తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. వలస నేతలకు గేట్లు తెరిచిపెట్టడానికి కారణం ఏమిటి. కేకే కుటుంబం, కడియం ఫ్యామిలీ అంత పెద్ద పిస్తాలా.. వాళ్లు గేమ్ ఛేంజర్స్ అవుతారా. వాళ్లవల్ల హస్తం పార్టీకి వీసమెత్తు ప్రయోజనముందా. లోక్ సభ ఎన్నికల్లో వాళ్లే పార్టీని గెలిపిస్తారా.. మరి ఇప్పటి వరకూ ఉన్న నాయకుల పరిస్థితేమిటి.. రేవంత్ రెడ్డికి వాళ్లిద్దరూ అవకాశం వాదులుగా కనిపించడం లేదా……
రాష్ట్రంలో అన్ని దారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపుకే వెళ్తున్నాయి. నిద్రలేవగానే నలుగురు నేతలు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జై ఖర్గే,జై సోనియా అనకపోయినా జై రేవంత్ రెడ్డి అని అంటున్నారు. వచ్చిన వారు సిట్టింగు ఎంపీలైతే కాంగ్రెస్ లో వారికి ఎంపీ టికెట్ ఖరారైపోతోంది. చేవెళ్ల రంజిత్ రెడ్డి సంఘటనే అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా ఉన్న కే.కేశవరావు అలియాస్ కేకే, ఆయన కుమార్తె అయిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేకే రైట్ హ్యాండ్ గా ఉంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా నేత కడియం శ్రీహరి దాదాపుగా లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నారు. అలాంటి నాయకుడు తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు. కావ్యకు బీఆర్ఎస్ లో వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించారు. ఐనా ఓడిపోతామన్న భయంతో తండ్రీ, కూతురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి కేకే, కడియం ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పిస్తాలేమీ కాదు. కేకే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ గెలిచింది లేదు. కడియం టీడీపీ హయాంలో గెలిచి మంత్రి అయినప్పటికీ తర్వాత ఓడిపోయారు. అలాంటి నేతను పిలిచి మరీ కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన కోసం స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలో తాడికొండ రాజయ్యను పక్కన పెట్టారు. చివరకు 2019లో రాజయ్యకు కాకుండా కడియానికి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు.ఐనా ప్రభుత్వం మారగానే కడియం పలాయనమంత్రం పఠించారు. అదే మరీ రాజకీయం అని అనుకోవాలా…
కేకే, కడియం సాధించిదేమిటి. ఇతరులు చేయలేకపోయిందేమిటి. కాంగ్రెస్ లో కేకే ఫ్యామిలీ ఎలా ప్రూవ్ చేసుకోగలదు.. వరంగల్ ప్రాంతంలో కడియం కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా ఉంటుందా.వాళ్లు ఎవరిని మేనేజ్ చేయగలరు….
కూతురు గద్వాల విజయలక్ష్మీ మేయర్ అయ్యారంటే అది కేకే వల్లే సాధ్యపడింది. 150 మంది కార్పొరేటర్లు ఉంటే జీహెచ్ఎంసీలో విజయలక్ష్మీనే ఎంచుకున్నారంటే కేకే పట్ల కేసీఆర్ కు ఉన్న అభిమానమే తప్ప ఆమె సమర్థత కాదని ఎవరిని అడిగినా చెబుతున్నారు. పైగా ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేకే వల్ల ఇన్ని సీట్లు గెలిచామని చెప్పుకున్న దాఖలాలు లేవు. ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసినప్పటికీ ప్రజా నాయకుడిగా ఎప్పుడూ ప్రూవ్ చేసుకోలేదు. ఏసీ గదులకు పరిమితం కావడం మినహా కేకే..క్షేత్రస్థాయిలోకి వెళ్లడం మానేసి చాలా రోజులైంది. విజయలక్ష్మికి కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఆమె వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని చెప్పలేము. హైదరాబాద్ ఎప్పుడూ ఎంఐఎం కంచుకోటే. సికింద్రాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడించాలంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ కంటే ఓట్ల విభజనే ముఖ్యం. రేవంత్ ఆ దిశగా ఆలోచిస్తే సరిపోయేది. ఇక కడియం శ్రీహరి కేవలం కూతురు కావ్య రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ లో ఆమెకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోసం ఆయన చాలా సార్లు పోరాడారు. చివరకు కేసీఆర్ ఆమెకు వరంగల్ టికెట్ కేటాయించారు. ఇప్పుడు రాజకీయాలు మారుతున్నందున ఆయన నిర్ణయం కరెక్టేనని చెప్పాలి. కాకపోతే వరంగల్ టికెట్ ఆమెకు ఇస్తారన్నది పాజిటివ్ వైబ్రేషన్. అక్కడ బీజేపీ బలపడిందన్నది కాంగ్రెస్ కు నెగిటివ్ వైబ్రేషన్. వరంగల్ ఈ సారి టఫ్ ఫైట్ కావడం ఖాయం. యూత్ ను ప్రోత్సహించే దిశగా కావ్యను చేర్చుకున్నారన్న వాదనలోనూ పసలేదు. ఎందుకంటే ఇప్పటికే బాల్మూరి వెంకట్ లాంటి యువనేతలకు టికెట్లిచ్చి ..కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహిస్తుందని నిరూపించారు. ఇంత చరిత్ర ఉంటే వాళ్లను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు చేర్చుకున్నారని కొందరు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. రేవంత్ అంత తెలివి తక్కువగా చేర్చుకుంటున్నారనుకోవడానికి వీల్లేదు. రేవంత్ ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. పార్టీలో రేవంత్ కొత్త వాడు కావడంతో పాతకాపులు ఆయన్ను వ్యతిరేకించే అవకాశం ఉంది. కీలక సమయంలో తిరుగుబాటు చేసే ఛాన్సుంది. అప్పుడు తన బలం నిరూపించుకోవడానికి కొత్తవారి మద్దతు ఆయన పొందుతారు. రేవంత్ చేర్చుకున్నందున వాళ్లు ఆయనకు లాయల్ గా ఉంటారు. జై రేవంత్ అని నినదిస్తారు.. కేకే, కడియం ఫ్యామిలీస్ వల్ల అసలు ప్రయోజనం లేదని చెప్పడం కూడా తప్పే అవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీస్ అవి. వాళ్లకు ఎత్తులు ఎలా వేయాలో తెలుసు. పైఎత్తులను ఎలా అడ్డుకోవాలో తెలుసు. మందీ మార్బలాన్ని ఎలా పోగెయ్యాలో తెలుసు.దూకుడు తెలుసు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తెలుసు. వెరసి ఏదోక విధంగా వారి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది….
రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమ్ సీఎం. అలాగని ఆయన్ను అనుభవ హీనుడిగా చూడకూడదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎత్తులకు పైఎత్తులు వేసి మరీ ఆయన రాజకీయాల్లో ఇంతదూరం ప్రయాణించారు. ఎవరిని పార్టీలో చేర్చుకావాలి. ఎవరినీ ఇప్పుడు కాదులే అని ఆపాలో ఆయనకు ఒక్క లెక్క ఉంటుంది. ఐనా ప్రయోజనం ఉంటే కదా ఎవరినైనా పార్టీలో చేర్చుకునేది. ఊరికే కూర్చోబెట్టి పదవులు ఎందుకు ఇస్తారో చెప్పండి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…