బీఆర్ఎస్‌ను, కేసీఆర్ ను ప్రజలే కాపాడుకుంటారని కేటీఆర్ భారీ ప్రకటన చేశారు. దీనికి కారణం వలసలు పెరిగిపోవడం… అభ్యర్థిత్వాలు వచ్చిన వారు కూడా కాడి వదిలేసి వెళ్లిపోతూండటం. నిజంగానే బీఆర్ఎస్ ను ప్రజలు కాపాడుకుంటారా ?. కేటీఆర్,కేసీఆర్ ఇక ఏమీ చేయరా.. చేయలేరా ?. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది..? ఆ ప్రజల్ని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ?
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ది. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు. కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు…. ఈ ధైర్యం కేటీఆర్‌ది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ ధీమా ఇది. నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎప్పట్లాగే ఫామ్‌హౌస్‌లో రిలాక్స్ అవుతున్నారు. మరి కేటీఆర్ ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటూంటే.. ప్రజలే పార్టీని కాపాడుకుంటారా ?. మా పార్టీ అన్న భావనను ప్రజల దగ్గర నుంచి లాగేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని గుర్తించలేదా ?
అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ కు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎంతగా అంటే మీకు ఇక రాజకీయ భవిష్యత్ లేదు… మీ పార్టీలో ఉండలేను అని మొహం మీద చెప్పెసి వెళ్తున్నారు సీనియర్ లీడర్లు. పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తే… బాపూ అంటూ ఆనందభాష్పాలు కార్చి వెళ్లిన వాళ్లు .. .మీరు చాలా తప్పులు చేశారు జనాదరణ లేదు.. మీ పార్టీకో దండం అని నిందలు వేస్తూ లేఖలు రాస్తున్నారు. పార్టీకి భవిష్యత్ లేదని తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లో చేరుతున్నానని కేకే ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ మొహం మీదనే చెప్పేసి వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికి కడియం శ్రీహరి కూతురు వరంగల్ కు తనకు ఇచ్చిన టిక్కెట్ అక్కర్లేదని లేఖ రాశారు. కడియం, ఆయన కూతురు కాంగ్రెస్ లో చేరిపోనున్నారు. వీరే ప్రారంభం కాదు.. అంతం కాదు. గత రెండు నెలలు పోయే వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలేదు. గేట్లు తెరిచినట్లుగా రేవంత్ ప్రకటించిన తర్వాత ఆపడం ఎవరి తరం కావడం లేదు.
నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకునేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా ఎందుకూ పనికి రాదని వదిలేసిపోతున్నారు. లోక్ సభ అభ్యర్థుల్లో పదమూడు మంది కొత్త వాళ్లను పెట్టారు. వారిలో ఏ విధంగా చూసినా ఎంపీ స్థాయి నేతలు ఎవరూ లేరు. అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు. వారికి ఇతర చోట్ల ఆఫర్ లేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే వారు కూడా ఉండేవారు కాదు. కేసీఆర్ అంటే చాణక్యుడు… ఇంట్లో కూర్చుని మాటలతోనే రాజకీయం మార్చేస్తారని భావిస్తారు. కానీ ఆయన చాణక్యం అంతా ఇప్పుడు ఎటు పోయిందో కానీ.. పార్టీ నేతల్ని నిలుపుకోలేకపోతున్నారు. టిక్కెట్లు ఇచ్చిన వారూ ఉండలేకపోయారు. అధికారం ఉన్నప్పుడు ఆయన కరుణాకటాక్షల కోసం తిరిగిన నేతలు.. ఇప్పుడు ఆయన ఓ లీడరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతలకు ఇంత ధైర్యం రావడానికి కారణం ఎవరు .. ఖచ్చితంగా ప్రజలే . ప్రజలు ఓడించారు. ఇక ముందు ఆదరిస్తారన్న నమ్మకం కలగనీడయం లేదు. అందుకే నేతలు వెళ్లిపోతున్నారు
కానీ కేటీఆర్ మాత్రం తమ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆయన ఆలోచించడం లేదు. అసలు ప్రజలు ఎందుకు కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితినా ? . టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చిన ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమయింది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్థానం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిపోయింది. ఇప్పుడు ప్రజలు భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది ?. పదవి కాలం పదేళ్లలో ప్రజల వద్దకు రాని .. ప్రజల్ని కలవని కేసీఆర్ ను కాపాడుకునేందుకు ప్రజలు రోడ్డెక్కాలని ఎలా ఆశిస్తారు ?
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…