణ అంచనాలపైనా కేంద్రం కొర్రీలు వేయడమేతప్ప తగిన నిధులివ్వడం లేదు. తాజా అంచనాలతో నిర్మాణ వ్యయాన్ని, పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజిపై చంద్రబాబు భరోసా తీసుకున్నారా అనేది ప్రజలకు చెప్పాల్సి ఉంది.

ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని గొప్పగా చెప్పిన ప్రధాని మోడీ అమరావతికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి పోయారుతప్ప మహానగర నిర్మాణానికి వలయు నిధులివ్వలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా వైసిపి సర్కారు మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించింది. అప్పుడు కూడా రాజధాని అమరావతి కొనసాగాలని చెప్పలేదు సరికదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని వైసిపి విధానాన్ని పరోక్షంగా సమర్ధిస్తూ మోడీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కానీ అమరావతే రాజధాని అని రాజకీయ ప్రకటనలు చేస్తోంది. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన విశాఖ రైల్వే జోన్‌, ప్రత్యేక ఉన్నత విద్యా వైద్య సంస్థలు, పెట్రో కెమికల్‌ కారిడార్‌, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజి వంటి అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. అయినా… ఎన్‌డిఎ తోనే ఎందుకు వెళ్లాలి ..  ఈ రాష్ట్రానికి, తెలుగువారికీ ఒరిగేదేమిటన్నది టిడిపి, జనసేన నేతలు ప్రజలకు వివరించాల్లి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఆదరించడం కష్టమే. రాష్ట్రం కోసమే పొత్తులు అయితే ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి