అధికారం కోల్పోతే చాలు అంత వరకు తమకు పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి అధికారాన్ని పంచిన అమ్మలాంటి పార్టీని కూడా విడిచి పెట్టేస్తున్నారు. అంతకాలం తమని ఆదుకుని రాజకీయంగా మెరిసేలా చేసిందన్న కృతజ్ఞత కూడా లేకుంఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ పార్టీయే అధికారంలోకి వస్తే మళ్లీ వెనక్కి రాడానికి ఏ మాత్రం సంకోచించరు వీళ్లు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయనడానికి దీన్ని మించిన నిదర్శనం మరోటి లేదంటున్నారు రాజకీయ పండితులు. అధికారం ఉన్నా లేకపోయినా తమకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడకూడదన్న నైతిక విలువలు తగ్గిపోతున్నాయని వారంటున్నారు.
తెలంగాణాలో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఎంపీలు జాతీయ పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు బి.ఆర్.ఎస్. కు గుడ్ బై చెప్పారు. మరి కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం గులాబీ పార్టీని వీడి తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి చేరడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. కేవలం బి.ఆర్.ఎస్. అధికారంలో లేదన్న ఒకే ఒక్క కారణంతో నేతలు ఇలా పార్టీని వీడ్డాన్ని మేథావులు తప్పుపడుతున్నారు.
వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాము ప్రాతినిథ్యం వహిస్తోన్న భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బి.ఆర్.ఎస్. ను వీడాల్సి రావడం కఠినమైన నిర్ణయమే అన్నారు రంజిత్ రెడ్డి. అటు పసునూరు దయాకర్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి నినాదం నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ ఇద్దరికీ బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ చక్కటి ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయంగా ప్రోత్సహించారు. కేసీయార్ జనాదరణతోనే ఈ ఇద్దరూ ఎంపీలు అయ్యారు. ఏ పార్టీ వల్ల అయితే తమకు రాజకీయంగా ప్రమోషన్ వచ్చిందో ఆ పార్టీనీ ఈ ఇద్దరూ వీడ్డం విశేషం.
కొద్ది రోజుల ముందు బి.ఆర్.ఎస్. కే చెందిన మరో ఇద్దరు ఎంపీలు ఇలానే తమకు రాజకీయంగా అండగా ఉన్న గులాబీ పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ పార్టీలో చేరిపోయారు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరిలో పోతుగంటి రాములు తనయుడికి బిజెపి ఎంపీ టికెట్ ఇచ్చింది. రాములు తనయుడు భరత్ కి నాగర్ కర్నూలు టికెట్ కేటాయించారు. బి.బి.పాటిల్ కు ఆయన సొంత నియోజక వర్గం అయిన జహీరాబాదే కేటాయించారు. టికెట్ల కోసమే ఈ ఇద్దరూ పార్టీ మారారన్నది వాస్తవం.
ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వలసలు ఎక్కువగా కాంగ్రెస్ వైపే జరుగుతున్నాయి. బి.ఆర్.ఎస్. ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేందర్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. కేసీయార్ హయాంలో హైదరాబాద్ నగర మేయర్ గా బొంతు రామ్మోహన్ ను నియమించి ప్రోత్సహించారు. అటువంటి నేత కూడా తనకు మల్కాజగిరి టికెట్ ఇవ్వలేదని బి.ఆర్.ఎస్. వీడి కాంగ్రెస్ లో చేరారు. కేసీయార్ పాలనలో కీలక మంత్రి పదవితో గౌరవించిన మల్లారెడ్డి కూడా తన వ్యాపారాలకోసమో.. రాజకీయ అవసరాలకోసమే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వలసలు ఇప్పటితో ఆగేలా లేవు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరితే నామినేటెడ్ పదవులు పొందచ్చని కొందరు, కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చునని మరి కొందరు పైరవీల కోసం ఇంకొందరు కాంగ్రెస్ లో చేరడానికి సమాయత్త మవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బి.ఆర్.ఎస్. అధికారంలోకి వస్తే ఇపుడు వలసలు పోయిన నేతలంతా ఏదో ఒక సాకు చెప్పి గులాబీ పార్టీలోకి రావడం ఖాయం.అపుడు వారు చెప్పే డైలాగ్ ఒక్కటే. సొంత గూటికి వచ్చామని రొటీన్ డైలాగ్ అప్పచెబుతారు. అయిదేళ్ల పాటు పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉంటే ఈ నేతలకు నష్టం ఏమీ ఉండదు. విలువలకు కట్టుబడి ఉన్నారన్న మంచి పేరు వస్తుంది కూడా. అయినా రాజకీయ స్వార్ధాల కోసం విలువలకు అంతా తిలోదకాలిచ్చేస్తున్నారు. ఇది మంచిది కాదంటున్నారు మేథావులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…