టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు యవగళ యాత్రికుడు నారా లోకేష్ ఎక్కడున్నారు? ఏడాది క్రితం ఆయన యువగళం యాత్ర సూపర్ హిట్ అని ప్రచారం చేసుకున్న టిడిపి నాయకత్వం ఎందుకని లోకేష్ ను తెరపైకి తీసుకురావడం లేదు. కేవలం మంగళగిరి నియోజక వర్గానికి మాత్రమే లోకేష్ ను పరిమితం చేయడం వెనుక ఉన్నది వ్యూహమా? జాగ్రత్తా? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తన కుమారుని ఎక్కువ ఫోకస్ చేయకూడదని నిర్ణయించుకున్నారా?
తెలుగుదేశం-జనసేన-బిజెపిలు పొత్తు పెట్టుకున్న తర్వాత నారా లోకేష్ ప్రముఖంగా ఎక్కడా కనిపించడం లేదు. మూడు పార్టీలు కలిసి నిర్వహించిన చిలకలూరి పేట సభలో ఆయన వేదికనే ఎక్కలేదు. వేదిక కింద పార్టీ శ్రేణులతో కలిసి ఉండిపోయారు. బిజెపితో పొత్తు కుదరక ముందు టిడిపి-జనసేనలు సంయుక్తంగా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభలోనూ లోకేష్ లేరు. తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తోన్న చంద్రబాబు నాయుడు ఈ రెండు సభలకు లోకేష్ ను ఎందుకు వేదికను ఎక్కించలేదో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు.
గత ఏడాది జనవరిలో నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర మొదలు పెట్టారు. దానికి అనుకున్నంతగా స్పందన రాలేదు. పైగా యాత్ర సందర్భంగా లోకేష్ చేసిన ప్రసంగాల్లో తడబాట్లు నోరు జారడాలు వంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. యాత్రకు జనం రావడం లేదంటూ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకేష్ యాత్రకు జనాన్ని ఎందుకు సమీకరించడం లేదని స్థానిక నేతలను నిలదీశారు. జనం రాకపోవడంతో పెద్దాయన బాధ పడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు అచ్చెన్న.
ఆ తర్వాత కొనసాగిన యువగళం సభల్లో లోకేష్ రెడ్ బుక్ పైకి తీయడం అధికారులు, పాలక పక్ష నేతల పేర్లు అందులో నోట్ చేసుకుంటున్నానని బెదిరించడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాయి. స్పందన లేని యాత్రను ఎలా ఆపాలో అర్ధం కాని తరుణంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఆ సమయంలోనే లోకేష్ యువగళానికి బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మొత్తం యాత్రను చుట్టేసి విశాఖ జిల్లాలో ముగించారు. ఆ సభలో పవన్,చంద్రబాబు లతో లోకేష్ వేదికపై కనిపించారు.
విశాఖ సభ తర్వాత లోకేష్ నెమ్మది నెమ్మదిగా కనుమరుగయ్యారు. టిడిపి-జనసేనలు తమ అభ్యర్ధుల తొలి జాబితాలు విడుదల చేసిన సందర్బంలో పవన్, చంద్రబాబు, అచ్చెంనాయుడు ఉన్నారు కానీ లోకేష్ లేరక్కడ. ఆ తర్వాత నుంచి లోకేష్ పూర్తిగా మంగళగిరికే పరిమితం అయ్యారు. దీనికి కారణంలో లోకేష్ ఇప్పటికీ పరిణతితో మాట్లాడలేకపోవడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకేష్ చేత మాట్లాడిస్తే రాజకీయ ప్రత్యర్ధులకు ఆయుధం చేతిలో పెట్టడమే అవుతుందని పార్టీ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో చెప్పడం వల్లనే చంద్రబాబు కూడా లోకేష్ ను మంగళగిరి పరిమితం చేసి ఉండచ్చంటున్నారు.
లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని చంద్రబాబు తహ తహ లాడుతున్నారు. 2014 ఎన్నికల అనంతరం లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు.2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు. ఈ సారి అయినా మంగళగిరి నుంచి గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా ఉన్నారు కానీ లోకేష్ పై బలమైన బీసీ అభ్యర్ధి బరిలో ఉండడంతో కంగారు పడుతున్నారు. అందుకే లోకేష్ ను మంగళగిరికే పరిమితం చేసి ప్రచారం చేసుకోమన్నారని అంటున్నారు. ఈఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెచ్చి లోకేష్ కి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. అంత వరకు ఆయన్ను లైమ్ లైట్ లో లేకుండా పక్కన పెట్టడం వెనుక బాబు మార్క్ వ్యూహం ఉందంటున్నారు. అయితే ఈ వ్యూహం వర్కవుట్ అవుతుందా బెడిసికొడుతుందా అన్నది జూన్ 4న తేలిపోతుందంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…