ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా రాజకీయ వ్యూహం అమలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోలేదు కానీ. ప్రభావవంతమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది. కొత్త ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యూహాత్మకంగా ఇందు కోసం అడుగులు వేస్తున్నారు. దళిత, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేల ముందుకు వెళ్తున్నారు. టిక్కెట్లు దక్కని వైసీపీ దళిత ఎమ్మెల్యేలను.. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. ముఖ్యంగా దళిత వర్గాల్లో అంతో ఇంతో పలుకబడి ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. వారితో ఎన్నికల్లో పోటీ చేయించబోతున్నారు. ఇదంతా జగన్ ను ఓడించడానికే. మరి జగన్ ను ఓడిస్తే కాంగ్రెస్‌కు ఏం వస్తుంది ?
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీలో కాంగ్రెస్ పదవి దక్కించుకున్నారు వైఎస్ షర్మిల. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అన్న వైఎస్ జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు. కే ఉత్తరాంధ్రను చుట్టేశారు. రాయలసీమలో పర్యటించారు. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు కాదని అనుకోవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో వీలైనంత వరకూ బలమైన అభ్యర్థులను దింపి.. కనీసం నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఇది కాదు ప్రశ్న. ఎన్ని ఓట్లను చీలుస్తుంది? ఇదీ అసలు ప్రశ్న. ఎందుకంటే షర్మిల వచ్చిన టైమింగ్. ప్రచారశైలి చూస్తుంటే కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చే అవకాశాలు లేవు. కానీ చాలా ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్‌లో చేరారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా.. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ కూడా.. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే MS బాబు కూడా ఇప్పటికే షర్మిలతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. చూస్తుంటే వైసీపీకి గట్టిపట్టున్న ఎస్సీ నియోజకవర్గాల్లో మకాం వేయాలని చూస్తున్నారు షర్మిల. నిజానికి దశాబ్ధాలుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉన్నాయి. అయితే వైసీపీ ఎంట్రీతో ఆ ఓట్లన్ని వైసీపీకి మళ్లాయి. ఇప్పుడు మళ్లీ వాటిని తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు షర్మిల. వైఎస్‌ఆర్ కూతురుగా ఉన్న చరిష్మా, ఎస్సీల్లో పెరుగుతున్న మద్దతు, క్రిస్టియన్ ఓటర్లను మచ్చిక చేసుకోవడం షర్మిల వ్యూహంగా ఉంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ క్రిస్టియన్ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు చర్చిలతో దగ్గర సంబంధాల ఉంటాయి. వారిలో కొంత మందిని అయినా మార్పించి కాంగ్రెస్ కు ఓట్లు వేసేలా చేస్తే.. రాజకీయం చాలా వరకూ మారిపోతుంది.
వైసీపీలో ఉన్నది చాలా మంది పూర్వపు కాంగ్రెస్ నేతలే.. ఇప్పుడు వారందరినీ టచ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వైసీపీలోనూ షర్మిల అభిమానులు ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు వీరి డెస్టినేషన్ కాంగ్రెస్. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే షర్మిల ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా అనౌన్స్ చేయలేదు. అసలు అభ్యర్థులు ఉన్నారా? లేరా? అన్నది కూడా డౌటే. కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేసేస్తున్నారు షర్మిల. ప్రస్తుతం చూస్తుంటే తాను నెగ్గడం కంటే.. అన్నను కూల్చడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది షర్మిల. మరి షర్మిల చీల్చేది ఎవరి ఓట్లను? షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అంటే ముమ్మాటికి వైసీపీకే నష్టమని చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఎస్సీ, క్రిస్టియన్ ఓట్లలో వైసీపీకే మెజార్టీగా పడతాయి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు.. వైసీపీకి ఆయువుపట్టైన ఎస్సీ ఓట్లనే టార్గెట్ చేశారు షర్మిల. ఎస్సీ సామాజికవర్గ నేతలను టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పేందుకు.. భర్త అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కనుక షర్మిల సక్సెస్ అయితే వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
ఇదైతే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి కలిసొచ్చేదే అనుకోవచ్చు. ఇవన్నీ జరిగితే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థఇతులు ఎదురవుతాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో కొన్ని వర్గాలు ఏకం అయ్యాయి. ఇక షర్మిల ఎస్సీలపై కాన్సన్‌ట్రేట్ చేస్తే వైసీపీ ఓట్లు చీలిపోతాయి. అంటే టీడీపీ వైపు ఓట్లు కలిసిపోతే.. వైసీపీ వైపు చీలిపోతాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ కన్నా.. షర్మిల అనే పేరే ఎక్కువగా ఆ పార్టీక బలం అని అనుకోవచ్చు. పరిస్థితి చూస్తూంటే షర్మిల రాజకీయ అడుగులు అంత సింపుల్‌గా లేవని వ్యూహాత్మకంగానే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. జగన్ ఓడిపోతే.. వైసీపీ బలహీనపడుతుంది. కేసులు పరిష్కారమైతే జగన్ జైలుకు వెళ్తారు. అప్పుడు కాంగ్రెస్సే దళిత, మైనార్టీ ఓటర్లకు ఆప్షన్ అవుతుందన్నది అంచనా. ఆ ప్లాన్ ప్రకారమే షర్మిల రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…