అవకాశవాదుల్ని నమ్మి నట్టేట మునిగిన కేసీఆర్ – KCR

By KTV Telugu On 24 March, 2024
image

KTV TELUGU :-

కేసీఆర్ ఇప్పుడు  రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు.  తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లినప్పటి నుండి ఆయన  ఎత్తుపల్లాలు చూసి ఉంటారు కానీ  ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితి చూసి ఉండవు.  నమ్మి నెత్తికెక్కించుకున్న  వారంతా నట్టేట ముంచి వెళ్లిపోతున్నారు.  పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా.. తమకు హోదా ఇచ్చిన అధినేత కుమార్తెను అరెస్టు చేస్తే కనీస సానుభూతి చూపించడం లేదు.  దీనంతటికి కారణం కేసీఆరే. అవకాశవాదుల్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవడమే కారణం.

భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు నమ్మకమైన నేత.  ఒక్కరంటే ఒక్కరినీ నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో..  వేరే పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి. కొన్ని పుకార్లు  కావాలని కొంత మంది నేతలు సృష్టించుకుంటే.. మరికొన్ని మీడియాలో  వచ్చేస్తున్నాయి.  ఇలా అందరిపైనా పార్టీ మార్పు వార్తలొస్తున్నాయి. కానీ వాస్తవంగా చాలా మంది పార్టీ మారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు.

కే కేశవరావు కూడా   కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఆ ఉద్దేశం లేకపోతే  కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని ఇంటికి ఆహ్వానించేవారు కాదు. అసలు కేకే   ఎవరు ?.  రాజకీయంగా ఆయన పలుకుబడి ఎంత ?. అని ఆలోచిస్తే…  ఆయన వెంట పది మంది ఓటర్లు ఉంటారని ఎవరూ అనుకోరు. కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే..  ఆయనను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అయినా కాంగ్రెస్ నుంచి తెచ్చుకుని చాలా ప్రయారిటీ ఇచ్చి రాజ్యసభ సీట్లు ఇచ్చి.. కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇస్తే.. ఇప్పుడు ప్రభుత్వం మారగానే .. మా సొంత పార్టీ కాంగ్రెస్ అంటూ చేరిపోయేందుకు రెడీ అయ్యారు.  ఇలాంటి అవకాశవాదం ఒక్క కేకేనే కాదు… పార్టీ వీడిపోతున్న అందరిలోనూ ఉంది.   దానం నాగేందర్ దగ్గర నుంచి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వరకూ అందరూ అంతే.  వీరిలో అత్యధిక మందిని కేసీఆర్ నయానో.. భయానో పార్టీలో చేర్చుకున్నారు. వారు చేరే ఆసక్తి లేకపోయినా వివిధ మార్గాలు ప్రయోగించి చేర్చుకున్నారు. వారి వల్ల ఆయన ఎంత లాభపడ్డారో తెలియదు కానీ.. కష్టసమయంలో మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వారంతా మరో ఆలోచన లేకుండా గుడ్ బై చెబుతున్నారు.

కేసీఆర్ తాను గుప్పిడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించానని చెబుతారు. అది నిజం కూడా.  ఆయన ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయనతో ఉన్న వారు కష్టనష్టాలను భరించి ఆయనతో కొనసాగారు. చివరికి ఉద్యమం పీక్స్‌కు చేరిన తర్వాత వారిలో చలా మంది ఇప్పుడు లేరు. ఆయనతో  సుదీర్ఘ కాలం ఉన్న వారికి ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పటికీ పార్టీలో .. ఉద్యమ సమయం నుంచి ఉన్న వారు ఉన్నా వారెవరికి చిన్న పదవులు కూడా రాలేదు. కానీ  ఉద్యమకారులపై దండెత్తిన దానం వంటి వారు పార్టీలో ప్రముఖులయ్యారు. సమైక్యవాది తలసాని మంత్రి అయ్యారు.  కేసీఆర్ ను నమ్ముకుని ఉన్న వారు ఇప్పటికీ ఉన్నారు. మధ్యలో వచ్చి అధికారం అనుభవించి మధ్యలోనే వెళ్లిపోతున్న వారు ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు తన వాళ్లను దూరం చేసుకున్నారు…   అధికారం కోసం దగ్గరకు వచ్చిన వాళ్లూ దూరం అవుతున్నారు.  ఇది కేసీఆర్  స్వయంకృతమే.

తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో బీఆర్ఎస్ లో .. కొత్త గా చేరిన వారితే రాజ్యం అయింది. వారిదే హవా అయింది. ఇలాంటి వారంతా పదవులు, అధికారం, డబ్బు సంపాదన కోసం వచ్చిన వారే. ఇలాంటి వారు అధికారం పోగానే వెళ్లిపోతున్నారు. కేసీఆర్ అధికారం అందిన తర్వాత.. అది శాశ్వతం అనుకున్నారు.  రాజకీయ వ్యూహాలతో..  ఫిరాయింపు నేతల్ని అట్టి పెట్టుకుంటే చాలనుకున్నారు. కానీ ప్రజలు మరో విధంగా ఆలోచించారు. ఇప్పుడు  కేసీఆర్ నమ్ముకున్న నేతలు అధికార పార్టీలో చేరిపోతున్నారు. వారు అధికారంలో ఉంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటు ఉద్యమ సమయంలో వెంట నడిచిన వారు దగ్గరకు రాలేరు.  దగ్గరకు తీసుకున్న వారు..  అధికారం కోసం వలసపోయారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి