అంబటి రాయుడు రీఎంట్రీ ? – Is He Batting Again

By KTV Telugu On 29 March, 2024
image

KTV TELUGU :-

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. వివాదాస్పద వ్యాఖ్యలను, తరచూ వైఖరి మారడానికి పెట్టింది పేరు. రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయిన రాయుడు .. మళ్లీ వచ్చేందుకు సిద్ధపడుతున్నారన్న చర్చ జరుగుతోంది. దానికి రాయుడు ఇచ్చిన హింటే కారణం కావచ్చు…

అంబటి రాయుడు క్రికెట్ లో పిస్తా అనడానికి సందేహించకూడదు. మైదానంలో భారీ షాట్స్ కొట్టే రాయుడు… రాజకీయాల్లో మాత్రం బౌండరీదాకా చేరుకోలేకపోతున్నారు. ప్రతీ సారి ఏదో మాట్లాడేయడం, మళ్లీ వెనక్కి తగ్గడం ఆయన టూ మైండ్స్ వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. ఐపీఎల్ థ్రిల్లర్ గా సాగే అంబటి రాయుడు రాజకీయ జీవితం మళ్లీ మొదటికి వస్తుందన్న చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు.. పది రోజులకే టాటా చెప్పారు. రాజకీయాలు తనకు పడవన్నట్లుగా ట్వీట్ చేశారు. అలాగని వదిలేశారా అంటే అదీ లేదు. సడన్ గా పవన్ కల్యాణ్ ముందు ప్రత్యక్షమై ఫోటోలకు ఫోజులిచ్చారు. మళ్లీ అదే సీన్.. కట్ చేస్తే రాజకీయాలు లేవు, ఏమీ లేవు అని వివరణ ఇచ్చేశారు. మూడు నాలుగు నెలల తర్వాత అంబటి రాయుడు మళ్లీ ఒక స్టేట్ మెంట్ వదిలారు. ఆ ఒక్క మాట ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది….

అంబటి ఇప్పుడు సిద్దం అంటున్నారు. అలా ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది. ఆ మాట జగన్ రెడ్డి పేటెంట్ కదా.. ఈయన ఎందుకు వాడుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాయుడికి మళ్లీ ఆశ పుట్టిందన్న అనుమానాలు కలుగుతున్నాయి… సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైన రోజే అంబటి రాయుడు సింగిల్ వర్డ్ ట్వీట్ చేశారు. సిద్ధం అంటూ ఒక సందేశం ఇచ్చారు.దీనితో స్పెక్యులేషన్ కు అవకాశం ఇచ్చారు. తాను తిరిగి వైసీపీలో చేరాలనుకుంటున్నట్లు సంకేతమిచ్చారు. నిజానికి రాజకీయాల్లో ఉండాలన్న కోరిక రాయుడిలో మెదులుతున్నట్లు సన్నిహితులు అంటున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి చేయి కాల్చుకునేందుకు ఇష్టం లేకే ఆయన పది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారని చెబుతున్నారు. రిస్క్ లేని పార్టీ పదువులు, అధికార ప్రతినిధి హోదాలు లాంటివి ఇస్తే తీసుకునేందుకు ఆయన ఇష్టపడుతున్నట్లు సమాచారం. అవకాశం వచ్చినప్పుడు రాజ్యసభ టికెట్ ఇచ్చినా ఫర్యాలేదని భావిస్తున్నారు. రాష్ట్రంలో చాలా పార్టీలున్నా..తనకు వైసీపీ మాత్రమే ఇష్టమని కూడా రాయుడు చెప్పుకున్నట్లు కొందరు సన్నిహితుల వాదన.

రాయుడి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. నేను మళ్లీ వస్తానని వైసీపీ దగ్గర బేరం మాట్లాడలేరు. వాళ్లే పిలిస్తే బావుంటుందని ఎదురుచూస్తారు. పోయిన వాళ్లను మళ్లీ పిలవాలంటే ఏదో ప్రయోజనం ఉండాలని వైసీపీ భావిస్తుంది. మరి ఇద్దరి మధ్య రాజీ కుదిరేది ఎలాగన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి