కేజ్రీవాల్ అరెస్టు ఇస్తున్న సంకేతాలు ఏమిటి.. బీజేపీ వేసిన స్కెచ్ తో ఒక దెబ్బకు వంద పిట్టల్ని కొట్టారా. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థులకు, ప్రాంతీయ పార్టీలకు ఇదో హెచ్చరిక అవుతుందా. తెలంగాణ విషయంలోనూ బీజేపీ ఏదోక బ్రేక్ ఇచ్చినట్లే అవుతోంది. బీజేపీ కీలక నేతలను సైలెంట్ చేసేందుకు కూడా ఇదో కీలక పరిణామం అవుతుందా….
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసమే కేంద్రంగా హై డ్రామా నడిచింది. బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలకు వెళ్లారు. తొలుత కొంత ప్రతిఘటన ఎదురైనా తర్వాత సోదాలు కొనసాగిన గంటన్నర వ్యవధిలోనే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో మరో అరెస్టు నమోదైంది. పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ, ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు కావడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ఊహించిందే అయినా దేశ చరిత్రలో మాత్రం సంచనలమే అవుతుంది. 100 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీజేపీ వేసిన స్కెచ్ కూడా పక్కాగా అమలవుతోంది. ఇది ఓ చిన్న రాష్ట్రంలో, ఒకే ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టేందుకు వేసిన వ్యూహం మాత్రమే కాదని అర్థం చేసుకున్న వారు కేజ్రీవాల్ అరెస్టు వెనుక ఉన్న మతలబును పసిగట్టగలరు. ఎందుకంటే ఆప్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా, గుజరాత్ లో కూడా పుంజుకుంటోంది. జాతీయ పార్టీగా మారే క్రమంలో ఉన్న ఆప్ ను నేలకు దించేందుకు బీజేపీ స్టార్ క్యాంపైనర్ అయిన ప్రధాని మోదీ వేసిన స్కెచ్ ఇది అని చెప్పకతప్పదు. ఉంటే బీజేపీలో ఉండు లేకుంటే జైల్లో ఉండు అన్నట్లుగా ఇప్పుడు మోదీ, అమిత్ షా వ్యూహం అమలవుతోంది. పైగా లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాల్లోనూ బీజేపీ మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నప్పటికీ ఆప్ ను వదిలిపెట్టేందుకు మోదీ సిద్ధంగా లేరనేందుకు కేజ్రీవాల్ అరెస్టు సంకేతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు నేతలు జాగ్రత్త పడేందుకు, దూకుడును తగ్గించుకునేందుకు కూడా కేజ్రీవాల్ అరెస్టు ఒక హెచ్చరికగా మారింది…
కేజ్రీవాల్ అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు లింకు ఉండబోతోందా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు వాటిని ఆపే అవకాశాలు ఉన్నాయి. తొందరపడితే పైన మోదీ ఉన్నాడన్న భయోత్పాతం సృష్టించేందుకు కూడా ఇదో గేమ్ ప్లాన్ అవుతుంది. బీఆర్ఎస్ కీలకనేతలకు, బీజేపీకి మధ్య ఏదో లోపాయకారి ఒప్పందం ఉందని చెప్పక తప్పదా…
లిక్కర్ స్కాం అరెస్టులు ఒక పక్క, తెలంగాణ రాజకీయాలు మరో పక్క సమాంతరంగా నడుస్తున్న గేమ్ ప్లాన్ అని చెప్పక తప్పదు. కవితను అరెస్టు చేయడం ద్వారా బీఆర్ఎస్ కు బీజేపీ గట్టి సందేశమే ఇచ్చింది. మీకు ముందుంది మొసళ్ల పండుగ అని చెప్పేసింది. తోక ఝాడిస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని హెచ్చరించేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వలసల రూపంలో జరుగుతున్న తంతును కూడా బీజేపీ జాగ్రత్తగానే గమనిస్తోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే తొలుత బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు పోటీ పడ్డారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ రాములు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారు. దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డి లాంటి వారికి కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చేసింది. 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారన్న టాక్ నడుమ బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు బీజేపీకి అసలు నచ్చడం లేదు. నచ్చవు కూడా. అందరినీ తమలో కలిపేసుకుందామనుకుంటే, వాళ్లంతా రూటు మార్చుతున్నారన్న ఆగ్రహం బీజేపీలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ధైర్యం చేయకుండా చూసేందుకు బీజేపీ అరెస్టుల గేమ్ ప్లాన్ అమలు చేస్తోందనుకోవాలి. పైగా కొందరు నేతలతో బీజేపీ లోపాయకారి ఒప్పందాలు కూడా చేసుకుంటోందని సమాచారం అందుతోంది. కాంగ్రెస్ దెబ్బను తట్టుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీతో రాజీకి సిద్ధమైనట్లుగా ఇరు పార్టీల అంతర్గత సమాచారం. కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళ్లబేరానికి వచ్చారని చెబుతున్నారు. నన్ను వదిలెయ్యి బాబు బతికిపోతాను అన్నట్లుగా ఆయన తీరు ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలోనే పలాయనవాదులు తయారయ్యారని చెబుతున్నారు. కేటీఆర్ తో విభేదాల కారణంగా హరీశ్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే టైమ్ ఎంతో దూరంలో లేదని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హరీశ్ రావు… కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు ఆయన బీజేపీ నేతలతో మాట్లాడుకున్నారని చర్చ జరుగుతోంది. హరీశ్ రావు వెళ్లేపనయితే బీఆర్ఎస్ఎల్పీలో కొందరు ఎమ్మెల్యేలు ఆయన వెంట కమలం పార్టీలోకి నడుస్తారు. ఈ మేరకు బీజేపీతో ఒప్పందం జరిగిందని కూడా చెబుతున్నారు. తాను తీసుకురాబోయే ఎమ్మెల్యేల విషయంపై కూడా హరీశ్ రావు బీజేపీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, అందుకు బీజేపీ పెద్దలు కూడా సంతృప్తి చెందారని బీజేపీలో అంతర్గతంగా వినిపిస్తున్న టాక్. హరీశ్ రావు ఆకాంక్షలు నెరవేరాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఉండి ప్రయోజనం లేదు. పైగా కాంగ్రెస్ నుంచి తనకు ప్రొటెక్షన్ కావాలంటే కూడా కేంద్రంలోని పార్టీలో కలిసిపోతే సరిపోతుందని హరీశ్ భావిస్తున్నారు. ఈ సంగతి అర్థమై కూడా పరిస్తితులను బట్టి కేసీఆర్ మౌనం వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను కోల్డ్ స్టోరేజీలో ఉంచడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారట….
ప్రాంతీయ పార్టీల ఖేల్ ఖతం చేయాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా వాళ్లు అవినీతి రారాజులా మారి.. తమ జుట్టు బీజేపీ చేతుల్లో పెట్టేశారు. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ ను అరెస్టు చేసినా చూస్తూ ఉరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ రాజకీయంగా పైచేయి సాధించడంతో పాటు అందరినీ లాగేసుకుని మరింత బలపడాలనుకుంటోంది. అది హరీశ్ రావు అయినా కేసీఆర్ అయినా తప్పదు మరి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…