ఒక నియోజకవర్గం టికెట్ కు ఆశావహులు చాలా మందే ఉంటారు. వారిలో ఒకరికి మాత్రమే టికెట్ వస్తుంది.అంతమందిని కాదని టికెట్ ఆ ఒక్కరికే ఎలా వచ్చిందన్నది చర్చనీయాంశమవుతుంది. అందులో ఏదో మతలబు ఉందని విశ్లేషణలు మొదలవుతాయి. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్ సుజనా చౌదరికి దక్కడం వెనుక ఉన్న ఫ్యాక్టర్స్ ఏమిటన్న టాక్ మొదలైంది. అదీ టీడీపీకి బలమున్న చోట బీజేపీ అభ్యర్థికి టికెట్ వదులుకోవడంపైనా ఇప్పుడు ఒక రకమైన రచ్చ తప్పడం లేదు…
విజయవాడ ఆంధ్రప్రదేశ్ కు భౌగోళిక రాజధానే కాకుండా సాంస్కృతిక, రాజకీయ రాజధాని కూడా అని చెప్పాలి. విజయవాడలో ఏం జరుగుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం వినిపిస్తూనే ఉంది. విజయవాడ లోక్ సభతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలు వేర్వేరు పార్టీలకు కీలకమే అవుతాయి. ప్రతీ పార్టీలోనూ పది మంది ఆశావహులు నిత్యం లాబీయింగ్ చేస్తుంటారు. అదే తీరులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కోసం టీడీపీలో ఇద్దరు హేమాహేమీలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అయితే విజయవాడ నాదిరా అని చాలా రోజులుగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టవల్ వేసుకు కూర్చున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీకి అక్కడ నుంచి టీడీపీకి మారినప్పటికీ పదేళ్లుగా చంద్రబాబుకు లాయల్ సోల్టర్ గా ఉన్నారు. పైగా విజయవాడ ప్రాంతంలో నారా లోకేష్ పాదయాత్ర అరేంజ్ మెంట్ మొత్తం ఆయనే చూసుకున్నారు. మరోకరు జనసేన నాయకుడు పోతిన మహేష్. పవన్ కల్యాణ్ తప్పకుండా తనకు టికెట్ ఇస్తారని తాను గెలుస్తానని పోతిన మహేష్ చాలా కాలంగా గాలిమేడలు కట్టుకున్నారు. చివరకు ఎన్డీయే కూటమిలో భాగంగా విజయవాడ వె స్ట్ బీజేపీకి కేటాయించడం, అక్కడ సుజనా చౌదరి బరిలోకి దిగడంతో జలీల్ ఖాన్, పోతిన మహేష్ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
విజయవాడ వెస్ట్ లాంటి కీలక నియోజకవర్గాన్ని బీజేపీకి ఎందుకు వదిలేశారు.ఈజీగా గెలిచే నియోజకవర్గాన్ని వదులుకునేందుకు చంద్రబాబు అంత తెలివితక్కువ వారా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. సుజనాకు టికెట్ ఇస్తామని బీజేపీ నుంచి హామీ వచ్చిన తర్వాతే వెస్ట్ ను బీజేపీకి కేటాయించారని కూడా కమలం పార్టీ నేతలు పబ్లిగ్గా చెబుతున్న మాట….
సుజనా చౌదరి మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. టీడీపీలో చాలా కాలం ఉన్నారు. విద్యాధికుడే కాకుండా ఆర్థిక వనరులున్న పారిశ్రామికవెత్త కూడా .అవసరమైనప్పుడల్లా ఆయన టీడీపీకి ఫైనాన్స్ చేసేవారని పేరు ఉంది. అందుకే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాకుండా కేంద్రంలోని మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిపదవి కూడా ఇప్పించారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగినప్పుడు మంత్రిపదవి నుంచి రాజీనామా చేసిన సుజనా చాలా కాలం మౌనం వహించారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా కూడా ఉన్నారు. చంద్రబాబే తెలివిగా ఆయన్ను బీజేపీకి పంపారని వాదించే వాళ్లూ ఉన్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ సామాజికవర్గం పరంగా టీడీపీకి లాయల్ గా ఉంటారన్న పేరు సుజనాకు ఉంది. ఇప్పుడు ఆయనకు బీజేపీకి టికెట్ ఇచ్చే విషయంలోనూ కమలం పార్టీని చంద్రబాబు ఒప్పించారని చెబుతారు. అందుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా కారణం కావచ్చు. సుజనా విజయవాడ లోక్ సభ టికెట్ ఆశించారు. అప్పటికే చంద్రబాబు దాన్ని కేశినేని చిన్నికి ప్రామిస్ చేశారు. మార్చితే ఇబ్బంది అవుతుందనుకున్నారు. అందుకే సుజనాకు కమ్మ సామాజిక వర్గం కీలకంగా ఉండే విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించారు. పోతిన మహేష్ లాంటి వారు అలిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని, కొన్ని రోజులకే అది సర్దుకుంటుందని చంద్రబాబు నమ్మకం.
సుజనా ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. ఖర్చుకు వెనుకాడరు. పైగా ఆయన కోసం ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి నాయకుడికి టికెట్ కాదనడం కరెక్టు కాదని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. ఖచితంగా గెలుస్తారన్న విశ్వాసంతో టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సుజనాకు మంత్రి పదవి హామీ కూడా లభించిందని అంటారు.బీజేపీ కోటాలో మంత్రిపదవి ఆయనకు ఇచ్చినట్లవుతుందన్నది ఒక లెక్క. చూడాలి మరి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…