మార్చి 16న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌ – YSR CONGRESS PARTY – JAGAN MOHAN REDDY

By KTV Telugu On 15 March, 2024
image

KTV TELUGU :-

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయ‌కుడు  వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఈ నెల 16 న ఇడుపుల పాయ లో పార్టీ  అభ్య‌ర్ధుల జాబితాను విడుదల చేయ‌నున్నారు. ఒకే సారి  మొత్తం 175 అసెంబ్లీ 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను  ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే మెజారిటీ నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల ఎంపిక పూర్తి అయ్యింది. అందులో ఒక‌టి రెండు చోట్ల మార్పుల‌తో  తుది జాబితాను   ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లోనూ  ఇడుపుల పాయ నుంచే అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా  ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొంటారు

ఏపీలో ఒక‌ప‌క్క   టిడిపి-బిజెపి-జ‌న‌సేన కూట‌మి పొత్తు ఖ‌రారు చేసుకుని ఒక‌టి రెండు రోజుల్లో అభ్య‌ర్ధుల జాబితా ప్ర‌క‌టించ‌డానికి సిద్ధం అవుతోంది. టిడిపి అయితే ఇప్ప‌టికే 94 నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేసిది ఇక 50 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 17 ఎంపీ సీట్ల‌లో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే మొత్తం 175 ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు 25 ఎంపీ అభ్య‌ర్ధుల పేర్ల‌ను  మార్చ్ 16న విడుద‌ల చేయాల‌ని  నిర్ణ‌యించారు. జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ అయితే 21 అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురి పేర్లు ఖ‌రారు చేశారు. రెండు ఎంపీ స్థానాల్లో  మ‌చిలీప‌ట్నానికి బాల‌శౌరి పేరు ఫైన‌లైజ్ చేశారు. బిజెపి రెండు రోజుల్లో త‌మ జాబితా విడుద‌ల చేయ‌నుంది. అప్పుడే జ‌న‌సేన కూడా మిగ‌తా అభ్య‌ర్ధుల పేర్లు ప్ర‌క‌టిస్తుంది.

అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేసిన మ‌ర్నాటి నుంచే  రాష్ట్ర వ్యాప్తంగా  సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈ ఎన్నిక‌ల‌ను చాలా కీల‌కంగా భావిస్తున్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  టిడిపి-బిజెపి-జ‌న‌సేన‌లు జ‌ట్టు క‌ట్ట‌డంతో  వైసీపీకి గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న వ్యూహాలకు ప‌దును పెడుతున్న‌ట్లు చెబుతున్నారు. బిజెపి త‌మ‌తో చేర‌డంతో చంద్ర‌బాబు కూడా చాలా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్  క‌ల్యాణ్ జ‌నాద‌ర‌ణ‌.. మోదీ  జ‌నాక‌ర్ష‌ణ కూట‌మికి ల‌బ్ధి చేకూరుస్తాయ‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు.

వై నాట్ 175 అంటోన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయిదేళ్లుగా తాను అమ‌లు చేసిన  సంక్షేమ ప‌థకాలే త‌న‌ను గెలిపిస్తాయ‌ని న‌మ్మ‌కం పెట్టుకున్నారు. వీల‌యితే ఇడుపుల పాయ‌లోనే వైసీపీ మేనిఫెస్టో విడుద‌ల చేసే అవ‌కాశం కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో  ఇచ్చిన హామీల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తానంటే స‌రిపోతుంద‌ని పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు అంటున్నారు. అయితే ఈ సారి మేనిఫెస్టోలో మూడు రాజ‌ధానుల‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. ఎన్నిక‌ల్లో గెలిస్తే దాన్నే రెఫ‌రెండంగా ప్ర‌చారం చేసుకోడానికి కూడ  అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నట్లు స‌మాచారం.

2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటున్నారు.  నా పాల‌న‌లో  మీ ఇంట్లో మేలు జ‌రిగింద‌ని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని జ‌గ‌న్ చెబుతున్నారు. ఇది  అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. విప‌క్షాలు మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌దాన్నీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేశార‌ని విమ‌ర్శిస్తున్నాయి. టిడిపి-బిజెపి-జ‌న‌సేన కూట‌మి  అమ‌రావ‌తే  ఏకైక రాజ‌ధాని అన్న నినాదంతో ఎన్నిక‌ల బ‌రిలో దిగే అవ‌కాశాలున్నాయంటున్నారు. అదే జ‌రిగితే  అమ‌రావ‌తి వ‌ర్సెస్ మూడు రాజ‌ధానులు గా ఈ ఎన్నిక‌ల స‌మ‌రాన్ని అభివ‌ర్ణించ వ‌చ్చునంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ ఎన్నిక‌లు  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ క‌న్నా కూడా టిడిపికే ఎక్కువ కీల‌కం. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో కూడా టిడిపి అధికారంలోకి రాలేక‌పోతే ఆ పార్టీ మ‌నుగ‌డే  క‌ష్ట‌మ‌వుతుంది. ఎందుకంటే చంద్ర‌బాబుకు ఇప్పుడే 75 ఏళ్ల వ‌య‌సుంది. ఈ సారి అధికారంలోకి రాలేక‌పోతే 2029 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌కు 80 ఏళ్లు వ‌స్తాయి. ఆ వ‌య‌సులో చురుగ్గా రాజ‌కీయాలు చేయ‌డం అంత తేలిక కాదు. అందుకే చంద్ర‌బాబు జ‌న‌సేన‌-బిజెపిల‌తో పొత్తు పెట్టుకున్న‌ది. కూట‌మి అధికారంలోకి రాలేక‌పోతే  జ‌న‌సేన‌కు కూడా ఇబ్బందే. మ‌రో అయిదేళ్ల పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా కీల‌క ప‌ద‌వుల కోసం ఆగాల్సి వ‌స్తుంది. అందుకే అంద‌రికీ ఇవి కీల‌క ఎన్నిక‌లే అంటున్నారు రాజ‌కీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి