కొందరు అలిగారు. కొందరు కంటతడి పెట్టారు. కొందరు భోరున ఏడ్చారు. కొందరు బెదిరిస్తున్నారు. కొందరు బేధోపాయాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారు. పచ్చ చొక్కాలకు కోపం వచ్చిన వేళ.. టీడీపీలో ప్రస్తుత పరిస్థితి ఇదీ.అసెంబ్లీ ఎన్నికలు నలభై రోజుల్లోకి వచ్చిన తరుణంలో తెలుగుదేశంలో అసమ్మతి రాగాలతో చెవులు పగిలిపోతున్నాయి. చంద్రబాబు ఒక పక్క మండుటెండలో గంటల కొద్దీ నిలబడి ప్రచారం చేస్తుంటే… క్షేత్రస్థాయిలో శ్రేణులు టికెట్ల పేచీలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇదీ ముమ్మాటికి పార్టీని ఇబ్బంది పెట్టే విషయమా కాదా అన్నదే పెద్ద ప్రశ్న…..
వైకుంఠం ప్రభాకర్ చౌదరి అలిగారు.అనంతపురం అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ పేరును ప్రకటించారు.దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్‌ను , టీడీపీ జెండాను, చంద్రబాబు ఫ్లెక్సీలను బయటకు తీసుకువచ్చి దహనం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎన్నడూ ఊహించలేదంటూ ప్రభాకర్ చౌదరి ఒక స్టేట్ మెంట్ పడేశారు. ఇదీ టీడీపీలో క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనంగా భావించాలి. తర్వాత బుజ్జగింపుల పర్వంతో ప్రభాకర్ చౌదరి మెత్తబడ్డారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో సరైన పద్ధతిని పాటించలేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. పొత్తుల పేర్లతో కొన్ని చోట్ల, సర్దుబాట్ల పేరుతో మరికొన్ని చోట్ల ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం లేకుండా చేశారని చర్చ జరుగుతోంది. ఏమిటీ పరిస్థితి అని ఆవేదన చెందేవారూ ఉన్నారు..మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారు అయితే రాజకీయాలకు దండం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరో సీనియర్ నేత కళా వెంకట్రావుకి ఎచ్చెర్ల సీటు అడిగితే ఇష్టం లేని చీపురుపల్లికి పంపారు. అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న నాగార్జునకు షాక్ ఇచ్చారు.దాంతో మీడియా ముందు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావద్దంటూ టీడీపీ సంకేతం ఇచ్చిందని ఆయన ఆగ్రహం చెందుతున్నారు..మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టికెట్ రాలేదు… పాతపట్నంలో రాజకీయ కుటుంబంగా ఉన్న కలమట ఫ్యామిలీ కూడా టీడీపీ మీద నిప్పులు చెరుగుతోంది.
పెనమలూరులో బోడే ప్రసాద్ కు తొలుత టికెట్ రాదనుకున్నారు. తర్వాత ఆయన చంద్రబాబునే మేనేజ్ చేసుకుని అనుకున్నదీ సాధించారు. ఇతరుల పరిస్థితి అలా లేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోతూ అధిష్టానంపై రగిలిపోతున్నారు.క్షేత్రస్థాయిలో వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తే ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్న….
విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఎన్నారై గొంప క్రిష్ణ తాను జనం అభిప్రాయం మేరకు నడచుకుంటాను అని రెబెల్ స్వరం వినిపించారు. మాడుగులలో మరో ఎన్నారైకి టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఫైర్ అవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో అరకు పాడేరు రెండు సీట్లలో టీడీపీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అరకులో సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుని బీజేపీకి ఇవ్వడంతో దన్ను దొర ఇండిపెండెంట్ గా ముందుకు వస్తున్నారు.పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అయితే తనకు టికెట్ ఇవ్వనందుకు గానూ టీడీపీ అభ్యర్ధిని ఓడించి తీరుతామని శపధం చేస్తున్నారు. కొందరికి టికెట్ లేకుండా ఇబ్బంది పెట్టి పార్టీ కకావికలమవుతుంటే… మరికొందరేమో చాకచక్యంగా చంద్రబాబును మేనేజ్ చేసుకుంటున్నారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు రాదనుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. తర్వాత చంద్రబాబును కలిసిన బోడే ప్రసాద్ ఏం చెప్పుకున్నారో ఏమో కానీ…. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. బోడే ప్రసాద్ వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వైసీపీ వాళ్లు ఆరోపణలు సంధించడం వేరే విషయం. అయితే బోడే ప్రసాద్ కారణంగా దేవినేని ఉమ టికెట్ చినిగిపోయిందని చెబుతున్నారు. మైలవరంలోకి వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీ ఇస్తే ఆయనకు టికెట్ ఖరారు చేసి… దేవినేని ఉమను పెనమలూరు పంపిద్దామనుకున్నారు. ఇప్పుడు ఆ పని కుదరకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానని హామీ పలికినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా చోట్ల టికెట్లు రాని వాళ్లు నిరసనకు దిగిన వీడియోలు టీవీ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఐనా సరే పరిస్థితి మారే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు.
పల్నాడు నేత, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ ఒకటి రెండు రోజుల్లో టీడీపీలో చేరనున్నారు. తొలుత ఆయన గురజాల ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ … నామినేషన్ ను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కేటాయించారు.మరి ఇప్పుడు జంగా ఎందుకు వస్తున్నారన్నదే పెద్ద ప్రశ్న. పార్టీ మారడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు చెబుతున్నారు.ఇక నుంచి పల్నాడు పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులు కనీసం 50 నియోజకవర్గాల్లో ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…