చంద్రబాబు భయం !..నిజమేనా..!? – Is Chandrababu Fearing

By KTV Telugu On 21 March, 2024
image

KTV TELUGU :-

చిలకలూరుపేట సభ ఆవిష్కరించిన ప్రశ్నలేమిటి. ఏపీలో ఎన్డీయే కూటమికి అడ్వాంటేజ్ కంటే సమస్యలు ఎక్కువగా సృష్టించిందా.. మోదీ ప్రసంగంలో నిగూఢమైన అర్థాలు ఇప్పుడు టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయా.  ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం కంటే గెలిచిన తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును  వెంటాడుతోంది…

అంత కష్టపడి చిలకలూరిపేటలో మూడు పార్టీల ఎన్డీయే కూటమి భేటీ నిర్వహిస్తే ఇప్పుడు కొత్త సమస్యలు  ప్రస్తావనకు వస్తున్నాయని టీడీపీ  వర్గాలు అంటున్నాయి. ఆ రెండు అడక్కు అన్నట్లగా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు వ్యవహారంపై మోదీ తన ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. ఆ మాట బయటకు రాకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన కలిసి అధికార  వైసీపీపై వేరే విధంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. చిలకలూరిపేట సభను  అడ్డుకునేందుకు వైసీపీ కుట్రపన్నిందని ఆరోపిస్తున్నాయి. పోలీసుల వైఫల్యంపై ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్డీయేలో చేరిన తర్వాత చంద్రబాబుకు కొన్ని భయాలు పట్టుకున్నాయన్న చర్చ మరో ఎత్తు అని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా ముస్లిం ఓటర్లు దూరం  జరుగుతారని చంద్రబాబు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారట. అందుకే త‌న నివాసంలో ముస్లిం సంఘాల‌తో చంద్ర‌బాబునాయుడు స‌మావేశ‌మ‌య్యారు. అధికారానికి వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్ర‌త్యేకంగా డిక్ల‌రేష‌న్  విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే  బీజేపీతో క‌లిశామ‌ని, ముస్లింలు దూర‌దృష్టితో ఆలోచించి, అండ‌గా నిల‌వాల‌ని అభ్యర్థించారు. గ‌తంలో మ‌త‌పర‌మైన అంశాల్లో ఎక్క‌డా జోక్యం చేసుకోలేద‌ని, ఇప్పుడూ ఎలాంటి రాజీ వుండ‌బోద‌ని ఆయ‌న అన్నారు.సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ముస్లిం రిజర్వేషన్ అమలు చేసి  తీరుతామని ఆయన చెప్పారు. ఐనా ముస్లింలు దగ్గరవుతారన్న నమ్మకం లేక చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి…

బీజేపీతో జతకట్టాక చంద్రబాబుకు ఇప్పుడు లోకేష్ భయం పట్టుకుంది. కమలం పార్టీ లోకేష్ కు అడ్డు తగులుతుందా అన్న అనుమానాలు ఆయనలో  నాటుకుపోయాయి. అందుకు రెండు మూడు కారణాలు కూడా ఉన్నాయని  ఒప్పుకోకతప్పదు…

చిలకలూరిపేట సభలో లోకేష్ ఎందుకు ప్రసంగించలేదు. ఒక కీలక వేదికపై అధికార వైసీపీని ఉతికి ఆరేసే సత్తా ఉన్న నాయకుడు ఎందుకు పక్కన కూర్చున్నారు. తొలి నుంచి సభ ఏర్పాట్లన్నీ చూసి దాన్ని సూపర్  సక్సెస్ చేసిన  లోకేష్ కు మాట్లాడే అవకాశం ఎందుకు రాలేదన్నది ఇప్పుడు చాలామందిని  వేధిస్తున్న ప్రశ్న. దీనికి చంద్రబాబు భయమే కారణమన్న విశ్లేషణలు  వినిపిస్తున్నాయి. కుటుంబ పాలనకు మోదీ వ్యతిరేకి అన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ ను ఆయన మా, బేటేకీ  సర్కార్ అని పిలుస్తుంటారు.  ఎక్కడ కుటుంబ రాజకీయాలున్నా వారిని విమర్శిస్తుంటారు. తమిళనాడులో స్టాలిన్  వారసత్వ రాజకీయాల  వల్లే పైకి వచ్చారని మోదీ ఆరోపిస్తుంటారు. అలాంటి సందర్భంగా లోకేష్ మాట్లాడాలని ప్రయత్నిస్తే బీజేపీ వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న భయంతో ఆ యువనేత ప్రసంగం లేకుండా చేశారని చెబుతున్నారు. పైగా వేదికపైకి కూడా పిలవలేదు. ఇందులో మరో  కోణం  కూడా ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేష్ కు  మంత్రి పదవి ఇస్తే బీజేపీ ఊరుకుంటుందా.. వారసత్వ రాజకీయాలంటూ అడ్డుతగిలితే ఏం చేయాలన్నది ఇప్పుడు చంద్రబాబుకు అంతుపట్టని సమస్యగా మారింది…

స్వతహాగా చంద్రబాబు భయస్తుడన్న  పేరు చాలా కాలంగా ఉంది. పని చేసుకుపోవడం తప్పితే  ఎవరినీ గట్టిగా ప్రతిఘటించే ధైర్యం చేయరు. ఇప్పుడు కూడా అంతే కుమిలిపోవడం మినహా.. తన ఆందోళనను పక్కనోళ్లకు చెప్పి వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం ఉండకపోవచ్చు. నిజంగా బీజేపీ మదిలో ఏముందో  చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి