BJP 400 Seats Target – బీజేపీకి 400 సీట్లొస్తే రాజ్యాంగం మారిపోతుందా ?

By KTV Telugu On 16 March, 2024
image

KTV TELUGU :-

సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. ‘400కు పైమాటే’ అనే నినాదాన్ని కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే సమర్ధించుకున్నారు. ఆ సంఖ్యకు చేరుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించాలని పార్టీ భావిస్తోందని, అలా చేయాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని తెలిపారు. దీంతో ఒక్క సారిగా గగ్గోలు ప్రారంభమయింది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడానికే నాలుగు వందల స్థానాలను టార్గెట్ చేసిందన్న అనుమానాలకు బలం చేకూరినట్లయింది. ఎందుకంటే రాజ్యాంగ మార్పు అనేది ఆరెస్సెస్ అజెండాలో ఉందని చాలా కాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి .

రాజ్యాంగ మార్పు అనే వివాదం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. కానీ రాజ్యాంగాన్ని మార్చడం అనేది చిన్న విషయం కాదు. ఓట్లు, సీట్ల మ్యాటర్ కాదు.  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.  కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ ప్రజల్ని ఓ ఎమోషన్ లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. అందుకే ఇప్పుడు రాజ్యాంగం మారుస్తారు అన్న చర్చ ప్రారంభించినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.  ఈసారి 400 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని బీజేపీ ఎందుకు అనుకుంటోందంటే.. దానికి కారణంగా ఒక్కటే తెర ముందు కనిపిస్తోంది. అదే రాజ్యాంగ మార్పు. కర్ణాటక కు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే నోటి వెంట ఇదే బయటకు వచ్చింది.  లోక్‌సభలో మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ మాత్రమే కాదు..  రాజ్యసభలోనూ అలాంటి బలమే కావాలి.  రాజ్యాంగ సవరణ చేయాలన్నా, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను మార్చాలన్నా రెండు సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలి.

అసలు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటుందని దేశ ప్రజలు ఎందుకు అనుమానిస్తున్నారంటే.. దానికి బలమైన కారణాలు ఉన్నాయి.  బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ మొదటి నుండీ రాజ్యాంగ హక్కులను వ్యతిరేకిస్తూనే ఉందన్న విమర్శ ఉంది.  1998లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అది చేసిన మొట్టమొదటి పనుల్లో ఒకటి…రాజ్యాంగ సమీక్ష కోసం కమిటీని నియమించడం. అయితే వెంకటా చలయ్య కమిషన్‌ నివేదికను అమలు చేయలేదు. రాజ్యాంగాన్ని సవరించేందుకు జరుపుతున్న ప్రయత్నాలపై తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో దాని అమలును పక్కన పెట్టారు.  2000వ సంవత్సరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా కె.సుదర్శన్‌ నియమితులైనప్పుడు భారత రాజ్యాంగం పశ్చిమ దేశాల విలువలపై ఆధారపడిందని, కాబట్టి దానిని మత గ్రంథాల ఆధారంగా తిరగరాయాలని చెప్పారు. ‘ఈ రాజ్యాంగం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. దీనిని 1935వ సంవత్సరపు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా రాశారు. కాబట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయడానికి పోరాడే విషయంలో మనం ఏ మాత్రం సిగ్గు పడకూడదు’ అని అన్నారు.  ఆరెస్సెస్  సిద్ధాంతం అదే.

రాజ్యాంగంపై బీజేపీ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.  అయితే బీజేపీ అగ్రనాయకత్వం అలాంటి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. తాము  ఆ అభిప్రాయాలతో  ఏకీభవించడం లేదని, దానిని తాము సమర్ధించడం లేదని బీజేపీ నాయకత్వం చెబుతోంది. అనంతకుమార్ అభిప్రాయాలనూ ఖండించింది.  2017లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హెగ్డే ఇదే విషయాన్ని చెప్పారు. అయినా ఆయనకు 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. భారత్‌లో రాజ్యాంగ హక్కుల అమలుపై కొంత కాలంగా విస్తృత చర్చ జరుగుతోంది.

బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో  రాజ్యాంగంలోని ముఖ్యమైన విలువలైన ప్రజాస్వామ్యం, సమానత్వం క్రమంగా తగ్గిపోతోందన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి.  ప్రజాస్వామ్య వ్యవస్థకు  చెందిన మూల స్తంభాలను, ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉంచుకుంది. ఆ ప్రభుత్వంలో సైతం కేవలం ఒకే ఒక వ్యక్తి హవా నడుస్తోంది. న్యాయ  వ్యవస్థను వివిధ స్థాయిల్లో వేర్వేరు యంత్రాంగాలు బలహీనపరుస్తున్నాయనేది బహిరంగ రహస్యం.

బీజేపీ మరోసారి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్న కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే అలాగే ఉన్నాయి.  బీజేపీకి తిరుగులేని మెజార్టీని ఈ సారి ప్రజలు ఇస్తే… ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే కావొచ్చు.  ఏ దేశంలో అయినా బలమైన అధికారంతో పాటు వారిని ప్రశ్నించగలిగే ప్రతిపక్షం ఉండాలి.  అలాగే నిరంతరాయంగా ఒకరి చేతుల్లోనే అధికారం ఉంటే.. అది ప్రజాస్వమ్యం అవదు.. నియంతృత్వమే అవుతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి