అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బిజెపి లోక్ సభ ఎన్నికలు వచ్చే సరికి కొంత డీలా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్లు అందుకున్న వారు ప్రచారం లో చాలా వెనకబడి ఉన్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రచారంలో కమలనాథులను కొన్ని అంశాలు తీవ్రంగా కలవర పెడుతున్నట్లు చెబుతున్నారు. అసలింతకీ తెలంగాణా బిజెపిలో ఏం జరుగుతోంది. ?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాజకీయ మంటలు రాజుకుంటున్నాయి. కమలనాథులు అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించారు. అంత వరకు బాగానే ఉంది.. సీన్ కట్ చేస్తే.. కొంత మంది కాషాయ పార్టీ అభ్యర్థులు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టడం లేదట. ఇదే విషయం హస్తిన వరకు వెళ్లింది. అలా వచ్చి ఇలా టికెట్లు ఎగురేసుకెళ్లిన నేతలు…ఎన్నికల ప్రచారంలో సీరియస్గా వ్యవహరించడంలేదని పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
నల్లగొండ బీజేపీ అభ్యర్థిగా శానంపుడి సైదిరెడ్డి టికెట్ దక్కించుకున్నా…ప్రచారం మాత్రం ఇంకా ప్రారంభించలేదని స్థానిక పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత,,, సోషల్ మీడియా స్టార్ గా ఇంటర్వ్యూలకే పరమితమయ్యారనే విమర్శలున్నాయి. లోకల్ క్యాడర్ ను కలుపుకునే వెళ్లే ప్రయత్నమే చేయడం లేదని హైకమాండ్ వరకు ఫిర్యాదులు వెళ్లాయి.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న తాండ్ర వినోద్ రావు.. తాపీగా ఇంటికే పరిమితమయ్యారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
టికెట్ ఆశించిన జలగం వెంకట్ రావు, వెంకటేశ్వర్లు వర్గాలు ఏ మాత్రం సహకరించకపోవడంతో ప్రచారం పట్టాలు ఎక్కడం లేదు. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర నేతలు ఖమ్మం వెళ్లినా.. ప్రయోజనం లేదని సమాచారం. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా టికెట్ సాధించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్… జనంలోకి రావడం లేదని లోకల్ బీజేపీ పాత నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆరూరి రమేశ్ ప్రచార రంగంలోకి దిగుదామంటే.. పాత నేతల పలకరింపే కరువైందనే టాక్ నడుస్తోంది.
పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న గోమాస శ్రీనివాస్ జాడే లేదని అక్కడ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. టికెట్ తెచ్చుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా అని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ది అదే పరిస్థితి. టికెట్లు దక్కించుకున్న నేతలు ప్రచార పర్వం ప్రారంభించకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ప్రచారంలో వెనకబడ్డారని తెలుస్తోంది. సమస్య పరిష్కారంపై రాష్ట్ర నాయకత్వం చొరవ చూపడం లేదని విమర్శలున్నాయి.
మరోవైపు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ లో అరవింద్, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్, కరీంనగర్ లో బండి సంజయ్, మెదక్ లో రఘునందన్ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. బస్తీలు, కాలనీలు, గ్రామాలు చుట్టేస్తూ.. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పాత నేతలు తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి ఇంటి ముఖం చూడకుండా జనంలో తిరుగుతుంటే … మరోవైపు అనూహ్యంగా టికెట్టు దక్కించుకున్న నేతలు గడప దాటకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…