బీజేపీ ని టచ్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి కి లేదా? – Revanth Reddy – Congress

By KTV Telugu On 3 April, 2024
image

KTV TELUGU :-

తాము గేట్లెత్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. నయానో.. భయానో  పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకుంటున్నారు. వారంతా బీఆర్ఎస్ నేతలే.   బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వెళ్లడం లేదు.  కనీసం ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. కానీ కోమటిరెడ్డి తెచ్చారు. అలా కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామన్న ప్రకటన చేసిన తర్వాత బీజేపీ వైపు నుంచి చాలా తీవ్రమైన స్పందన వచ్చింది.  వెంటనే..  కాంగ్రెస్‌లో అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే..  బీజేపీని టచ్ చేసే ధైర్యం రేవంత్ అండ్ కో కు లేనట్లేనా ? .  నిస్సహాయంగా ఉన్న  బీఆర్ఎస్‌పైనే  కత్తి దూస్తారా ?

కాంగ్రెస్‌లో చేరికలకు గేట్లేత్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుంటున్నారు. కానీ ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి ఒక్కర్నీ చేర్చుకోవడం లేదు.  ఆ ప్రయత్నాలుకూడా చేయడం లేదు. చేరుతామని వచ్చిన వారిని కూడా వద్దంటున్నారు.  సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ తరపున గెలిచారు., ఆయన రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. కానీ ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ సోషల్ మీడియా పేజీ కానీ..  కాంగ్రెస్ సానుభూతిపరులు కానీ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు వచ్చారని రాయలేదు. కానీ   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా భేటీ అయితే.. ఇంకేముంది చేరిపోయినట్లేనని ప్రచారం చేశారు.  ఎందుకీ తేడా చూపిస్తున్నారు. బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నించడం లేదు ?

తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ముఖ్యమైన పార్టీలు. అయితే వీటిల్లో అత్యంత బలహీనంగా ఉన్న పార్టీగా బీజేపీ అనే చెప్పుకోవాలి. కానీ బీజేపీని టచ్ చేసే ధైర్యం మాత్రం మిగిలిన రెండు పార్టీల్లో కనబడటం లేదు. ఓడిపోయిన తరవాత బీఆర్ఎస్‌కు అలాంటి ఆలోచనే ఉండదు.  ఎంఎల్ఏలను, సీనియర్ నేతలను లాక్కోవడానికి సీరియస్ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ జోలికి మాత్రం వెళ్ళటంలేదు. బీజేపీ నేతల్లో ఎవరైనా తమంతట తాముగా బయటకు వచ్చేసినా చేర్చుకునేందుకు ఆలోచిస్తున్నాయి.  టిక్కెట్ దక్కలేదని బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కానీ..  పోటీ చేసేందుకు టిక్కెట్ మాత్రం ఇవ్వడానికి ధైర్యం చేయలేకోయారు.

దీనికి కారణం ఏమిటంటే జాతీయస్ధాయిలో బీజేపీ చాలా బలంగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడిని చూసే బీజేపీ జోలికెళ్ళటానికి పై  కాంగ్రెస్ పార్టీ జంకుతోందని అనుకోవచ్చు.   ఇపుడున్న బీజేపీ ఒకప్పటి వాజ్ పేయి,  అద్వాని నాయకత్వంలోని పార్టీ కాదని అందరికీ తెలుసు. మోడీ, అమిత్ షా ధ్వయం దేశంలో ప్రతిపక్షాలన్నవి లేకుండా చేయాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. వీళ్ళదెబ్బకు కాంగ్రెస్ తో పాటు చాలా ప్రాంతీయపార్టీలు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో బీజేపీని టచ్ చేస్తే ఏమి జరుగుతుందో  రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ జోలికి వెళ్లలేదు.  అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి టీడీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టారు.  అలాగే ఇపుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్నారే కాని కమలంపార్టీ జోలికి వెళ్ళటంలేదు. ప్రతిపక్ష పార్టీల అధినేతలు, నేతల విషయంలో చిన్న అవకాశం దొరికినా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన ఈడీ, సీబీఐ, ఐటిలు వచ్చేస్తున్నాయి.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పీకల్లోతు ఇరుక్కుని తీహార్ జైల్లో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, అవకతవకల్లో కేసీయార్ పై ఆరోపణలున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ట్యాపింగ్ కు మూలకారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో  చీఫ్ ప్రభాకరరావు విచారణకు హాజరైతే సంచలనాలు ఖాయం. ప్రభాకరరావు ఈరోజో రేపో విచారణకు హాజరవుతారని అంటున్నారు. ఇద్దరు ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పటికే కేటీయార్ అంగీకరించారు. టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని అందరికీ తెలిసిందే. ప్రభాకరరావు వాగ్మూలం ఆధారంగా కేసీయార్ మీద కేసులు నమోదైతే ఇందులో నుండి బయటపడటం కష్టమే. అందుకే కేసీఆర్ బీజేపీ జోలికి పోవడం లేదు. పోరు కూడా.

రేవంత్ రెడ్డికి  పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన పూర్తిగా సరెండర్ అయ్యారు. బడే భాయ్ అని సంబోధించి.. తాను రాష్ట్ర స్థాయిలోనే  లీడర్నని.. జాతీయ స్థాయిలో .. అడ్డం రానన్న సంకేతాలు పంపారు. ఇక  బీజేపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకునే సాహసం చేస్తారా ?. మా ఎమ్మెల్యేల జోలికి వస్తే నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం ఉండదని బీజేపీ ఎల్పీ నేత హెచ్చరించారు. బీజేపీ పెద్దలు తల్చుకుంటే… చేయగలరు కూడా.,  అందుకే బీజేపీ జోలికి వెళ్లే ధైర్యం రేవంత్‌కు కూడా లేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి