జగనన్నకు తంటాలు – YS AVINASH REDDY – YS JAGAN MOHAN REDDY – YS VIVEKANANDHA REDDY

By KTV Telugu On 23 March, 2024
image

KTV TELUGU :-

జగన్  రెడ్డి సొంత  జిల్లాలోనే  సమస్యలు కొని తెచ్చుకున్నారు. బాబాయ్  వివేకానందరెడ్డి  హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్  రెడ్డికి మళ్లీ కడప ఎంపీ టికెట్ ఇచ్చి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. కడప జనం  కూడా ఇప్పుడు జగన్ తీరుపై  తీవ్ర  అసహనంగా  ఉన్నారు. ఆయన విచక్షణా  జ్ఞానాన్ని పక్కన పెట్టి, ఆశ్రిత పక్షపాతానికి దిగుతున్నారన్న ఫీలింగ్ వారిలో కలుగుతోంది…

వైసీపీకి ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్లో ఎదురుగాలి వీస్తోంది.  అమరావతి నుంచి మారుమూల గ్రామాల వరకు అధికారపార్టీని వ్యతిరేకించే వాళ్లే  ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓటు ద్వారా తమ తీర్పు ఇచ్చి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామన్న ఆత్రుత సామాన్య జనంలో  కనిపిస్తోంది. అలాంటి సందర్భంలో జనాన్ని ఆకట్టుకుని తమ వైపుకు తిప్పుకునేందుకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన  వైసీపీ అధినేత జగన్ తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. చివరకు ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో సైతం  నాకు  నేనే రాజుని అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా మళ్లీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేరును ప్రకటించి జగన్ తన నైజాన్ని చాటుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు అవినాశ్  సూత్రధారి అని సీబీఐ తేల్చిన తర్వాత కూడా జగన్ తీరు మారకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది ముమ్మాటికి మొండి వైఖరేనని, రాజకీయాలను ప్రజా జీవితాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఇప్పుడు జగన్ సొంత  సోదరి వైఎస్ షర్మిలా  రెడ్డి, వివేకా కూతురు  సునీతా రెడ్డి ఇద్దరూ ఆ హత్య విషయంలో జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నప్పటికీ ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా  లేకపోవడం ఆశ్చర్యాన్ని  కలిగిస్తోంది. అవినాశ్ కు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకుని మళ్లీ ఎందుకు  బీ ఫార్మ్ ఇస్తున్నారని కడప జనం ప్రశ్నిస్తున్నారు. నిందితులకు తాను  కొమ్ము కాయడం లేదని జగన్ నిరూపించుకోవాలని సునీతా రెడ్డి వారానికి రెండు  సార్లు ప్రకటనలిస్తున్నప్పటికీ జగన్ పట్టించుకోవడం లేదు.

అవినాశ్ రెడ్డిని సీబీఐ  అరెస్టు చేసిన తర్వాత కూడా జగన్  వైఖరిలో మార్పు రాలేదు. భాస్కర్  రెడ్డి జైలులో ఉన్నా కూడా జగన్ వారికి  మద్దతివ్వడం ఆపలేదు. గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా వారినే పట్టుకు వేలాడుతున్నారు. భార్య భారతీ రెడ్డి మినహా కుటుంబం మొత్తం వ్యతిరేకంగా తయారైనా కూడా జగన్ వెనుకాడటం లేదు. తాను పట్టిన కుందేలుకు  మూడే కాళ్లు అన్నట్లుగా ఆయన వ్యవహారం  ఉంది…

హూ కిల్డ్ బాబాయ్… సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ హ్యాష్ ట్యాగ్ ఇదే. ఈ మాట వినగానే జగన్, వివేకానందరెడ్డి వారి కుటుంబం గుర్తుకు వస్తుంది. జరూర్  దాల్ మే కుఛ్  కాలా హై అన్నట్లుగా అవినాశ్ రెడ్డి కుటుంబం ప్రమేయం ఆ హత్యలో ఉందనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా కోర్టు షరతుల మేరకే అవినాశ్  రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం, రూల్స్ ప్రకారం ఆయనకు బెయిల్ రావడం జరిగిపోయింది. ఆ విషయాలేమీ తనకు తెలియనట్లు, అసలేమీ పట్టనట్లు జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అవినాశ్ రెడ్డి పునీతుడైనట్లుగా ఆయనకు కడప ఎంపీ టికెట్ ఇచ్చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని  షర్మిల పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ జగన్  తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ఈ హత్య వ్యవహారం జగన్ కు ముందే తెలుసని భావిస్తున్నారు. సునీతా  రెడ్డి  అయితే నిజమైన  దోషులకు శిక్ష  పడే దాకా విశ్రమించేది లేదంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కడప జనం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు కడప జిల్లాలో ఏ ఇద్దరు  కలిసినా జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారన్న చర్చే జరుగుతోంది.వినాశకాలే విపరీత బుద్ధే అన్నట్లుగా జగన్ తయారయ్యారని కడప జనం ఆగ్రహం చెందుతున్నారు. అసలు నియోజకవర్గానికి అవినాశ్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న జనం ఆయన్ను  మరో సారి  గెలవనిచ్చేది లేదని తీర్మానించుకున్నారు.

జగన్ ది ఫ్రస్టేషనా.  ఓవర్ కాన్ఫిడెన్సా.. ఎవరికి  టికెట్టిచ్చినా ఓటమి ఖాయం కనుక అవినాశ్ కే అవకాశం ఇచ్చారా. తాను ఇంటికి  పోతూ,అందరినీ ఇంటికి  పంపేందుకు డిసైడయ్యారా.. ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్న వేళ కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అభ్యర్థుల ప్రకటన కూడా అంతంతమాత్రంగానే ఉంది. అవినీతి ఆరోపణలున్న సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇచ్చారు. ఐనా అంతా జగన్ ఇష్టమే కదా..మనమేం చేయగలం….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి