అంతా బీఆర్ఎస్ ఓటర్లే – కానీ గెలుస్తారా ? – BRS – BJP – CONGRESS – MEHABUBNAGAR LOCAL BODY ELECTIONS

By KTV Telugu On 18 March, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల  హడావుడి ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ కు పులి మీద పుట్రలా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆరెస్‌ మధ్య పోరు కేంద్రీకృ తమై ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న గులాబీ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి, పోయిన పరువు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.  అధికారం అండతో కాంగ్రెస్ .. బీఆర్ఎస్‌తో చెలగాటమాడుతోంది.

ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆరెస్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు వెల్లువలా చేరిన వారు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చి పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెల్చిన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక వచ్చింది. అంతకు ముందు కసిరెడ్డి బీఆర్ఎస్  తరపున తిరుగులేని విజయం సాధించారు. కాంగ్రెస్‌కు కనీస బలం కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్మా కంపెనీ అధినేతల్లో ఒకరైన మన్నే జీవన్ రెడ్డి, బీఆరెస్‌ నుంచి పాలమూరు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరు నేతలకు ఆర్థిక బలం ఉండటంతో నువ్వా నేనా అనే స్థాయిలో  విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.  మన్నె జీవన్ రెడ్డి నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు.    ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఎన్నికల సమయం వరకు వీలైంత మంది సభ్యులను కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని సవాలుగా స్వీకరించారు. ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభమైంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి 1439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 832 మంది సభ్యులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌లు ఉండగా.. 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే 900 మంది బీఆరెస్‌కు చెందిన సభ్యులు ఉండగా కాంగ్రెస్‌కు అప్పట్లో 218 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీకి 35 మంది ఉండగా ఇతర పార్టీ లకు చెందిన వారు ఉన్నారు. ఆ రీత్యా ఈసారి బీఆరెస్‌ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి.

కానీ సంఖ్యా బలం గులాబీ పార్టీకి ఉన్నా సభ్యులను నడిపించే నాయకులు లేకుండా పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 14 స్థానాల్లో రెండు స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయ్యింది. దీంతో జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్‌కు కావడంతో స్థానిక సంస్థల సభ్యులు అధిక శాతం ఎమ్మెల్యేల మాట వింటారని భావిస్తున్నారు.  నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మాటపైనే సభ్యులు ఉండే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్ వైపు తరలి వస్తున్నారు. ఇదివరకే మహబూబ్ నగర్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మద్దతుగా నిలిచారు. దాదాపు గా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొడంగల్ బీఆర్ఎస్ కు పది ఓట్లు అయినా పడటం కష్టం.

ఇప్పటికే నేతలు పార్టీని విడిచిపెట్టిపోయినా కార్యకర్తలు ఉంటారని బీఆర్ఎస్ నేతలు ధీమాగా  ఉన్నారు. అయితే ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ వీడుతూండటం.. ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. ఉనికి సమస్యగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆందుకే ఆర్థికంగా  గట్టి  ప్రయత్నం చేసే అభ్యర్థికి బీఫాం ఇచ్చారు. అధికారం లేకపోవడం వల్ల ఆర్థికి బలంతో నెట్టుకు రావడం కష్టమన్న అంచనాలు కూడా ఉన్నాయి.  ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్‌కు మరింత గడ్డు కాలం వస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి