స్టార్ క్యాంపైనర్ – Chandrababu New Strategy For Elections

By KTV Telugu On 25 March, 2024
image

KTV TELUGU :-

ప్రధాని మోదీ వ్యూహాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు పాటిస్తున్నారు. వాళ్లు కాదు, వీళ్లు కాదు..  పార్టీ అధినేతే ఎన్నికల ప్రచారానికి మూల పరుషుడు అన్న సందేశం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో విభేదాలు, సీట్ల పంచాయతీలో అలకలు పెరిగిపోయిన వేళ.. తానే, తాను మాత్రమే  స్టార్ క్యాంపైనర్ అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు.  ఈ క్రమంలో నౌ ఆర్ నెవ్వర్ అన్న తీరుతో ఆయన ప్రచార శైలి ఉండబోతోంది….

అన్ని విషయాలు  మరిచిపోండీ.. మోదీని చూసి ఓటెయ్యండి. ఈ మధ్యకాలంలో  బీజేపీ చేస్తున్న ప్రచారమిది. ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ఎన్నికల్లో ఈ ఫార్ములా బాగా పనిచేసింది. బీజేపీ ఘనవిజయం సాధించి ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఇతర పార్టీలను భూస్థాపితం చేసే స్థితికి ఎదిగింది. ఎక్కడికి  వెళ్లినా మోదీ, మోదీ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. మోదీ రోడ్ షోలకు ఇసుకెస్తే రాలనంతగా జనం వచ్చేస్తున్నారు. అక్కడ అభ్యర్థి ఎవరో చూడటం లేదు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం కోసం ఓటు వేస్తున్నామన్న ఫీలింగ్ జనంలోకి బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అదే ఫార్ములాకు తెరతీశారు. చంద్రబాబును చూసి ఓటెయ్యాలన్న చర్చకు  శ్రీకారం చుట్టబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తవుతున్న  వేళ ప్రచారపర్వంలోకి స్పీడుగా దిగుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యూహం అమలుకు అంతరంగికులతో చర్చిస్తున్నట్లు సమాచారం.ఇంతకాలం చెబుతున్నది అదే కదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం  పొరపాటే. అనుకున్న వ్యూహాన్ని అమలు చేయడంలో కొంత  తేడా ఉంది…

నిజానికి చంద్రబాబు చేసిన అభివృద్ధిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ నుంచి అమరావతి ప్లానింగ్  వరకు వివరిస్తూ.. ఆయనకు ఓటెయ్యాలని అడుగుతుంటారు. ఆ మాటలకు..ఇప్పుడు అమలు చేయబోయే వ్యూహానికి కొంత తేడా ఉంది. అదీ రూరల్, అర్బన్ ను ఒకటి చేసి చూసే వ్యూహం. క్షేత్రస్థాయిలో అభ్యర్థులను పక్కన పెట్టి  ప్రచారం మొత్తం  చంద్రబాబు చుట్టూ  తిప్పే వ్యూహమే ఇది….

మూడు పార్టీల ముచ్చటైన పొత్తుకు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. సీట్ల పంపిణీలో సమస్యలను పరిష్కరించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్  రెడ్డికి సర్వేపల్లిలో టికెట్ ఇవ్వాల్సిన అనివార్యతలో ఆయన పడిపోయారు. అలా ఓడినవారు చాలా మందికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. పలాసలో గౌతు శిరీషను నిలబెడుతున్నారు.  కొంతమంది చంద్రబాబుపై వత్తిడి తెచ్చి  మరీ టికెట్లు తీసేసుకున్నారు. పొత్తు ధర్మం కోసం కొన్ని టికెట్లు అనివార్యంగా ఇచ్చెయ్యాల్సి వచ్చింది. తెనాలిలో ఆలపాటి రాజాను పక్కనపెట్టి… జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను నిలబెడుతున్నారు. అలిగిన  ఆలపాటి రాజాను బుజ్జగించేందుకు నానా తంటాలు  పడుతున్నారు. గురజాలలో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వలేకపోవడంతో ఆయన్ను ఎలా బుజ్జగించాలో అర్థం కావడం లేదు. ఎంపీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే సెగ్మెంట్ల నెగిటివ్ ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీకి, జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఎవరు ఎన్ని గెలుస్తారో అంచనాకు రాలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన,  బీజేపీ అభ్యర్థుల మధ్య కొట్లాటలు తారా స్థాయికి  చేరే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకుంటూనే క్షేత్రస్థాయి సమస్యలు ఓటర్ల మదిలో నాటుకుపోకుండా, వాటిని పరిష్కరిస్తూ టైమ్ వేస్ట్  చేసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు  వేస్తున్న ఎత్తుగడే స్టార్ క్యాంపైనర్. ఇకమీదట టీడీపీ వ్యూహకర్తలంతా ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయబోతోన్నారు. అక్కడక్కడా అభ్యర్థుల ప్రస్తావన తెస్తూనే చంద్రబాబు విజయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. సీఎం జగన్ సృష్టించిన వినాశనం నుంచి రాష్ట్రాన్ని కాపాడే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని  చెప్పుకుంటూ పోతారు. ఆయనకు పూర్తి  ఎలివేషన్ ఇచ్చేందుకు వంద శాతం ప్రయత్నిస్తారు. ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ బయటపడకుండా అంతా పాజిటివ్ గా చూపించేందుకు ప్రయత్నిస్తారు..

ఎన్నికలంటే ఇద్దరు నాయకుల మధ్య  పోటీ అన్నట్లుగా ఉండొచ్చు. టీడీపీ  వ్యూహంలోంచి  ఇప్పుడా ఆలోచనను తుడిచెయ్యాలనుకుంటున్నారు. జగన్ అసలు చంద్రబాబుకు పోటీనే కాదన్నట్లుగా వ్యవహరించబోతున్నారు. ఏపీలో ఉన్నదీ ఒక్క నాయకుడే అదీ చంద్రబాబానేనని జనంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది.  అప్పుడే జనంలో ఇమేజ్ మరింతగా పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఏపీలో  ప్రతీ  నోట  చంద్రబాబు పేరు  మాత్రమే వినిపించాలన్నది ఈ వ్యూహంలో భాగమే….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి