బీఆర్ఎస్ పార్టీ అంతటి దయనీయ స్థితిలోకి వెళ్లిపోతుందని ఎవరూ అనుకుని ఉండదు. అధికారం కోల్పోయి ఆరు నెలలు తిరగకుండానే కుడిఎడమల బలమైన నాయకులు లేకుండా కేసీఆర్ కూర్చోవాల్సి వస్తుందని ఎవ్వరూ, ఎప్పుడు ఊహించి ఉండరు. లోక్ సభ ఎన్నికల వేళ ఒక్కొక్కరుగా జారిపోతుంటే.. ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆరూరి రమేష్ కూడా ఉండనంటున్నారంటే బీఆర్ఎస్ లో ఎంత అనిశ్చిత నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని రోజులైనా ఉండండని కేసీఆర్ స్వయంగా బతిమాలుకునే దుస్థితిలోకి బీఆర్ఎస్ జారిపోయింది…. ఓడలు, బండ్లు కావడమంటే ఇదేనేమో…..
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు తిరుగులేదు. అన్ని రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నం కూడా చేశారు. నెంబర్ వన్ జాతీయ పార్టీ రేంజ్ లో ఫీలైపోయారు. పోలింగ్ పూర్తయి, ఫలితం వచ్చి, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పొరబాటున కూడా ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.గతమెంతో ఘనకీర్తి బీఆర్ఎస్ నాయకుడా… వర్తమానం, భవిష్యత్తు అనుమానంగా ఉందిరో బీఆర్ఎస్ నాయకుడా అని పాడుకునే దుస్థితిలోకి వెళ్లపోయారు. సిట్టింగ్ ఎంపీలు ఎన్నికల దాకా కూడా నిలబడటం లేదు. టికెట్లు రాని వాళ్లు ఆగ్రహంతో నిష్క్రమించడం సహజమైతే, అసలు టికెట్ల చర్చ రాకముందే జారుకోవడం బీఆర్ఎస్ స్పెషాలిటీ అయిపోయింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీహాబాద్ బీబీ పాటిల్ లాంటి వాళ్లు ఇప్పుడు బీజేపీలో చేరి సెటిలైపోయారు. కొందరు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. దానితో ఇంతకాలం విశ్రాంతి పేరుతో రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్..ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
కేసీఆర్ ను ఓ భయం వెంటాడుతుందని చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు దెబ్బతింటే ఏమిటన్న భయం అది. ఒకప్పుడు ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసిన వాళ్లే ఇప్పుడు పారిపోతున్నారన్న బెంగ ఆయన్ను వెంటాడుతోంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు తన స్థాయిని కాస్త తగ్గించుకుని బతిమలాడే పరిస్థితిలోకి నెట్టబడ్డారు…
వరంగల్ ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ అనుకున్నమాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారమే బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఒక పెద్ద ఉదాహరణ. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన పార్టీమారాలని అనుకున్నారు. కేసీఆర్ ఆయనకు వరంగల్ ఎంపీ సీటు ఆఫర్ చేయడం ద్వారా శాంతింపజేశారు.మూడు రోజుల కిందట ఎంపీగా పోటీచేసేందుకు రమేష్ సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం మంతనాలు నడిచాయో తెలియదు గానీ.. బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించడానికి ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన గులాబీ నాయకులు, కేసీఆర్ దూతలు ఆయన వద్దకు వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చోబోతుండగా లేపి, తమ వెంట హైదరాబాదు తీసుకువెళ్లారు.కేసీఆర్ ఇంట్లో ఓ చిన్న మీటింగు పెట్టుకున్నారు. ఆయనను బుజ్జగించారు. ఆయన మెత్తబడినట్టే కనిపించారు. కానీ వరంగల్ సీటు నుంచి ఎంపీగా పోటీచేయడానికి మాత్రం విముఖత చూపారు. ఆయన కోరినదే, రెండు రోజుల ముందర ఒప్పుకున్నదే. కానీ తాజాగా వద్దన్నారు. అక్కడ సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా పెద్ద ఉత్సాహంగా లేరు. పార్టీ టికెటిస్తే పోటీచేస్తా లాంటి మాటలు మాత్రమే చెప్పారు. మెత్తబడినట్టు కనిపించినా ఆరూరి రమేష్ పార్టీ మారడం తథ్యం అనే అభిప్రాయమే పలువురిలో ఉంది. ఇంతవరకూ వచ్చాక పార్టీ పరువు పోకుండా ఉండడం కోసం కేసీఆర్ అప్పటికప్పుడు కడియం శ్రీహరి కూతురు కావ్య ను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించారు.
ప్రతీ ఎంపీ నియోజకవర్గంలోనూ హై డ్రామా నడుస్తూనే ఉంది. చేవెళ్ల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వరంగల్ అంతటి హైడ్రామా లేకపోయినా అక్కడి ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీచేయడానికి సుముఖంగా లేరు! దాంతో కొత్త అభ్యర్థి వెతుకులాటలో కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయించారు. నిజానికి కాసాని కాలం చెల్లిన నాయకుడు.జనం ఆయన్ను మరిచిపోయి చాలా రోజులైంది. కాకపోతే తన కుమారుడి రాజకీయ జీవతం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ సారి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తాలు మిరపకాయే. అయినా బీఆర్ఎస్ కు అవసరం.బతిమాలి బీ ఫార్మ్ ఇస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…