ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. తన చిన్నాన్న వై.ఎస్. వివేకానంద రెడ్డి చివరి కోరిక తాను కడప నుండి పోటీచేయడమే అంటున్నారు షర్మిల. తన ప్రత్యర్ధి వై.ఎస్. అవినాష్ రెడ్డిని షర్మిల ఢీకొనబోతున్నారు. కొంత కాలంగా షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న చంద్రబాబు-పవన్ ల పార్టీలు కడపలో షర్మిలకు పరోక్షంగా సహకరిస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కడపలో వై.ఎస్. కుటుంబానికి కడపలో తిరుగులేకుండా వస్తోంది. ఎన్నిక ఏదయినా వై.ఎస్.ఆర్. ఆశీస్సులు ఉన్నవారే గెలుస్తూ వస్తున్నారు. వై.ఎస్.ఆర్. మరణానంతరం కడపతో పాటు రాయలసీమలో తండ్రి వారసత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి అంది పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో అయితే 52 స్థానాలున్న రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏకంగా 49 చోట్ల ఘన విజయాలు సాధించింది. ఈ ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు అదే ఊపు ఉందని ఆ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది..
ఏడాది క్రితం తెలంగాణాలో సొంత పార్టీ స్థాపించిన షర్మిల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో సత్తా చాటాలని అనుకున్నారు. అయితే చివరి నిముషంలో అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత మారిన సమీకరణల్లో ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుణ్ని మించి షర్మిల తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన చిన్నాన్న హత్య కేసులో హంతకులను జగన్ మోహన్ రెడ్డి కాపాడుకొస్తున్నారన్నంత తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి షర్మిల సమాయత్తమయ్యారు.
తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో షర్మిల కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఇక్కడి నుండి బరిలోకి దింపినట్లు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వై.ఎస్. వివేకానంద రెడ్డి తనయ సునీత కడప నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత టిడిపి నుండి కాదు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారని అన్నారు. ఆమెకు నైతిక మద్దతుగా టిడిపి తమ అభ్యర్ధిని బరిలో దించకుండా సంఘీభావం తెలుపుతుందని అన్నారు. అయితే అవన్నీ పక్కకు పోయాయి.
కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేయడం ద్వారా షర్మిల ఏం సాధించాలనుకున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజంగానే ఆమె కడప నుండి గెలవగలనని నమ్ముతున్నారా? అని వైసీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కడప జిల్లాలో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక వాతావరణం లేదు. అయితే జగన్ మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు.. దివంగత వై.ఎస్.ఆర్. గారాల బిడ్డ కావడంతో కడప ప్రజలు ఆమెను ఆశీర్వదిస్తారన్న ఆశలు షర్మిలకు ఉన్నాయంటున్నారు. దాంతోనే ఈ ఎన్నికల్లో సత్తా చాటగలనని ఆమె ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు.
అయిదే కడప లోక్ సభ స్థానం పరిధిలోని కీలక రాజకీయ నేతలతో పాటు మేథావులు మాత్రం షర్మిల పోటీ చేసినా ఆమె ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కడపలో జనం బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లోనూ కడపలో జగన్ మోహన్ రెడ్డి పార్టీదే హవా అంటున్నారు స్థానిక నేతలు. అయితే టిడిపి,జనసేనల పరోక్ష మద్దతుకు తోడు తన తండ్రి ఆశీస్సులతో తాను సంచలనం సృష్టిస్తానని షర్మిల అంటున్నారు. ఆమె ఏం చేస్తారన్నది జూన్ 4నే తేలుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…