లోకేష్ అలిగారా? లేక వ్యూహాత్మకంగా దూరం పెట్టారా? -TDP- Nara Lokesh

By KTV Telugu On 20 March, 2024
image

KTV TELUGU:-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గారాల పుత్రుడు.  ఆయన రాజకీయ వారసుడు. నారా లోకేష్  .. పార్టీ నిర్వహించే  ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఎందుకని లోకేష్ ను   కీలక సభలకు దూరం పెడుతున్నారు చంద్రబాబు?  పార్టీలో విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం లోకేష్  ది ఐరన్ లెగ్ అని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే  ఎన్నికలయ్యే వరకు కీలక సభల్లో లోకేష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన స్థానంలో దత్త పుత్రుడు  పవన్ కల్యాణ్ ను పక్కన కూర్చోబెట్టుకుని షోలు రన్ చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

నారా లోకేష్. నారావారి ముద్దుల కొడుకు. నందమూరి వారి  ముద్దుల అల్లుడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేక  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకుని ఎమ్మెల్సీ అయిన వారు. అంచెలంచెలుగా కాకుండా వాయువేగంతో  ప్రమోషన్లపై ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు. అయిదేళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. చంద్రబాబు ఎలాగో ఒక లాగ అధికారంలోకి వస్తే  సిఎం సీటుపై ఓ సారి కూర్చోవాలని ఆకాంక్షిస్తోన్న  ఆశావహుడు కూడా. పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు వయసు మీద పడ్డంతో తనయుని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగళం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు చంద్రబాబు. అది  కాస్తా జనం లేక ఫ్లాప్ కావడంతో చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భాన్ని అంది పుచ్చుకుని పాదయాత్రకు మమ అనిపించారు.

పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా  నారా లోకేష్ ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు.2019లోనే టిడిపి గెలిస్తే లోకేష్ ను సిఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్నారు చంద్రబాబు. అయితే టిడిపి అధికారంలోక  రాలేదు సరికదా గౌరవ ప్రదమైన స్కోరు కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు మూడు లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్  తన నియోజక వర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది.

ఆ అధికారంతోనే  ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనూ నారా లోకేష్  జోక్యం చేసుకుని కొందరు  ఎన్.ఆర్.ఐ.లకు  టికెట్లు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ తో కలిసి  హడావిడి చేశారు. తండ్రికి బెయిల్ ఇప్పించుకోవడం కోసం ఢిల్లీలోనే మకాం వేసి బిజెపి అగ్రనేతలను తన పెద్దమ్మ పురందేశ్వరి సౌజన్యంతో కలవగలిగారు. చంద్రబాబు బెయిల్ పై విడుదల అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్. ఇటువంటి లోకేష్  కొద్ది రోజులుగా  పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాల్లో కనపడ్డం లేదు. ఆయన ఎందుకు మిస్ అవుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు.

టిడిపి-జనసేనల పొత్తు ఖరారు అయిన తర్వాత రెండు పార్టీలు కలిసి మొట్ట మొదటి సారిగా తాడేపల్లి గూడెంలో జెండా సభ నిర్వహించాయి రెండు పార్టీలూ కలిసి. ఆ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టిడిపి నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో  లోకేష్ ఎక్కడా కనపడలేదు.  ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై  పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టిడిపి-జనసేనలు తమ తమ అభ్యర్ధుల  జాబితాలను విడుదల చేశాయి.   రెండు జాబితాలు విడుదల  చేస్తే ఆ రెండింటికీ నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా లేక నాయకత్వమే దూరం పెట్టిందా? అన్న చర్చ  జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ లు  పాల్గొన్నారే తప్ప లోకేష్   రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే  అభ్యర్ధుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం  ఇంకేముంటుంది?

మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టిడిపి-బిజెపి-జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరి పేటలో ప్రజాగళం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్  కనపడలేదు. చంద్రబాబు నాయుడు  పవన్ కల్యాణ్  దగ్గుబాటి పురందేశ్వరిలతో పాటు  టిడిపి , బిజెపి సీనియర్లు  పాల్గొన్న  ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు  చేసేందుకు శ్రీకారం చుట్టినపుడు లోకేష్ ఉన్నారు. కానీ  అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టిడిపి వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్గొనకపోవడానికి కారణాలు ఏంటి? పార్టీ నాయకత్వంపై కానీ తన తండ్రిపై కానీ లోకేష్ అలిగారా? లేక పొత్తులపై ఆయనకు అసంతృప్తి ఏమన్నా ఉందా? లేక తనకు సరియైన విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా? అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని  చంద్రబాబుకు సన్నిహితులైన వారు చెబుతున్నారు. నారా లోకేష్ పాల్గొన్న సభలు పార్టీకి అచ్చి రావడం లేదని చంద్రబాబు భావిస్తున్నారట.  ఎన్నికల తంతు పూర్తి అయ్యేవరకు లోకేష్ లెగ్ సభావేదికలపై లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరి పేటలో  సభ పెట్టేసుకున్నారు చంద్రబాబు.

పార్టీ అధ్యక్షుడు కన్న తండ్రే తనను నియోజక వర్గానికి పరిమితం అవ్వమని చెప్పడంతో లోకేష్  అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి