ఉమ్మడి కృష్ణా జిల్లా లో టిడిపికి మంచి పట్టున్న నియోజక వర్గాల్లో పెనమలూరు ఒకటి. ఈ నియోజక వర్గం టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడే ఈ నియోజక వర్గాన్ని తనకోసం పక్కన పెట్టుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కుప్పం తో పాటు పెనమలూరు లో కూడా చంద్రబాబ పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. కుప్పంలో మరో సారి సర్వే చేసుకున్న తర్వాత పెనమలూరు నుంచి పోటీ చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారని అంటున్నారు. అప్పటి దాకా పెనమలూరు సీటును ఎవరికీ కేటాయించే పరిస్థితి ఉండదంటున్నారు.
కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు కుడిభుజంలా వెలిగిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి మైలవరం లో టికెట్ గల్లంతు అయ్యింది. ఆయనకు మరో నియోజక వర్గాన్ని కేటాయిస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న పెనమలూరు నియోజక వర్గం అయితే బాగుంటుందని దేవినేని ఉమా భావిస్తున్నారట. అయితే చంద్రబాబు నాయుడి మనసులో మరి కొన్ని పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయంటున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినా ప్రజాభిప్రాయ సేకరణలో పాస్ అయితేనే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. తెనాలి సీటును జనసేనకు కేటాయించడంతో టికెట్ రాకుండా ఉండిపోయిన ఆలపాటి కూడా పెనమలూరు వైపు చూస్తున్నారట.
తొలివిడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదట. వాస్తవానికి సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. కృష్ణాజిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టిక్కెట్ అని ఆయన ఆశపడుతున్నారు.
కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్ధిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవల టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకూ పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపు ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారు. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎం.ఎస్.బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట.
ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్.. కొలుసు పార్ధసారధి ద్వారా పెనమలూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనే సర్వేలు చేయించడమేంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్ధుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టిక్కెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారట. ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనార్టీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్.
మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే మైనార్టీ అభ్యర్ధిగా తనకే కేటాయించాలి కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట.పెనమలూరు టిక్కెట్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతడం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే..అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే ఈ నియోజక వర్గాన్ని చంద్రబాబు తనకోసమే దాచి పెట్టుకున్నారని పార్టీ వర్గాల భోగట్టా.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…