Difficult Times For Seenanna – శీనన్నకు కష్టకాలం !

By KTV Telugu On 14 March, 2024
image

KTV TELUGU :-

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్తితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. అధిష్టానం పట్టించుకోక, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోవడంతో రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరమైంది. తన సీటుకే ఠికానా లేని పరిస్థితుల్లో అనుమానంతో దిక్కులు చూడాల్సి వస్తోంది….

వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న ఆ మాజీ మంత్రి సీఎం జగన్ పై అసంతృప్తిగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ఆయన జిల్లాలో వైసీపీ రాజకీయాన్ని ఆ మాజీ మంత్రి చక్కబెట్టారు. అయితే గతంలో వైసీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చిన చేతులతో ఇప్పుడు ఆ మాజీ మంత్రి టిక్కెట్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒంగోలు అసెంబ్లీ నుండి ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేనికి రాబోయే ఎన్నికల్లో అసలు టిక్కెట్ ఉందా…లేదా…అన్న సందేహం ఆయన అనుచరుల్ని వెంటాడుతోంది. టిక్కెట్ విషయంలో బాలినేని సైతం మౌనం వహించడంతో ఒంగోలు వైసీపీ టిక్కెట్ బాలినేనికి ఇస్తారా…లేదా..అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.  ప్రస్తుతం వైసీపీలో ఎదుర్కొంటున్న వ్యతిరేక పవనాలపై ఆయన అనుచరగణం ఆగ్రహంతో రగిలిపోతోంది. అనవసర  వివాదాల్లో తరదూర్చి ఇబ్బంది పడుతున్నారన్న ఫీలింగు బాలినేని అనుచరులకు కలుగుతోంది…

కొన్ని సందర్భాల్లో బాలినేనిని ఉంటే ఉండు పోతే పో అన్నట్లుగా వైసీపీ అధిష్టానం వ్యవహరించింది. తన సంగతి చూసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం   చేసుకుంటున్నారన్న ఆగ్రహం జగన్లో కనిపించింది. ముఖ్యమంత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంలో బాలినేని జోక్యం జగన్ కు అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు జగన్ మెత్తబడ్డారని చెబుతున్నారు. ఇటీవల ఒక సభలో కాబోయే  మంత్రి అంటూ బాలినేనిని ఆయన సంబోధించిన తీరు … మాజీ  మంత్రి అనుచరులకు సంతోషాన్నిచ్చింది….

సీఎం జగన్ కి దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఆర్భావం నుండి ప్రకాశం జిల్లాలో ఆపార్టీ బాధ్యతలు మోశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన  మూడేళ్లకే బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గం నుండి తొలగించారు. ఆతరువాత ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు లాగేసుకున్నారు. బాలినేని అనుచరులుగా ఉన్న అప్పటి సంతనూతలపాడు వైసీపీ పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిని, మార్కాపురం టిక్కెట్ ఆశించిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. బాలినేని వద్దని చెప్పినా వినకుండా పర్చూరు నియోజక వర్గ బాధ్యతలు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి అప్పగించారు. బాలినేని పట్టుబట్టినా ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టిక్కెట్ నిరాకరించడం…ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాతో సంబంధం లేని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఒంగోలు ఎంపి అభ్యర్థిగా ప్రకటించడం…అదే చెవిరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడం… ప్రకాశం జిల్లాలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న నాయకులు ఆయనపైనే పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడం…వారికి  టికెట్లు కేటాయించడం ఆయనకు అసలు నచ్చడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో  10 నియోజక వర్గాల్లో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని కూడా ప్రకటించారు. ఇప్పటికి ఎనిమిది సార్లు వైసీపీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినా….బాలినేని పేరు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుండి విడుదలయ్యే ప్రతి జాబితాలో బాలినేని పేరు ఉందా…లేదా…అని ఆయన అనుచరులు వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. అవకాశం దొరికినప్పుడల్లా…వైసీపీలో తన పరిస్థితిపై బాలినేని చేస్తున్న కామెంట్స్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కు కోపం తెప్పించాయని  చెబుతున్నారు…

బాలినేని పరిస్థితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా ఉంది. కేవలం డీఎస్పీలను బదిలీ చేయించుకోవడం తప్పితే తన వల్ల ఏమీ జరగదన్న ఆందోళన ఆయనసలో  పెరిగిపోయింది. మరి ఎన్నికల నాటికి జగన్ ఆయనకు పెద్దపీట వేస్తారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి