కేసీఆర్ వ్యవసాయం, రైతుల సమస్యలు అజెండాగా మార్చుకుని లోక్ సభ ఎన్నికల కోసం బయటకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైన రాజకీయ సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. కానీ ఆయనకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. వాటి మధ్యే ఆయన రాజకీయం చేస్తున్నారు. బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. పూర్తిగా కాంగ్రెస్‌నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ రాజకీయం బీఆర్ఎస్ను నిలబడుతుందా ?. కుమర్తె అరెస్టుపైనా స్పందించలేనంత నిస్సహాయతతో చేసే రాజకీయాలు సఫలం అవుతాయా ?
కవితను బీజేపీలోకి రావాలని బెదిరించారని లేకపోతే కేసులు, అరెస్టులు తప్పవని బీజేపీ బెదిరించిందని 2022 నవంబర్‌లో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా స్పందించింది చాలా తక్కువ. అయితే అప్పట్లో కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు. బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని.. అప్పట్లో స్పష్టం చేశారు. కవితపైనే కాదు పార్టీ నేతలపైనా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని అయినా ఆందోళన చెందవద్దని చెప్పారు. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత చూస్తే.. కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా.. కవితను అరెస్టు చేసినా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీని ఒక్క మాట అనడం లేదు. కవితను అరెస్టు చేసిన రోజున కేటీఆర్ బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు.
కవిత అరెస్ట్ పైనే కాదు.. బీజేపీ పాలనపైనా కూడా ఆయన స్పందించడం లేదు. జాతీయ రాజకీయ అంశాలపైనా స్పందించడం లేదు. పూర్తిగా బీజేపీ విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సీఏఏను అమల్లోకి తెచ్చినా బీఆర్ఎస్ స్పందించలేదు. నిజానికి సీఏఏ అంశం బీఆర్ఎస్కు కీలకం. ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీపై తీవ్రంగావిరుచుకుపడే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వదలుకున్నారు. బీజేపీ జోలికి వెళ్లాలని అనుకోవడం లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. అయితే కరువు వొచ్చిందని దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని నిందిస్తూ.. బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించారు . ఓ రైతుకు ఐదు లక్షల సాయం కూడా ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌దే కరువు పాపమని నిందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే.. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్సే కారణని నిందిస్తూ.. వీడియోలు మీద వీడియోలు చేస్తున్నారు.
అయితే నీరు ఎందుకు అందుబాటులో లేదన్న అంశాన్ని మాత్రం బీఆర్ఎస్ ఎక్కువ చర్చల్లోకి తీసుకు రాకుండా.. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మరీ కాస్త అతిగా ఉన్నప్పటికీ.. వీలైనంత ఎక్కువ మందిని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడైనా పచ్చగా ఉంటో ఫోటోలు తీసుకుని కాళేశ్వరం మహిమ అంటున్నారు. అయితే ఇంత త్వరగా కాంగ్రెస్‌ను నిందించడం కరెక్టేనా.. తొందపాటు అవుతుందా అన్నదానిపైనా అనేక విశ్లేషణలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం మరో చాయిస్ లేనట్లుగా పూర్తిగా బీజేపీని ఇగ్నోర్ చేయాలని.. కాంగ్రెస్ పై మాత్రమే పోరాడాలని వ్యూహాన్ని పాటిస్తున్నారు.
నిజానికి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో.. బీఆర్ఎస్కు ముప్పుగా మారింది. ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. దీనికి సహకరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ రాజకీయం ఉంది. అది ఆ పార్టీ నిస్సహాయతలా మారింది. తమ నేతుల కాంగ్రెస్ లోకి వెళ్లినా.. అసలు ముప్పు బీజేపీ నుంచే పొంచి ఉంది. నిజానికి కాంగ్రెస్, బీజేపీ కలిసే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ భేటీ జరిగినప్పుడు ఇదే అజెండాపై చర్చించారన్న పుకార్లు వచ్చాయి. తర్వాత రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనపడటం ప్రారంభమయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతల్ని ముందుగానే చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని బలహీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ విషయం బీఆర్ఎస్కు అవగాహన లేకుండా ఉండదని అనుకోలేం.
భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తే ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తాయని.. బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే ఆ పార్టీపై వీలైనంత మౌనం పాటిస్తోంది. ఇదే అలుసుగా బీజేపీ.. బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ సాయంతో ఆక్రమిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నిస్సహాయంగా కనిపిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…