తెలంగాణాలో విలువలు లేని రాజకీయాలకు కాంగ్రెస్ తెర తీసింది. బి.ఆర్.ఎస్. పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు బి.ఆర్.ఎస్. తరపున రాజ్యసభలో అడుగు పెట్టని నేతను కూడా కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. దీని ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడించిందనే చెప్పాలి. ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తే..గతంలో కేసీయార్ కూడా ఇలానే చేశారు కాబట్టి ఇపుడు తాము చేస్తోన్న దాంట్లో తప్పు లేదన్నది కాంగ్రెస్ నేతల వాదన. సాంకేతికంగా అది కరెక్టే అనిపించినా నైతికంగా మాత్రం ఎవ్వరూ ఆమోదించలేని చర్య ఇది.
కడియం శ్రీహరికి బి.ఆర్.ఎస్. పార్టీ కీలక పదవులు ఇచ్చి గౌరవించింది. కె.కేశవరావుకు రెండు సార్లు రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాదు ఆయన కూతుర్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గానూ చేసింది.దానం నాగేందర్ ను రాజకీయంగా అందలం ఎక్కించింది. రంజిత్ రెడ్డిని ఎంపీని చేసింది. ఇటువంటి నేతలంతా ఇపుడు కాంగ్రెస్ లో చేరారు. కారు గుర్తుపై గెలిచిన వారు హస్తం గుర్తు పార్టీలో చేరాలంటే కారు గుర్తు ద్వారా తమకు వచ్చిన పదవులకు రాజీనామాలు చేసి ఉంటే వారి చేరికలను ఎవరూ తప్పు పట్టరు. కానీ వారు అలా చేయలేదు. ఇవి నీతిమాలిన రాజకీయాలే అంటున్నారు రాజకీయ పండితులు.
అయితే మనం నీతిగా ఉంటేనే ఎదుటి వారికి నీతులు చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో బి.ఆర్.ఎస్. కు పూర్తి మెజారిటీ దక్కినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బి.ఆర్.ఎస్. లో చేర్చుకోలేదా? అని కాంగ్రెస్ నిలదీస్తోంది. నిజమే అపుడు కేసీయార్ కూడా ఇపుడు కాంగ్రెస్ చేసిన తప్పే చేశారు.ఇది ఎవరు చేసినా తప్పే అంటున్నారు మేథావులు. 2014లోనూ కేసీయార్ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అటువంటి చరిత్ర ఉన్న బి.ఆర్.ఎస్. నాయకత్వం ఇపుడు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడ్డంలో అర్ధం లేదంటున్నారు హస్తం పార్టీ నేతలు
2014లోనే విభజిత ఏపికి జరిగిన ఎన్నికల తర్వాత ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపిలు జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి రాలేకపోయినా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. చంద్రబాబు నాయుడికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ ఉంది. ఎలాంటి అస్థిరత లేదు. అయినా చంద్రబాబు నాయుడు ఓ తప్పు చేసేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి బెదిరించి టిడిపిలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపు నిరోథక చట్టాన్ని ఉల్లంఘించారు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత తెలంగాణాలో తమ ఎమ్మెల్యేలను బి.ఆర్.ఎస్. పార్టీ చేర్చుకోవడంపై నిప్పులు చెరిగారు. ఓ పార్టీ తరపున గెలిచిన వారిని ఎలా తీసుకుంటారు? అని మండి పడ్డారు. కానీ తాను మాత్రం యథేచ్ఛగా గీత దాటేశారు.
చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు బి.ఆర్.ఎస్. వైఖరితో తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వం డీలా పడింది. చాలా ఇబ్బందులు పడింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇపుడు తన వంతు వచ్చింది అన్నట్లు బి.ఆర్.ఎస్. నేతలకు వల వేస్తోంది. అయితే ఒకప్పుడు ఇదే వలసలతో బాధపడ్డ కాంగ్రెస్ ఇపుడు తాను అదే తప్పు చేయడం క్షమించరాని నేరం అంటున్నార విశ్లేషకులు. కేసీయార్, చంద్రబాబు వంటి నేతలు కూడా వీటి నుండి పాఠాలు నేర్చుకోవాలంటున్నారు. తాజాగా కేసీయార్ తమ పార్టీలోని కుక్కల్ని, నక్కల్నీ కాంగ్రెస్ గుంజుకుంది అన్నారు. అదీ తప్పే. ఎందుకంటే ఇంతకాలం ఆ కుక్కల్నీ నక్కల్నీ తమ పార్టీలో ఎందుకు ఉంచుకున్నారో కేసీయార్ సమాధానం చెప్పాలంటున్నారు మేథావులు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…