BJP – NDA – ఎన్డీయే హ‌వా త‌ప్ప‌దా ?

By KTV Telugu On 17 March, 2024
image

KTV TELUGU :-

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ హ్యాట్రిక్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తాజా స‌ర్వే తేల్చింది. ఎన్డీయే కూట‌మికి 400 స్థానాలు రావాల‌ని టార్గెట్ పెట్టుకున్న బిజెపి  ఆ లక్ష్యాన్ని దాటిపోతుంద‌ని స‌ర్వే లో తేల్చారు. 543 స్థానాలున్న లోక్ స‌భ‌లో ఎన్డీయే కూట‌మికి 411 స్థానాలు వ‌స్తాయ‌ని ఇండియా కూట‌మికి 105 స్థానాలు మాత్ర‌మే  ద‌క్కుతాయ‌ని స‌ర్వేలో మెజారిటీ ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఓ ఆంగ్ల ఛానెల్ నిర్వ‌హించిన ఈ స‌ర్వేపై విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఎన్నిక‌ల న‌గారాకి ముందే  ఎన్డీయే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బిజెపి ఎంపీకి చెందిన ఆ మీడియా సంస్థ  ఫేక్ స‌ర్వే చేసింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో దేశంలో  న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేలింది. ఎన్డీయే కూట‌మికి 400 స్థానాలు సాధించాల‌ని ల‌క్ష్యం పెట్టుకోగా 411 దాకా వ‌స్తాయ‌ని స‌ర్వే తేల్చింది. ఈ సారి అయినా స‌త్తా చాటుతామ‌ని ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి 105 స్థానాలు మాత్ర‌మే వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. రెండు జాతీయ పార్టీలూ పూర్తి స్థాయిలో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌కుండానే ఈ స‌ర్వే నిర్వ‌హించ‌డం ఈ అంచ‌నాకు రావ‌డం శాస్త్రీయంగా లేదంటున్నాయి విప‌క్షాలు.   బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింప‌డం కోస‌మే ఇటువంటి ఫ‌లితాలు వెల్ల‌డించార‌ని విమ‌ర్శిస్తున్నారు.

స‌ర్వేలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ఇంచుమించు క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వే అంటోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన క‌ర్నాట‌క‌లోనూ ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణాలోనూ కూడా కాంగ్రెస్ కంటే బిజెపికి ఎక్కువ ఎంపీ స్థానాలు వ‌స్తాయ‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

క‌ర్నాట‌క‌లో అయితే కాంగ్రెస్ కు కేవ‌లం మూడు స్థానాలు మాత్ర‌మే ఇచ్చిన స‌ర్వే  బిజెపికి  20కి పైగా స్థానాలు క‌ట్ట‌బెట్టింది.అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో మార్పు ఉంటుంద‌ని స‌ర్వే నిర్వాహ‌కులు అంటున్నారు.

తెలంగాణాలో మొన్న‌టి దాకా అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితికి కేవ‌లం రెండు స్థానాలు మాత్ర‌మే ఇచ్చింది స‌ర్వే. బిజెపికి 8 స్థానాలు వ‌స్తాయ‌ని అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానాలు వ‌స్తాయ‌ని అభిప్రాయ ప‌డ్డారు. మ‌జ్లిస్ పార్టీ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటుంద‌ని తేల్చారు.

ఇక ఆంధ్ర ప్ర‌దేశ్ లో పాల‌క వైసీపీకి కేవ‌లం ఏడు స్థానాలే వ‌స్తాయ‌ని సంచ‌ల‌న జోస్యం చెప్పారు. ఎన్డీయే కూట‌మికి 18 స్థానాలు వ‌స్తాయ‌న్నారు. టిడిపి-బిజెపి-జ‌న‌సేన కూట‌మికి 50 శాతం మేర‌కు ఓట్లు వ‌స్తాయ‌న్న‌ది స‌ర్వే సారాంశం.

కొద్ది రోజుల క్రితం మ‌రో  ఇంగ్లీష్ ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఏపీలో  వైసీపీకి 22 స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌ర్వే తెలంగాణాలోనూ  బి.ఆర్.ఎస్. కు  ఆరు స్థానాల దాకా వ‌స్తాయ‌ని చెప్పింది. తాజా స‌ర్వేని ఉద్దేశించి కాంగ్రెస్ తో స‌హా ప‌లు విప‌క్షాలు  విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. స‌ర్వే నిర్వ‌హించిన ఛానెల్ బిజెపి ఎంపీది కావ‌డంతో దాని విశ్వ‌స‌నీయ‌త‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేదంటున్నాయి విప‌క్షాలు. ఏక పక్షంగా త‌మ కూట‌మి శ్రేణుల్లో ఉత్సాహం నింపుకోడానికే ఈ ఛానెల్  స‌ర్వే చేయ‌కుండానే ఏసీ గ‌దిలో కూర్చుని  న‌చ్చిన అంచ‌నాలు  వెల్ల‌డించేసింద‌ని వారు దుయ్య‌బ‌డుతున్నారు.

గ‌తంలో బిహార్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బిజెపి ఇటువంటి ట్రిక్కే ప్లే చేసింద‌ని విప‌క్షాలు అంటున్నాయి.  ఆ ఎన్నిక‌ల్లో బిహార్ లో బిజెపియే అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు చెప్పాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ -ఆర్జేడీ-జేడీయూ కూట‌మి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వ‌చ్చింది. గత బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ బిజెపి అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు చెప్పాయి. అయితే మూడో సారి వ‌రుస‌గా గెలిచిన మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ  అంత‌కు ముంద‌టి ఎన్నిక‌ల క‌న్నా మ‌రో నాలుగు స్థానాలు ఎక్కువే గెలుచుకుంది. ఈ సారి కూడా బిజెపి అలాంటి చీప్ ట్రిక్సే ప్లే చేస్తోంద‌ని కాంగ్రెస్ అంటోంది.  అస‌లు వాస్తవాలు ఎన్నిక‌ల త‌ర్వాత‌నే తెలుస్తాయ‌ని వారంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి