ఏపీలో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కోరుకుంటే..చివరి నిముషంలో పొత్తు కుదరడం వెనుక ఏం జరిగింది? పొత్తు పెట్టుకున్నారు సరే.. పార్టీకి మొదట్నుంచీ నమ్మకంగా పనిచేసిన ఆరెస్సెస్ నేతలను అవమానించి.. వలస నేతలకు పెద్ద పీట వేయడం వెనుక ఉన్న కుట్ర దారులెవరు? ఎవరి ప్రయోజనాల కోసం ఏపీ బిజెపిని బలిపీఠం ఎక్కించారు? దానికి ఎవరు సహకరించారు? ఇపుడీ ప్రశ్నలే ఏపీ బిజెపిలో తచ్చాడుతున్నాయి.తమ అభీష్టానికి వ్యతిరేకంగా బరిలో ఉన్న అభ్యర్ధుల విజయానికి తాము పాటుపడేదే లేదని సీనియర్ నేతలు తేల్చి చెప్పేశారు. దీని ప్రభావం ఎలా ఉండచ్చన్న ప్రశ్నలూ వస్తున్నాయి.
ఏపీలో ఒంటరి పోరాటానికి సిద్ధంగా లేని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత పవన్ రాయబారంతోనే బిజెపి తో పొత్తుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టిడిపితో పొత్తుకు సుముఖంగా లేని బిజెపి జాతీయ నాయకత్వం ఏపీ బిజెపి నాయకత్వానికి సంకేతాలు కూడా పంపింది.ఈ ఎన్నికల్లో ఏపీలో బిజెపి అన్ని స్థానాలకు ఒంటరిగానే పోటీ చేయాలని ఆదేశించింది. పార్టీ శ్రేణులు కూడా ఒంటరి పోరుకు హుషారుగా ఒప్పుకున్నారు. దానికి తగ్గట్లే ఏపీ నాయకత్వం నియోజక వర్గాల వారీగా ఆశావహుల జాబితా సిద్ధం చేసింది.
ప్రతీ నియోజక వర్గంలోనూ ముగ్గురేసి అభ్యర్ధుల పేర్లు ప్రతిపాదిస్తూ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపారు. ఈ క్రమంలో బిజెపి హై కమాండ్ తరపున వచ్చిన ప్రతినిధులు రాష్ట్ర నాయకులతో సమాలోచనలు చేసి మెజారిటీ పార్టీ నేతల అభిప్రాయాన్ని సేకరించారు. పార్టీలో ప్రతీ ఒక్కరూ కూడా బిజెపి ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. పొత్తులు వద్దే వద్దని అందరూ అన్నారు. మెజారిటీ నేతల అభిప్రాయాలన్నీ క్రోడీకరించి హై కమాండ్ కు పంపారు. ఇక ఏ క్షణంలో అయినా ఏపీలోని మొత్తం 175 నియోజక వర్గాలకు అభ్యర్ధుల పేర్లతో జాబితా విడుదల చేస్తారని జిల్లాల స్థాయి కమలనాథులు భావించారు.
హఠాత్తుగా బిజెపి హై కమాండ్ బాంబు పేల్చింది. టిడిపి-జనసేనతో పొత్తు పెట్టుకుంటోన్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన ఏపీలో బిజెపి శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అన్ని కసరత్తులు చేసి..ఒంటరి పోరుకు మెజారిటీ నేతలు అభిప్రాయ పడిన తర్వాత..ఆ నివేదికను హై కమాండ్ కు సమర్పించిన తర్వాత చివరి నిముషంలో టిడిపితో పొత్తు కుదరడం వెనుక ఎవరి హస్తం ఉందో అర్ధం కాక ఏపీ బిజెపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి ఒక్కరే టిడిపికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
పురందేశ్వరితో పాటు అయిదేళ్ల క్రితం టిడిపి నుండి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, బిజెపిలో ఉంటూ చంద్రబాబు అజెండా ప్రకారం నడుచుకుని సత్య కుమార్ వంటి నేతలంతా కూడా పొత్తు ఉండాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు. చివరి నిముషంలో పురందేశ్వరే పార్టీ అగ్రనేతల వద్ద చక్రం తిప్పి టిడిపితో పొత్తు ఉంటేనే మనకి మంచిదని కమలనాథులను ఒప్పించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఆయన బంధువు అయిన పురందేశ్వరి ఏపీ బిజెపిలోని ఒరిజినల్ నేతలయిన సోము వీర్రాజు, జి.వి.ఎల్.నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి మొండి చెయ్యి చూపించారని భావిస్తున్నారు.
పొత్తు కుదరడం వెనుక..అసలైన ఆరెస్సెస్ నేతలకు టికెట్లు రాకుండా అడ్డుకోవడం వెనుక కుట్ర ఉందని బిజెపి సిద్ధాంతాలను ప్రేమించే నేతలు అంటున్నారు. ఏపీ బిజెపి ఆరెస్సెస్ బిజెపి-చంద్రబాబు బిజెపిగా రెండుగా చీలిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు-పురందేశ్వరి కలిసి బిజెపి అగ్రనేతల్లో కొందరిని ఒప్పించి తీసుకున్న నిర్ణయాల పట్ల సంప్రదాయ కమలనాథులు మండి పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆరెస్సెస్ నేపథ్యంతో పార్టీలో చేరిన వారంతా కూడా వలస నేతల విజయానికి పనిచేసే పరిస్థితి లేదని బిజెపి నేత అంబికా కృష్ణే అన్నారు. ఒక వర్గం నేతలంతా కూడా అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఇది బిజెపిని నిట్ట నిలువునా చీల్చిన పరిణామమే అంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…