ఏపీలో పాలక వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమంటూ తెలుగుదేశం-బిజెపి-జనసేనలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల పొత్తు ఖరారు అయ్యాక చిలకలూరిపేటలో మూడు పార్టీల నేతలు కలిసి బహిరంగ సభ పెట్టారు. అయితే ఆ తర్వాత అభ్యర్ధుల జాబితా విడుదలపై కసరత్తులు చేశారు. అన్నీ పూర్తి చేసుకుని ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతారని అన్నారు. టిడిపి తన చివరి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ఇక మూడు రాజకీయ పార్టీలూ ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నాయి. అయితే మూడు పార్టీల నేతలు ఎవరి ప్రచారం వారిదే అన్నట్లు షెడ్యూలు రూపొందించుకున్నట్లు కనపడుతోంది.
మార్చ్ 27న చంద్రబాబు నాయుడు రాయలసీమలోని తన సొంత జిల్లా చిత్తూరులో ప్రజాగళం ఆరంభించారు. ఆయన కేవలం టిడిపి అభ్యర్ధులు పోటీ చేసే నియోజక వర్గాల పరిధిలోనే ప్రజాగళం యాత్రకు షెడ్యూలు రూపొందించుకున్నారని అంటున్నారు. జనసేన, బిజెపి అభ్యర్ధుల నియోజక వర్గాల్లో చంద్రబాబు కార్యక్రమాలేవీ ఇంతవరకు అయితే నిర్ణయించలేదు. ఎన్నికల వరకు ఇదే కొనసాగుతుందా లేక రానున్న రోజుల్లో ఆయన మిత్ర పక్షాల నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరికి వారు తమ తమ అభ్యర్ధుల స్థానాల్లోనే పోటీ చేస్తే ఎలాగ అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మార్చ్ 30న వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజక వర్గం నుంచే ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు కూడా తన ప్రజాగళాన్ని తన సొంత నియోజక వర్గం కుప్పంనుంచే ప్రారంభించడం గమనార్హం. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర కొనసాగినంత కాలం ఆయన జనసేన అభ్యర్ధులు బరిలో ఉన్న నియోజక వర్గాల్లోనే పర్యటించనున్నారు. తమ అభ్యర్ధుల విజయం కోసమే ఆయన ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 12 తర్వాత ఆయన టిడిపి,బిజెపి అభ్యర్ధుల స్థానాల్లో ప్రచారం చేస్తారేమో ఇప్పటికైతే తెలీదు. అప్పటి వరకు మాత్రం టిడిపి,బిజెపిలతో సంబంధం లేకుండానే ఆయన వారాహి యాత్ర సాగనుంది.
కూటమిలో మూడో పక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా తమ అభ్యర్ధుల నియోజక వర్గాలపైనే ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. బిజెపి ఆరు లోక్ సభ స్థానాల్లోనూ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. అయితే ఫోకస్ మాత్రం లోక్ సభ నియోజక వర్గాలపైనే ఉంటుందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా బిజెపి అభ్యర్ధులు పోటీ చేసే ఆరు లోక్ సభ నియోజక వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే పేరుకు పొత్తు పెట్టుకున్నా ఎవరి దారి వారిదే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు.
టిడిపి-జనసేన-బిజెపిలు కలిసి ఒకే వేదిక ఎక్కిన చిలకలూరి పేట సభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో బిజెపికి 400 ఎంపీ సీట్లు తగ్గకూడదని అన్నారే తప్ప ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఎక్కువ ప్రచారం చేయలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని పెకలించి వేయాలని ఒక్కసారి వ్యాఖ్యానించినా జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలూ సంధించలేదు. అంటే బిజెపి ఫోకస్ కేవలం ఎంపీ నియోజక వర్గాలపైనే అన్నది స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇలా మూడు పార్టీలూ తమ తమ అభ్యర్ధుల నియోజక వర్గాల్లోనే ప్రచారం చేసుకుంటే ఇక పొత్తు పెట్టుకుని ఏం లాభం అంటున్నారు రాజకీయ పండితులు. జనసేన అభిమానులు టిడిపికి ఓటు వేయాలంటే టిడిపి అభ్యర్ధుల నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసి తన అభిమానులకు వ్యక్తిగతంగా పిలుపు నిస్తేనే పని అవుతుంది. అలాగే టిడిపికి పట్టుఉండి జనసేనకు కేటాయించిన సీట్లలో చంద్రబాబు ప్రచారం చేయకపోతే టిడిపి సానుభూతి పరుల ఓట్లు జనసేనకు కానీ బిజెపికి కానీ బదలా కావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఈ విషయంపై మూడు పార్టీల నాయకత్వాలూ దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…