తెలంగాణలో రాజకీయ పరిస్థితి చూసిన వారికి.. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో పదేళ్లు అధికార పార్టీ నేతలుగా ఉన్న వారు రేపటి నుంచి.. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్లీ అధికార పార్టీ నేతలుగా చెలామణి అవబోతున్నారు. వారికి పార్టీ ముఖ్యం కాదు. అధికార పార్టీ అనే ట్యాగ్ ముఖ్యం. అయితే వారు గెలిచింది ప్రస్తుతం చేరుతున్న పార్టీకి వ్యతిరేకంగా. మరి ప్రజల సంగతేంటి ? వారి తీర్పును వీరు ధిక్కరిస్తున్నట్లేగా ? మోసం చేస్తున్నట్లే కదా !
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. రెండు సార్లు ఎల్పీని బీఆర్ఎస్ విలీనం చేసుకున్నా.. ముఖ్యమైన నేతలంతా ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని వేరే పార్టీలో చేరిపోయినా చివరికి ప్రజలు ఆదరించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం చేస్తోంది. తమ ఓటమికి పని చేసిన వారిని చేర్చుకుంటోంది. వారు లేకపోతే లోక్ సభ ఎన్నికల్లో గెలవలేమన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించినట్లు అవడం లేదా ?. అయినా సరే ఫిరాయింపులకు సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. దానికి కారణంగా ఆయన తన పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతమని ఇతర పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల్ని కారణంగా చూపిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు పెద్ద ఛాలెంజ్. అందులో సందేహం లేదు. అత్యధిక సీట్లు సాధించి చూయిస్తే ఆయన అధిష్టానం దగ్గర ఆయన పలుకుబడి పెరుగుతుంది. సీనియర్ల వాయిస్ తగ్గుతుంది. పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు ప్రజలిచ్చే తీర్పు అని కూడా ఆయన చెప్పుకోవడంలో ఎంతో ధీమా కనబడుతోంది. క్షణం వదలకుండా శ్రమించి ఆరు హామీలను జనానికి రుచి చూయించే ప్రయత్నం చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా ఇంకా అదనపు బలం కావాలి. ప్రత్యర్థులు బలహీనపడాలని ఆయన ఆరాటపడుతున్నారు. పార్టీ తలుపులు తెరిచి తమకు ఓట్లు పెరిగే దిశగా, గెలుపు గుర్రాల చేర్పులో పడ్డారు. గేట్లు పూర్తిగా తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని కూడా సవాలు విసిరారు.. ఇప్పుడు గేటలు గెలిచారు. 2015లో హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారాస ప్రణాళికనే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది. కార్పొరేషన్ గెలుపు కోసం ఆనాడు కెసిఆర్ నగరంలో గెలిచిన ఇతర పార్టీల ఎంఎల్ఎలను అదిరించి, బెదిరించి ఆనాటి టిఆర్ఎస్లో చేర్చుకొని సిటీలో తమ బలం పెంచుకొని బల్దియాను హస్తగతం చేసుకున్నారు.
బీఆర్ఎస్ నేతల్ని ఎంత మందిని చేర్చుకుంటే అంత సమస్య. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇవి తప్పని చర్యలైనా దీర్ఘకాలంలో చిక్కులు కొనితెచ్చుకున్నట్లవుతుంది. నిన్నటి దాక శత్రువుగా చూసిన ప్రత్యర్థి తమ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బ తిని కింది స్థాయిలో పార్టీ వేళ్ళు బలహీనమవుతాయి. ఆ పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంది. పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే ధోరణి ఆరోగ్యకరం కాదు. ఇక అసలు విషయానికొస్తే మన నాయకులు ఎంత నీతివంతులో వాళ్లే స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. కెసిఆర్ వెంట ఉంటే లాభమేమి లేదని అటు బిజెపి లేదా ఇటు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఈ రకంగా ఏ పార్టీ అయినా పేక మేడనే అని అర్థమవుతోంది. గెలుపే దాని ఊతకర్ర. అది జారిపోతే కూలిపోవాల్సిందే. గెలుపోటములకు అతీతంగా పార్టీని పట్టుకొని నిలిచే సంప్రదాయం గంగలో కలిసిపోయింది. రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తల రాక కూడా దీనికి కొంత కారణం అనుకోవచ్చు.
రాజకీయాల వల్ల వారికి రెండు రకాలుగా ప్రయోజనమే. కోట్లు ఖర్చు చేసినా రాని ప్రోటోకాల్ గౌరవం అనుభవించవచ్చు. తమ వ్యాపార పనులు సునాయాసంగా చక్కదిద్దుకోవచ్చు. చట్టాన్ని అతిక్రమించినా అడిగేవాడు ఉండడు. అయితే వీరి డబ్బే వీరికి బలం. ప్రజల పట్ల ఎలాంటి బాధ్యతను తీసుకోరు. పార్టీని వీడడానికి కూడా వెనుకాడరు. ఉన్న పార్టీతో ఎలాంటి భావోద్వేగ అనుబంధం ఉండదు. వీరి చేరిక అన్ని పార్టీలకు ముప్పే. పార్టీని, హోదాని వాడుకోవడమే తప్ప కష్టకాలంలో పార్టీకి అండగా నిలవరు. దీనికి ఉదాహరణగా భారాసను వీడాలనుకుంటున్న ఎందరో నేతల పేర్లు చెప్పవచ్చు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఎంఎల్ఎలు పార్టీని వదిలి కాంగ్రెస్ వైపు వెళ్లడం ఓటర్లను మోసం చేయడమే. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ?
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…