తెలంగాణలో వామపక్ష పార్టీలు మరోసారి యూ టర్న్ తీసుకుంటాయా? సిద్ధాంత రాద్ధాంతాల కంటే సీట్లే ముఖ్యమని లెఫ్ట్ పార్టీ నేతలు భావిస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాండివ్వడంతో హస్తం పార్టీవైపు మొగ్గారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో మరోసారి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? లెఫ్ట్ పార్టీల నేతలతో బీఆర్ఎస్ చర్చలు జరుపుతోందా? ఇది కాకపోతే సీపీఎం, సీపీఐ పార్టీల దారెటు? వాచ్ దిస్ స్టోరీ..
లోకసభ ఎన్నికల వేళ తెలంగాణలో కమ్యూనిస్ట్ ల పొత్తుల ఏపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకి ఒక సీటు దక్కించుకుంది. సీపీఎం ఓంటరిగా బరిలో దిగి అసెంబ్లీలో ప్రవేశించలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు రెండు లోకసభ స్థానాలు లేదంటే కనీసం ఒక్క స్థానమైనా ఇవ్వాలని సీపీఐ నాయకులు కాంగ్రెస్‌ను కోరగా ఆ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సీపీఏం పార్టీ సైతం ఒక లోకసభ స్థానం అడుగుతోంది. లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ పీక్స్‌కు చేరింది. ఉన్నవాటిలో ఉభయ కమ్యూనిస్టులకు చెరొకటి ఇస్తే చాలా కష్టమవుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ వీరి డిమాండ్‌ను పట్టించుకోవడంలేదు. దీంతో ఇండియా కూటమిలో ఉన్నాకూడా కాంగ్రెస్ తమను కనీసం పట్టించుకోక పోవడంపై లెఫ్ట్ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా..పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేసే దిశగా సీపీఐ, సీపీఎం నాయకత్వాలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు పార్టీలు..అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు మరోసారి మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వామపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్… లోకసభ ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును కోల్పోలేదనే సంకేతాలు బలంగా పంపాలన్న ఉద్దేశ్యంతో ఉంది.
ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రంలో పార్టీ ఊనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలను ఏమాత్రం లైట్ గా తీసుకోవద్దన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్న కేసీఆర్…వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాల్ విసరాలని చూస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తేనే గులాబీ పార్టీ పునాదులు కదల్లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి. లేదంటే..లెక్కలు పూర్తిగా తప్పే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతలు నుంచి కమ్యూనిస్టు పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించిచట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ తో కలిసి రావాలని కోరుతూ వామపక్ష పార్టీల నేతలతో బీఆర్ఎస్ నేతలు కొందరు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు బలం బాగా ఉంది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కూడా రెండు కమ్యూనిస్టు పార్టీలకే క్యాడర్ బలం ఉంది. వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మూడు పార్లమెంట్ స్థానాలలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంలో ఉంది బీఆర్ఎస్. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్, వామపక్ష పార్టీల పొత్తుల అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చాక తమ అవసరం లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి తీరు కూడా లెఫ్ట్ నేతలకు నచ్చడంలేదని అంటున్నారు.
2009 ఎన్నికల వరకు ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీతో పొత్తులు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలు..తెలంగాణ ఉద్యమ కాలం నుంచి, రాష్ట్ర విభజన తర్వాత పూర్తి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పీడిత ప్రజల్ని ఏకం చేయాలని పిలుపునిచ్చే ఈ రెండు పార్టీలే అసలు కలవడంలేదు. ప్రతి ఎన్నికలోనూ చెరో దారిన ప్రయాణం చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ తీరు నచ్చక మళ్ళీ కేసీఆర్ వైపు మొగ్గే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లెఫ్ట్ పార్టీల అడుగులు ఎటువైపు పడతాయో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…