ఎవరైనా పార్టీ మారిన మరుక్షణం మాజీ లు కావాల్సిందేనని రాజకీయ నేతలు భీకరంగ ప్రకటనలు చేస్తూంటారు. అందు కోసం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. కానీ ఏం జరిగింది .. అనర్హతా వేటు వేయడానికి పదవి కాలం ముగిసే వరకూ ఎదురు చూస్తున్నారు. అదే అధికార పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం క్షణల్లో జరిగిపోతోంది. మరి చట్టాలతో ప్రయోజనం ఏమిటి ? పనికి రాని చట్టాలను ఎందుకు చేస్తున్నారు ?
తెలంగాణలో రాజకీయ పరిస్థితి చూసిన వారికి.. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో పదేళ్లు అధికార పార్టీ నేతలుగా ఉన్న వారు రేపటి నుంచి.. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్లీ అధికార పార్టీ నేతలుగా చెలామణి అవబోతున్నారు. వారికి పార్టీ ముఖ్యం కాదు. అధికార పార్టీ అనే ట్యాగ్ ముఖ్యం. అయితే వారు గెలిచింది ప్రస్తుతం చేరుతున్న పార్టీకి వ్యతిరేకంగా. మరి ప్రజల సంగతేంటి ? వారి తీర్పును వీరు ధిక్కరిస్తున్నట్లేగా ? మోసం చేస్తున్నట్లే కదా అన్న ప్రశ్నలకు తావు లేదు. ఎందుకంటే అంతకు ముందు కేసీఆర్ అలాగే చేశారంటున్నారు. ఎవరిపైనా అనర్హతా వేటు పడలేదు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరించగానే ఆరుగురిపై అనర్హతా వేటు వేశారు. కానీ అదే కాంగ్రెస్ లో చేరితే తెలంగాణలో వేటు పడటం లేదు. అంటే.. ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా ఫెయిలయిందని అర్థం అనుకోవచ్చు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. ప్రభుత్వాలను మార్చడం. ప్రజాభిప్రాయానికి విలువ లేదు. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. చేతిలో ఉన్న వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం.. అడ్డ దిడ్డంగా ప్రభుత్వాల్ని మార్చేయడం…రాజకీయ పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి ఫిరాయింపులు ప్రోత్సహించడం కామన్ గా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు లోపం.. రాజకీయ పార్టీల దగ్గరే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చిందని తెలిసినా.. అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ పార్టీలు రాటుదేలిపోతున్నాయి. దీనికి వారికి ఒకే ఒక్క ఆయుధం..అవసరం అవుతోంది. అదే అధికారం..
ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ చాలా సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో ఏర్పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతలు , ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లో చేరిపోయారు. ఎవరూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ ఉల్లంఘించడం లేదు. ఆ చట్టానికి చిక్కకుండా..రాజకయం చేస్తున్నారు. మూడింట రెండు వంతుల మందిని విలీన చేసుకోవడం ఓ విధానం అయితే.. ప ప్రభుత్వాన్ని కూలదోయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల్ని ఆకర్షించి… రాజీనామాలు చేయించడం మరో మార్గం. అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పటికీ తమకు అంతకు మించిన పదవి వస్తుందన్న ఆశతోనే రాజకీయ నేతలు దూకుళ్లకు సిద్దమవుతున్నారు. అలాగే విపక్షంలో ఉండలేక చాలా మంది దూకేస్తున్నారు. ఇలాంటి నేతలు ఉన్నప్పుడు .. వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో.. అన్ని పార్టీలు అదే వ్యూహాన్ని అమలు చేస్తాయి. కాకపోతే.. అధికారంలో ఉన్న వారికి మాత్రమే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అలాంటివి చాలా చేసింది. అందుకే ఇప్పుడు బీజేపీ చేసినా గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కదా అన్న అభిప్రాయమే వినిపించింది.
బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని విలీనం చేసుకున్నప్పుడు అదే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెబుతోంది. మీరు చేశారు కదా అని బీఆర్ఎస్ నేతల్ని ప్రశఅనిస్తోంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న నష్టాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాయి. కుల, మత , ప్రాంతాల ఆధారంగా పుట్టిన పార్టీల్లో.. ఎదుగుతున్న నేతలు.. ఆయా పార్టీల్లో .. తమకు ప్రాధాన్యత ఉన్నంత వరకే ఉంటున్నారు. అధికారం అనుభవించినంత కాలం.. తాము ఉంటున్న పార్టీ భావజాలమే.. తమ నరనరాన ఉందని మీడియా ఎదుట నిరూపిస్తూ ఉంటారు. కానీ అధికారం పోయిన మరుక్షణం .. వారి భావజాలం… అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. . గతంలో ఫిరాయింపుల నిరోధక చట్టం చేసిన పార్టీలు.. అందులో లొసుగుల్ని కూడా పెట్టాయి. అధికార పార్టీకి ఎలాంటి హానీ జరగకుండా… ప్రతిపక్షాలను తాము చిన్నాభిన్నం చేయవచ్చు కానీ.. విపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ వైపు చూడకుండా ఉండేలా చట్టం చేసుకున్నారు. వ్యవస్థల్ని పకడ్బందీగా రూపొందించకపోతే.. తాత్కలిక లాభాలే అలా రూపొందించేవారికి వస్తాయి. తర్వాత వారే బాధితులవుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…