ఖమ్మం అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి రాకెట్ సైన్స్ అంత క్లిష్టంగా మారింది. ఎవరికి సీటు ఇవ్వాలో ఎంతకీ అంచనాకు రాలేకపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు రేసులోకి వస్తున్నారు. ఎవరికి వారు తామే బెస్ట్ అన్నట్లుగా హైకమాండ్ ముందు ప్రపోజల్స్ పెడుతున్నారు. చివరికి హైకమాండ్ ఊహించని విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరను ఖరారు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కాకపోతే పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరు ఫైనల్ కావొచ్చంటున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదని సులువుగా గెలిచేస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి. నల్లగొండ, భువనగిరిల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేశారు కానీ ఖమ్మంలో మాత్రం అభ్యర్థు్ని ఖరారు చేయలేకపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటాలో ఉన్న ముగ్గురు మంత్రుల కుటుంబీకులూ టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. తాను పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తన సోదరుడికి ఎంపీ టిక్కెట్ కావాలని పొంగులేటి పట్టుబట్టారు. సీఎం పదవిని వదులుకున్న తనకు న్యాయం చేయాలని తన భార్యకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తన కుమారుడు యుగంధర్ గురించి ఆలోచించాలని తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆయన సీరియస్ గా ప్రయత్నించలేదు. అయితే ఈ ముగ్గురి వారసుల్ని హైకమాండ్ నిర్మోహమాటంగా రేసు నుంచి తప్పించింది.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపు మొగ్గు చూపినా.. తెలంగాణలో లోక్ సభ సీట్లలో అత్యధికం రెడ్డి వర్గానికే కేటాయించాల్సి వస్తున్నందున ఖమ్మం విషయంలో వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ బీసీ లేదా కమ్మ సామాజికవర్గానికి సీటు కేటాయించాల్సి ఉంది. కమ్మ సామాజికవర్గానికి సంప్రదాయంగా టిక్కెట్ కేటాయిస్తూ వస్తున్నారు. అందుకే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆ వర్గం నుంచే బలమైన నేతల్ని పరిశీలించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నుంచి అభ్యర్థి అవుతారని అనుకున్న వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆర్థికంగా బలవంతుడు కావంతో హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఆయన కూడా కమ్మ సామాజికవర్గం నేతనే. అయితే చాయిస్ ఆయన దగ్గరనే ఆపలేదు. రకరకాల కాంబినేషన్లను.. పేర్లను పరిశీలిస్తున్నారు.
ఎప్పుడూ కమ్మ సామాజికవ్గమేనా.. ఈ సారి బీసీలకు చాన్స్ ఇద్దామన్నా చర్చలు కూడా ఆ పార్టీ నేతలు చేసిన్నట్లగా తెలుస్తోంది.
ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు 9 లక్షలు బీసీ ఓటర్లున్నారు. అందులోనూ యాదవ సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గం నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నాగ సీతారాములు అనే నేత పేరును పరిశీలించారు. అయితే ఆయన క్యాడర్ కు పెద్దగా పరిచయం ఉన్న నేత కాకపోవడంతో పక్కన పెట్టారు. మళ్లీ కొత్త కొత్త నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన మండవ వెంకటేశ్వరరావు పేరును కూడా హైకమాండ్ వద్ద ఉందని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భిన్నమైన ఆలోచనలు చేస్తోందని…కేబినెట్ కూర్పు అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తాజాగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ స్థానానికి తుమ్మల నాగేశ్వరరావును పోటీకి పెట్టాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఖాళీ అయ్యే ఖమ్మం స్థానానికి ఆయన కుమారుడికే ఇచ్చేలా హామీ ఇచ్చి.. నిలబెట్టాలని అనుకుంటున్నారు. దీని వల్ల మంత్రి పదవుల బ్యాలెన్స్ కూడా సరిపోతుంని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కూడా ప్రాక్టికల్ గా సాధ్యమా కాదా అన్నది తేలాల్సి ఉంది. సింపుల్గా గెలిచే సీటు కాబట్టి .. పోటీ ఎక్కవగా ఉందని.. అగ్రనేతలంతా పట్టుబడుతూండటం వల్ల.. సమస్యలు వస్తున్నాయని.. చివరికి ఇది ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్లో ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…