తుక్కుగూడ సెంటిమెంట్ – CM Revanth Reddy-Rahul Gandhi

By KTV Telugu On 6 April, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ, క్రికెట్లోనూ సెంటిమెంట్లు బాగా పనిచేస్తుంది. ఒక ప్రదేశంలో, ఓ టైమ్ లో పనులు ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని ఎదురు చూడటం సాధారణ సెంటిమెంట్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ పనిచేస్తోంది. అదే హైదరాబాద్లోని తుక్కుగూడ సభకు సంబంధించిన సెంటిమెంట్. అందుకే రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన తొలి సభ జనజాతరను తుక్కుగూడలో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే సభకు కాంగ్రెస్ కు చెందిన అతిరథ మహారథులు హాజరవుతున్నారు…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న తుక్కుగూడ పబ్లిక్ మీటింగ్‌పై సీఎం, మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్లు సభా స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించగా, రోజుకు కొందరు మంత్రులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పనులను చక్కపెడుతున్నారు. సుమారు 10 లక్షల మంది జనాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో ప్రధానంగా లక్షమంది మహిళలను వేదిక ముందు వరసలో కూర్చోబెట్టి, అమలు అవుతున్న సిక్స్ గ్యారెంటీస్ కు థాంక్స్ చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న సిక్స్ గ్యారెంటీస్‌తో మహిళలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ ప్రభావం తుక్కుగూడ సభలో ప్రతిబింబించే తీరుగా మహిళలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల మహిళల్లో నెలకొన్న ఉత్సాహాన్ని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి కనిపించే విధంగా సభా వేదిక ముందు లక్ష మంది మహిళలను కూర్చోబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సమీప జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆ ప్రాంగణంలో కనిపించేవిధంగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి జనజాతర సభ విపక్షాలు చర్చించుకునే విధంగా నిర్వహించాలని కాంగ్రెస్ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

తుక్కుగూడ తెలంగాణలో కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఒక సెంటిమెంట్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని అక్కడ నుంచే పూరించి.. పార్టీని గెలిపించుకున్నారు.   అందుకే ఇప్పుడు తుక్కుగూడ వేదికగా  కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో  విడుదల చేయబోతున్నారు. అదీ కూడా ఒక సెంటిమెంటే అవుతుంది….

తెలంగాణ విలీన దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సెప్టెంబ‌రు 17న తుక్కుగూడ‌లో విజ‌య‌భేరి పేరిట భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. విజ‌య‌భేరి వేదిక మీద నుంచే సోనియ‌గాంధీ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించారు. ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన‌డంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. రాష్ట్రంలో ఏ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కొలువుదీరిందని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు క‌లిసివ‌చ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌స‌భ ఎన్నిక‌లకు స‌మ‌రశంఖం పూరించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం తీర్మానించింది. అలా అనేకంటే రేవంత్ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిందని అనుకోవాలి..పైగా తాము గెలుస్తున్నామని, డిసెంబరు 9న  ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా రేవంత్ అప్పట్లో ప్రకటించి మంచి మైండ్ గేమ్ ఆడేశారు. చెప్పినట్లుగానే పార్టీ గెలిచిందీ. రెండు రోజులు ముందుగా  డిసెంబరు 7నే  ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను ఫాలో కాబోతున్నట్లు సమాచారం. శనివారం జరిగే తుక్కుగూడ సభ వేదికగా ఎన్ని లోక్ సభా  స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందో రేవంత్ స్వయంగా ప్రకటించి సెకెండ్ సెంటిమెంటుకు తెరతీస్తారు. జనంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు జరిపిన హామీల ఆధారంగా దేశం మొత్తం మీద ఆ పార్టీని ఎన్నుకోవాలని అభ్యర్థించబోతున్నారు. తుక్కుగూడ సభా వేదికపై కాంగ్రెస్ జాతీయ మెనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేసే స్కీమ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులను విస్తరించడం, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు ట్రైన్ల సంఖ్య పెంచడం, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్లు ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాల్లోనూ పారిశ్రామిక కారిడార్లు, మూసీ నదీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్, వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి….

దేశ  రాజకీయాల్లో కాంగ్రెస్ వెనుకబడిపోయి ఉన్నట్లు కనిపించినా.. పోరాట పటిమ మాత్రం తగ్గలేదు. బీజేపీకి ధీటుగా తాము తలపడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. త్వరలో బీజేపీని గద్దె దించుతామన్న ధీమా కూడా వారిలో ఉంది. అందుకు తెలంగాణ ప్రజల మద్దతును వాళ్లు కోరుతున్నారు. అక్కడే తుక్కుగూడ సెంటిమెంట్ పనిచేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాకుండా జాతీయ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి