టీ.కాంగ్రెస్ లీడర్లు ఏమయ్యారు ? – What Happened T.Congress Leaders

By KTV Telugu On 4 April, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమేంటి. లోక్ సభ ఎన్నికలకు ఆయన ఎందుకు పక్క  పార్టీల నుంచి అరువు తెచ్చుకుంటున్నారు. జెండా మోసి, కుర్చీలు వేసిన  వారికి అవకాశం ఇవ్వకుండా  పక్క పార్టీల నుంచి వచ్చిన  వారికి బీ ఫార్మ్ ఇవ్వడం సబబేనా. ఇంతవరకు జరిగింది  ఒక  ఎత్తు అయితే మిగిలిన సీట్లకైనా పార్టీలో ఇన్ సైడర్స్ కు కేటాయిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. బీఆర్ఎస్ పూర్తిగా మట్టికరిచిపోయింది. మరో ఐదేళ్ల  పాటు కాంగ్రెస్ కు తిరుగులేదని, బీఆర్ఎస్ లేచి నిల్చోవడం కూడా కష్టమని ఇట్టే అర్థమైపోయింది. అయినా సరే పార్లమెంటు ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్ నేతల తీరు మారిపోయింది. బీఆర్ఎస్ వారందరినీ చేర్చుకుని  ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతీ ఎంపీ నియోజకవర్గానికి  అరడజను మంది ఆశావహులున్నప్పటికీ వారందరినీ పక్కన  పెట్టి  మరీ ఇంతకాలం బీఆర్ఎస్ తో అంటకాగిన వారికి

టికెట్లు ఇస్తున్నారు. పిలిపించుకుని మరీ కండువా కప్పుతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. చేవెళ్ల స్థానంలో అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన సునీత మహేందర్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. తర్వాత రంజిత్ రెడ్డి చేరగానే ఆయనకు చేవెళ్ల స్థానం అప్పగించి.. సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి పంపించారు. అటు సునీత, ఇటు రంజిత్ ఇద్దరు కూడా భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చినవారే. ఇక వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ప్రకటించిన కడియం కావ్య కూడా భారత రాష్ట్ర సమితికి చెందినవారే. ఆమె తండ్రి కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనప్పటికీ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన భారత రాష్ట్ర సమితిని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

బీఆర్ఎస్ లో ఉంటే గెలవలేమని నిర్ణయించుకున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు వస్తున్నారు. అంటే తమ వ్యక్తిగత పరపతితో కాకుండా పార్టీ పేరు చెప్పుకుని గెలవాలనుకుంటున్నారు. ఐనా సరే వారికి కాంగ్రెస్ పార్టీ ఎర్రతివాచీ పరుస్తోంది. ఇలా రండి, అలా టికెట్ తీసుకోండని చెబుతోంది….ఇదంతా కేవలం రేవంత్ గేమ్ ప్లానే కావచ్చు. ఇందులో ఇతరుల ప్రమేయమేదీ లేదని అధిష్టానాన్ని ఆయనే కన్విన్స్ చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న మాట…..

ఓడిపోయే పార్టీలో ఉండే కంటే, గెలిచే కాంగ్రెస్ కు రావడం మంచిదని కడియం శ్రీహరి నిర్ణయించుకున్నారు. ఒక రకంగా ఈ పరిణామం కడియం కావ్యకు మంచిదే. ఇది ఆమెకు లభించిన ఆయాచిత వరం. చాలా కాలం భారత రాష్ట్ర సమితిలో కొనసాగిన శ్రీహరి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ బేలతనాన్ని సూచిస్తోంది. ఈ క్రమంలో అప్పటి  దాకా కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరని అందుకే కడియం కావ్యను  తెచ్చుకున్నారన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఎన్నికల ముందు ఫిరాయించి సికింద్రాబాద్  టికెట్ పొందారు. దానితో నియోజకవర్గంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించే నాయకుడు లేక.. దానం నాగేందర్ ను తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు నలుగురు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. మిగిలిన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకైనా  సొంత వారిని నిలబెడతారా అరువు తెచ్చుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇందులో పూర్తిగా రేవంత్ రెడ్డి మంత్రాంగమే ఉందని చెబుతున్నారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ భారీగా డబ్బు ఖర్చు  పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే…భారీగా ఖర్చు పెట్టి విజయం సాధిస్తారన్న విశ్వాసం రేవంత్ లో ఉంది. పైగా కొత్త  వారైతే తన  మాట వింటారని కూడా ఆయన నమ్ముతున్నారు…

సీఎం రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు కీలకమవుతాయి. 14 స్థానాల్లో గెలుస్తామని రేవంత్ చెబుతున్నా కనీసం  పది చోట్ల గెలిచి చూపించాల్సిన అనివార్యత ఆయనకున్నది. పైగా  పార్లమెంటు ఎన్నికల్లో  మోదీ పరపతి బాగా పనిచేసి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారొచ్చు. అందుకే అంగబలం, అర్థబలం ఉన్న వారిని పిలిచి టికెట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చెలరేగే అసమ్మతిని ఆయన ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి